Friday, 20 November 2015

అమ్మంటే అమ్మే





పెళ్లితో అమాంతం అందంగా మారిపోయింది రమ్య జీవితంకోరి చేసుకున్న సుధీర్ కుటుంబం చూపించే అభిమానం ముందు తన గతంలోని బాధలన్నీ మర్చిపోయిందిఅత్తవారింటిలో పురుడు పోసుకుని, సుధీర్కి కొత్తగా బదిలీ అయిన కలకత్తా కి వచ్చింది కొద్దిరోజుల క్రితం. 
తన చదువు, ర్యాంక్లు, సాధించిన ప్రైజ్లుపెద్ద కంపెనీలో ఉద్యోగం ఇవేవీ గుర్తు లేవు రమ్యకి,  నాలుగు నెలల పసి పాప బోసి నవ్వులకి మురిసిపోవడం తప్పతనకి ఇంక వేరే ఆశ లేదు మంచి అమ్మ అనిపించుకోవడం తప్ప.

"చూడమ్మా, గదిలో దూరి తలుపు వేసుకుంది నీ కోడలుఅపాయింట్మెంట్ ఇచ్చిన టైమ్ కూడా దాటిపోయేలా ఉంది, ఎలా ఒప్పిస్తావో నీదే భారం" అని తల్లిని ఊదరకొట్టాడు సుధీర్.

"రమ్యా, ఏమీ కాదమ్మా, రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతుంది, బయటకి రామ్మా" అని బ్రతిమాలగా మెల్లగా 
బయటకి వచ్చింది రమ్యపోనీ నేను అమ్మ వెళ్తాం, నువ్వు ఇంట్లో ఉండు అని సర్దిచెప్పబోయాడు సుధీర్ఇంజెక్షన్ నొప్పికి ఏడిస్తే కొద్దిగా 
పాలు తాగిస్తే ఏడుపు ఆపుతారు పిల్లలుదానినే తీసుకువెళ్ళు అని ఒప్పించగా వేక్సిన్ వేయించడానికి తీసుకెళ్లారు పాపని.

వేక్సిన్ వేయించి బయటకి వస్తూ ముక్కులో గొట్టాలు, చేతులకు సూదులతో చిన్నారులని చూసి కలవరపడింది రమ్యఒక పసిపాపకి 
సపర్యలు చేస్తున్న ఒక ఆవిడ తన కంటపడిందిఆమెని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించిందిఇంటికి వచ్చినా కూడా ఆమె 
మొహమే తన కళ్ళలో మెదులుతోంది.

పరధ్యానంగా ఉన్న రమ్యని "త్వరగా తినేసి పడుకోఒక రాత్రి వేళ పాపకి నొప్పి చేసి ఏడిస్తే మళ్ళీ నిద్ర ఉండదుమిగిలిన పని నేను చూసుకుంటాఅని భోజనం ఏర్పాట్లు చేసింది అత్తగారు.

ప్రయత్నిస్తోందే కానీ నిద్ర రావట్లేదుహాస్పిటల్లో కనిపించిన వ్యక్తే కళ్ల ముందు మెదులుతోందిఎక్కడో బాగా చూసిన ముఖంఎక్కడ 
చూసిందో మాత్రం గుర్తురావటం లేదుమనిషిని పోలిన వాళ్ళు ఉంటారు అని ఎక్కువ ఆలోచించకుండా పడుకోమని సర్దిచెప్పాడు సుధీర్.

"అమ్మా?" అవును అమ్మేతనకు ఊహ వచ్చాకా ఒకే ఒక్క సారి చూసింది అమ్మని. 
అదీ 16,17 సంవత్సరాల క్రితంలీలగా గుర్తొస్తోంది తనకిఅమ్మ మాట్లాడకుండా నుంచుని ఉంటే నానమ్మ గట్టిగా ఏదో మాట్లాడి పంపించిందిఅప్పుడు తన వయసు 6,7సంవత్సరాలు ఉండచ్చుఅమ్మగురించి నానమ్మ చెప్పడమే కానీ తనకు ఏమీ తెలియదుఅమ్మకి  పనీ చేత కాదనీ, తనని కూడా చూడకుండా చదువు, డిగ్రీలు అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందని, తనని కలవడానికి కూడా ఎప్పుడూ రాలేదని, 
తననినాన్నని వదిలేసి వెళ్లిపోయిందనీ ఇంకా ఏదో ఏదోక్రమక్రమంగా అమ్మ మీద ద్వేషం పెరిగింది రమ్యకిఇంట్లో అమ్మ ఫోటో కూడా 
లేదుకనీసం తనకి అమ్మ పేరు కూడా తెలియదుతనకి నానమ్మ, తాత వీళ్ళే రికార్డుల్లో అమ్మ-నాన్న
నాన్న అప్పుడప్పుడు వచ్చిఏవో కొని ఇవ్వడమే కానీ నాన్న ప్రేమ కూడా తనకి తెలియదుపిన్ని, తమ్ముడు ఉన్నారు కానీ ఎప్పుడైనా 
పండగలకే వస్తారు జీవితంమీద తనకు ఉన్న కసిని చదువుతో కప్పి పెట్టుకుంది రమ్యఎన్నో ర్యాంకులు, బహుమతులు సాధించింది. 
వీటన్నిటినీ మరిచిపోయేంత ప్రేమ అత్తవారింట దొరికింది రమ్యకి.

