Friday 30 October 2015

జీవిత గమ్యం




"ఇన్ని సంవత్సరాల తరవాత చదువు తిరగేసి, మొదటి  కేసు గెలిచినందుకు కాంగ్రాట్యులేషన్స్. అదీ ఏ లాభాపేక్ష లేకుండా మీ ఇంట్లో పని చేసే అమ్మాయికి న్యాయం జరగాలనే సేవా దృష్టి తో వాదించడం అందులో విజయం సాధించడం" అంటూ గొప్ప సైకాలజిస్టు అయిన గీత పొగుడుతుంటే  సంతోషం తో కూడిన గర్వం కలిగింది. నేను గీత ఒకప్పుడు కలసి చదువుకునేవాళ్లం. పెళ్లి, పిల్లల బాధ్యత తో నేను చదువుకి స్వస్తి చెప్పాను కానీ తాను మాత్రం సైకాలజీ లో డాక్టరు పట్టా సాధించి మంచి కౌన్సిలర్ గా పేరు తెచ్చుకుంది. నా పిల్లలు డిగ్రీ చదువులకి వచ్చాకా, గీత సలహాతో మా వారి ప్రోత్సాహం తో 'లా ' చదివాను. మా వారు లాయరు కావడం తో నాకు కొంచం సులువుగానే పట్టా చేతికొచ్చిందని చెప్పొచ్చు.
అందరికంటే ఎక్కువ క్రెడిట్ మాత్రం లక్ష్మి కి చెందాలి అని మనస్ఫూర్తి గా చెప్పగలను.

కాఫీ తీసుకొచ్చిన లక్ష్మి కి కూడా శుభాకాంక్షలు చెప్పింది గీత. ఇంతలో లక్ష్మి "అమ్మా మీరు ఇంకో కేసు టేకప్ చేయాలి. నాకు నా భర్త నుంచి విడాకులు ఇప్పించాలి"

ఆ మాటకి మా ఇద్దరికీ నోటి మాట రాలేదు.

రెండున్నర సంవత్సరాల క్రితం లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఐదవ తరగతి కూడా చదవని దాని వయసు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది. నాజూకుగా, తీరువ గా ఉన్నట్టు అనిపించింది చూడగానే. పక్క ఊళ్ళో మావారి స్నేహితుని ఇంట్లో పని చేసే లక్ష్మికి పెళ్లి చేసి ఈ ఊరు పంపింది వాళ్ళ అమ్మ. తండ్రి లేకపోయినా  ప్రభుత్వ ఉద్యోగిని ఇచ్చి, ఉన్నదాంట్లో ఆర్భాటంగా పెళ్లి చేసింది. అంతవరకు ఇంటి పని నేనే చేసుకునే అలవాటు ఉన్నా చదువు పరీక్షల సమయం లో కాస్త చేదోడుగా ఉంటుందని పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను. చాలా కొద్ది రోజులకే లక్ష్మి మా ఇంట్లో మనిషిలా అలవాటు అయిపోయింది. నాకంటే పొందికగా పని చేస్తుందని చెప్పడానికి ఏ భేషజమూ లేదు నాకు. పట్నం లో దొరికిన  అవకాశాన్ని ఉపయోగించుకుని చాలా త్వరగా కుట్లు అల్లికలు వంటివి  కూడా నేర్చుకుంది లక్ష్మి. కూతురు లేని లోటు తీర్చడానికే ఇది నా ఇంటికి వచ్చిందా అనిపించేది నాకు చాలా సార్లు.