మరుసటి రోజు సాయంత్రం పాపని అత్తగారికి అప్పచెప్పి ముందురోజు వెళ్ళిన హాస్పిటల్ కి మళ్ళీ వెళ్లిందిఅక్కడ విచారించగా, ఆమె అక్కడ యునివర్సిటి లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అనీ, రోజూ తను, తన 12 సంవత్సరాల  కూతురు వచ్చి రెండు గంటలు  పేషెంట్ లకిసేవ చేస్తారని, మరి కాసేపటిలో వస్తారని తెలిసిందిఆమె రాగానే రమ్య "మీరు ... మీరు.... మీ పేరు...." అంటూ 
నానుస్తుంటే ఆవిడ "ఏమ్మా రమ్యా బాగున్నావా?" అని అడగగానే రమ్య కి నోటిలో మాట రాలేదుఇద్దరి మధ్యా గడిచిన పది నిమిషాల 
నిశ్శబ్దం. తరువాత రమ్య మెల్లగా లేచి ఇంటికి బయలుదేరింది.

"ఏమీ అడగాలని కానీ ఏదైనా చెప్పాలని కానీ లేదాఅన్న మాటకి రమ్య వెనక్కి తిరిగి ఆవిడ కళ్లలోకి చూసిందిచిన్న నవ్వు నవ్వి తిరిగి 
వెళ్లబోయింది

"పోనీ నీలో ఉన్న కోపాన్ని తీర్చుకోవచ్చు కదా?" 
"నాకు నీమీద కోపం కాదు ద్వేషం ఉందినువ్వు పదిసంవత్సరాల క్రితం ఏదో ప్రమాదం లో చచ్చిపోయావని మా నానమ్మ చెప్పిందిఆవిడ అలా ఎందుకు చెప్పిందో తెలియదు కానీ నువ్వు ఈరోజు నాకు కనబడకుండా ఉంటే బాగుణ్ణు అని మాత్రం అనిపించిందినువ్వు నువ్వు 
కాకుండా ఉంటే బాగుణ్ణు అనుకుంటూనే ఇక్కడకి వచ్చానునాకు  అదృష్టం కూడా లేదు అని తెలిసింది."

"నువ్వు నన్ను ఎన్నడూ చూడలేదు, నాతో గడపలేదుఎవరో చెప్పిన మాటలని బట్టి నా మీద ఒక అభిప్రాయం నువ్వు ఏర్పాటు 
చేసుకున్నావ్నా వైపు వాదన కూడా వింటే నీ ద్వేషానికి ఒక అర్థం వస్తుందేమోనాకు  అవకాశం ఇస్తావాఅని ప్రాధేయపడింది ఆమె.

వింటాను చెప్పు అన్నట్టు కుర్చీ లో తిరిగి కూర్చుంది రమ్య.

 "మా అమ్మ నాన్న లకి నేను ఒక్కత్తినే కూతుర్నిచిన్నప్పటినుండి బాగా చదువుకున్నానుగారంగా పెరగడం వల్ల నాకు ఇంట్లో పనులు 
అవీ సరిగా వచ్చేవి కావునన్ను చదువుకోవడానికే మా తండ్రి ఎక్కువ ప్రోత్సహించేవారునా M.Sc. అవుతుండగా మీనాన్నగారితో నాకు పెండ్లి అయిందినువ్వు పుట్టినపుడు నేను Ph.D. చేస్తూ ఉండేదాన్నిమీ నానమ్మకి నేను మీ నాన్నని మించి చదువుకోవడం ఇష్టం లేదునన్ను అక్కడితో ఆపేయమని చాలా సార్లు బలవంతపెట్టారుమీ బామ్మ కి ఎదురు చెప్పలేక, నాకునచ్చ చెప్పలేక మీ నాన్నగారు మధ్యలో నలిగిపోయేవారునీకు రెండు సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడుఒక్క నెల రోజులు నేను మా ప్రొఫెసర్ గారితో పని చేస్తే నా 
డాక్టరేటు పూర్తి అవుతుందని,  సమయం లో వెనక్కి తీసుకోవద్దని, మీనానమ్మని ఆయన ఒప్పిస్తా అని మా నాన్న గారు నన్ను తీసుకు వెళ్లారుఏది ఏమైనా నిన్ను నాతో పంపడానికి మీ నానమ్మ ఒప్పుకోలేదునెల రోజుల్లో ఎటూ వస్తాను కదా అని నిన్ను వదిలి మా 
నాన్నగారితో వెళ్ళాను తరువాత ఎంత ప్రయత్నించినా నిన్నుకలవనివ్వలేదుమానసికంగా క్రుంగిపోయిన నేను డిప్రెషన్ లోకి వెళ్ళడం 
వల్ల, నాకు మానసిక సంతులత లోపించిందని మీ నాన్నతో నన్ను వేరు చేశారు మీ నానమ్మ, తాతగారునేను కోలుకుని తిరిగి నిన్ను 
అడగడానికి మీ నానమ్మ ఇంటిని వెతుక్కుంటూవచ్చానుఅప్పటికే మీ నాన్నగారికి ఇంకో వివాహం జరగడం, ఎట్టి పరిస్థితి లోనూ నిన్ను 
ఇవ్వడం కుదరదని పంపడం నాకు తీరని అన్యాయాలు