అది ఈ ఊరు రావడం నా అదృష్టమో దాని దురదృష్టమో తెలియదు కానీ, ఒకొక్కరోజు తాగి వచ్చి భర్త కొట్టిన గాయాలు దాని మొహం మీద కనపడి నపుడు మాత్రం కడుపులో బాధ తన్నుకు వచ్చేది. ఆవేశం తో నేను దాని భర్త ని తిడితే పోనీలెండమ్మా, ఏదో బలహీనత. తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియక కొడతాడు. మనిషి చెడ్డవాడు కాదు అని నాకే సర్ది చెప్పేది. ఒకటి రెండు సార్లు దాని భర్త ని ఇంటికి పిలిచి మందలించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. నాకు డిగ్రీ వచ్చిన రోజు నాకంటే దానికే ఎక్కువ సంతోషం కలిగింది.
రెండు నెలల క్రితం తల్లికి బాలేదని తెలిస్తే చూడడానికి ఊరు వెళ్ళి, తిరిగి వస్తూ మూడు సంవత్సరాల పాపని వెంట బెట్టుకుని వచ్చింది. చూడడానికి ముద్దుగా బొద్దుగా ఉంది ఆ పాప. మూడు సంవత్సరాల క్రితం కూలి పని కి వెళ్ళి వస్తుంటే అప్పుడే పుట్టిన పాపని ఎవరో రోడ్డుమీద వదిలేస్తే లక్ష్మి, దాని తల్లి దయతో దాన్ని తెచ్చుకుని పెంచుకుంటున్నారుట. చాలా మంది మీకే దిక్కు లేదు ఇంకా ఆ పసిగుడ్డుని ఎలా సాకుతారు అని వారించినా మేము తినే గంజి అన్నమే దానికి పెడతాము అని ఊరందరికీ సర్ది చెప్పి పెంచుకుంటున్నారు. లక్ష్మి పెళ్లి అయ్యాకా ఆ పాప ని తల్లే చూసుకుంటోంది. ఇప్పుడు తల్లి కి ఆరోగ్యం బాగాలేదని ఆ పిల్ల బాధ్యత ఇది తీసుకుంది. దయాగుణం ఉండాలి కానీ సంపాదనకి దానధర్మాలకి సంబంధం లేదు అనిపించింది ఆ క్షణం నాకు. ఈ బిడ్డ పెంపకం లో నాకు తోచిన సాయం నేను చేద్దాం అని అనుకున్నా మనసులో.

రోజూ కంటే కాస్త ముందుగా వచ్చింది లక్ష్మి ఆరోజు పనిలోకి రోజూ కంటే కాస్త ఎక్కువ గాయాలతో, ఎర్రబడిన కళ్ళతో. ఏమైంది మళ్ళీ తాగొచ్చి గొడవ చేశాడా అన్నా నేను ఆవేశం తో. ఈసారి పోనీలెండమ్మా అనలేదు లక్ష్మి. "ఈ బిడ్డ నాకే పుట్టిందని, ఎవరితోనో తిరిగి బిడ్డని కని తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నా అని, నన్ను వదిలేస్తా అని అంటున్నాడు. తనతో కాపురం చేయాలి అంటే ఈ బిడ్డని అనాథ ఆశ్రమం లో పడేయమంటున్నాడు" అని వాపోయింది లక్ష్మి.

వదిలేయడం అంతా సులువా? కోర్టు విడాకులు ఇవ్వద్దూ అన్నా నా లాయరు బుర్ర ఉపయోగిస్తూ. మాలో కోర్టులు విడాకులు ఉండవు అమ్మా. భర్త వదిలేస్తున్నా అని చెప్పితే అవే విడాకులు. ఈ బిడ్డ నాకు పుట్టలేదని ఎలా నిరూపించుకోగలను మీరే చెప్పండి. రెండు సంవత్సరాలలో నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నాడు నా భర్త. ఇక చేయగలిగినది ఏదీ లేదు. మీకు తెలిసిన రెండు మూడు ఇళ్ళలో పని చూపిస్తే ఈ చంటి దానికి కాస్త లోటు లేకుండా చూసుకుంటాను అని అనగానే దాని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి అనిపించింది.
దాని భర్త ని పిలిపించి సర్ది చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాం నేను మావారు కలసి. నీ ఇష్టం వచ్చినట్టు వదిలేయడానికి కుదరదు కోర్టు విడాకులు ఇచ్చేవరకు అది నీ భార్యే. విడాకులు ఇస్తే నీ జీతం లో కొంత భాగం దానికి ఇవ్వాల్సి వస్తుంది అని బెదిరించి రాజీ కుదర్చడానికి అన్ని అస్త్రాలని వాడాం. ఆ పాపని వదిలేస్తే కాపురం చేస్తానని లేదంటే తానే కోర్టు కి వెళ్ళి ఇద్దరి పీడ వదిలించుకుంటా అని భీష్మించుకుని కూర్చున్నాడు.
ఈ బిడ్డ నీకు పుట్టలేదని నిరూపించచ్చు, అదేమంత కష్టం కాదు. అయినా ఈ పాపని ఏ అనాథ ఆశ్రమంలోనో చేర్పిద్దాం. దూరంగా ఉంటూనే దీని బాగోగులు చూద్దాం. రోడ్డు మీద దొరికిన పాప కోసం నీ జీవితం పాడుచేసుకోకు అని సర్ది చెప్పా ఒక సాధారణ తల్లి హృదయంతో.

పాపని ఎక్కడ ఉంచాలి అనే విషయం తరువాత. ఇది నాకు పుట్టలేదు అని నిరూపించొచ్చా అమ్మా అని ఎంతో ఆశగా అడిగిన ఆ లక్ష్మి అమాయక కళ్ళు నా కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. నిరూపించొచ్చు. అవసరమైతే నీ తరఫున నేను వాదిస్తా అన్నా ఏదో లాయర్ అయిపోయానన్న గర్వంతో. ఆ మాటకి లక్ష్మి పట్టిన పట్టుకి ఫలితం ఇదిగో నా మొదటి కేసు గెలవడం.

ఇంతా కష్ట పడింది నీ సంసారం నిలబెట్టడానికే కదా. పాప బాగోగులు నేను కూడా పంచుకుంటా. దానిని మంచి హాస్టల్ లో పెట్టి చదివిద్దామ్. నీ సంసారం పాడు చేసుకోకు అని సర్ది చెప్పబోయిన నామాట వినకుండా మీరు నా తరఫున వాదిస్తారా లేదా అది చెప్పండి చాలు అని ఒకింత గట్టిగా అడిగింది లక్ష్మి. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ అలా మాట్లాడింది లేదు.

నూవ్వైనా చెప్పవే కౌన్సిలరు, చేతులారా జీవితం పాడుచేసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగం భర్తది. చక్కగా పిల్లాపాపలతో హాయిగా గడపక ఎవరో అనాథ బిడ్డ కోసం మతి చెలించినట్టు మాట్లాడుతోంది. ఈ కేసుకి, హాస్పటల్ కి దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు పెట్టింది. తీరా అన్నీ దానికి అనుకూలంగా వచ్చాక ఎలా వాగుతోందో చూడు. ఒంటరిగా బ్రతకడం అంటే అంత సులువా? లేదా విడాకులు తీసుకుంటే డబ్బులు వస్తాయని ఆలోచనా? TVలో పేపర్ లో చూడట్లేదా రోజుకి ఎన్ని మానభంగాలో. భర్త తో ఉండడం లోనే  సామాజిక భద్రత, ఆర్థిక భద్రత ఉన్నాయి అని దానికి అర్థం అయ్యేలా చెప్పు అన్నాగీతతో నాలో వస్తున్న ఆవేశాన్ని ఆపుకోలేక.
నీ భర్త విడాకులు కోరినప్పుడు పొరాడి ఇప్పుడు ఎందుకు నువ్వే ఇలా అడుగుతున్నావు అని అడిగింది గీత దాని స్టయిల్ లో.

"నాకు చిన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. మా అమ్మ కష్టపడి నన్ను పెంచింది. ఈ పసిదాన్ని పెంచడం మాకు ఎప్పుడూ కష్టం అనిపించలేదు. ఉన్నదానిలో సంతోషం గా గౌరవంగా బ్రతికాము. నా భర్త ఎంత కొట్టినా నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. అది తన బలహీనత అని సరిపెట్టుకున్నా నేను. నా గుణమే సరైనది కాదంటే ఒప్పుకోలేకపోయాను. నా నిజాయతి నిరూపించు కోవడానికి నేను ప్రయత్నించాను. రేపు ఈ పాప పెద్ద అయ్యాకా దానికి కూడా నామీద నమ్మకం, గౌరవం పోకూడదు అనే నేను ఇంత శ్రమ తీసుకున్నాను. కేవలం ఒక వ్యక్తి కి భార్య గా ఉంటేనే భద్రత ఉంటుందంటే నేను నమ్మను. TVలో చెప్పుతుంటే విన్నాను మానభంగం చేసిన వాళ్ళని నపుంసకులు చేయాలి సమర్ధించేవాళ్లు SMS చేయండి అని.  ఈ దేశం లో ఎంతో మంది స్త్రీలు  మగవాళ్ళకి బలి అవుతున్నారు. భార్యకి ఇష్టం లేనప్పుడు చేసినా, ప్రేమ పేరుతో మభ్యపెట్టి చేసినా అది మానభంగమే అని నా ఉద్దేశ్యం. మానభంగం శరీరానికి కాదు మనసుకి ఉంటుంది అని అనుకుంటా నేను. రేపు మా అమ్మని కూడా చూసుకోవలసిన బాధ్యత నామీద ఉంది. డబ్బు, మేడలు లేకపోయినా చక్కగా బ్రతకవచ్చు కానీ ప్రేమ, నమ్మకం లేకుండా కాపురాలు చేయలేము. ఆ మనిషితోనే సంబంధం వద్దు అనుకున్నప్పుడు అతని సంపాదన మీద ఎందుకు ఆశ ఉంటుందమ్మా? నా కాయకష్టం తో అభిమానం గా బ్రతకగలనని నమ్మకం నాకు ఉంది. మీలాంటి మంచి వాళ్ళ అండ నాకు ఎప్పుడూ ఉంటుంది. దయచేసి మీరు ఈ సహాయం చేసిపెట్టండి" అంది తన జీవిత గమ్యం మీద చక్కటి అవగాహన ఉన్నదానిలా.

లక్ష్మి మీద కాదు, తన భర్త మీద జాలి వేస్తోంది నాకు ఈ క్షణం. వజ్రం లాంటి భార్యని అజ్ఞానం తో పోగొట్టుకున్న నిర్భాగ్యుడు లా అనిపిస్తున్నాడు. తనతో పాటూ తన తల్లికి కూడా డి‌ఎన్‌ఏ పరీక్ష జరిపించమని పట్టిన పట్టుకి అంతరార్థం ఇప్పుడు అర్థం అయింది.

చదువుకోక పోయినా లక్ష్మి ఆలోచనా విధానం, దాని ఆత్మ స్థైర్యం ఎంతో నచ్చాయి నాకు. చదువుకి-మనోధైర్యానికి, చేసే పనికి-ఆత్మ గౌరవానికి, సంపాదనకి-గుణానికి ఏరకమైన సంబంధము లేదనే విషయం లక్ష్మి నాకు నేర్పిన పాఠం. నేను చదువుకున్న న్యాయ శాస్త్రం తో దానికి దక్కవలసిన న్యాయానికి నావంతు సాయం చేయడానికి నిర్ణయించుకుని, ఆ తల్లి కాని తల్లిని ప్రేమగా చూస్తున్న  చంటిదాన్ని ఎత్తుకుని ఆప్యాయంగా మొదటిసారి ముద్దాడాను.  


No comments:

Post a Comment