నా స్నేహితురాలి ద్వారా నీ గురించి అప్పుడప్పుడు సమాచారం తెలుసుకుని తృప్తి పడేదాన్నినువ్వు సాధించిన ర్యాంకులు, ప్రశంసలు   చూసి మురిసిపోయేదాన్నిఒంటరిని అయిన నేను ఇక్కడ యునివర్సిటిలో ఉద్యోగం రావడం తో ఇక్కడకి వచ్చి స్థిరపడ్డానుఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి దీనిని పెంచుకుంటున్నానుదీని పేరు రమ్యనా మాటలు నమ్మి నీ మనసు కుదుట పడితే నాకంటే 
సంతోషించేవాళ్లు ఉండరు........"

ఆమె మాటలు పూర్తి కాకుండానే అక్కడనుండి వెళ్లిపోయింది రమ్య.



ఆవేదనతో వళ్ళో పడుకున్న రమ్య తల నిమురుతూ "రమ్యా! అమ్మ అమ్మేరా. ఎక్కువ ఆలోచించకు.  అన్నం తిందువుగాని పద" అని ఆప్యాయంగా ఊరడించిది అత్తగారు.

"మరి మా నానమ్మ కూడా అమ్మే కదా? మరి నాలో ఇంత ద్వేషం ఎలా నింపింది."

"నానమ్మ తన కొడుకు ఎక్కువ స్థాయి లో ఉండాలి అని కోరుకుంది. అందుకే కొద్దిగా పంతం వల్ల అలా ప్రవర్తించింది. తరవాత నీకు తల్లయింది. నిన్ను దూరం చేసుకోలేకపోయింది. ఎంతైనా అమ్మ కదా?"

ఈ ప్రపంచంలో తనకంటే అదృష్టం ఎవరికీ లేదనిపించింది ఆసమయంలో రమ్యకి. ముగ్గురు అమ్మలు నాకు అని సంతోష పడుతూ అత్త'అమ్మ' ని గాఢంగా కౌగలించుకుంది. 

Friday, 30 October 2015

జీవిత గమ్యం




"ఇన్ని సంవత్సరాల తరవాత చదువు తిరగేసి, మొదటి  కేసు గెలిచినందుకు కాంగ్రాట్యులేషన్స్. అదీ ఏ లాభాపేక్ష లేకుండా మీ ఇంట్లో పని చేసే అమ్మాయికి న్యాయం జరగాలనే సేవా దృష్టి తో వాదించడం అందులో విజయం సాధించడం" అంటూ గొప్ప సైకాలజిస్టు అయిన గీత పొగుడుతుంటే  సంతోషం తో కూడిన గర్వం కలిగింది. నేను గీత ఒకప్పుడు కలసి చదువుకునేవాళ్లం. పెళ్లి, పిల్లల బాధ్యత తో నేను చదువుకి స్వస్తి చెప్పాను కానీ తాను మాత్రం సైకాలజీ లో డాక్టరు పట్టా సాధించి మంచి కౌన్సిలర్ గా పేరు తెచ్చుకుంది. నా పిల్లలు డిగ్రీ చదువులకి వచ్చాకా, గీత సలహాతో మా వారి ప్రోత్సాహం తో 'లా ' చదివాను. మా వారు లాయరు కావడం తో నాకు కొంచం సులువుగానే పట్టా చేతికొచ్చిందని చెప్పొచ్చు.
అందరికంటే ఎక్కువ క్రెడిట్ మాత్రం లక్ష్మి కి చెందాలి అని మనస్ఫూర్తి గా చెప్పగలను.

కాఫీ తీసుకొచ్చిన లక్ష్మి కి కూడా శుభాకాంక్షలు చెప్పింది గీత. ఇంతలో లక్ష్మి "అమ్మా మీరు ఇంకో కేసు టేకప్ చేయాలి. నాకు నా భర్త నుంచి విడాకులు ఇప్పించాలి"

ఆ మాటకి మా ఇద్దరికీ నోటి మాట రాలేదు.

రెండున్నర సంవత్సరాల క్రితం లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఐదవ తరగతి కూడా చదవని దాని వయసు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది. నాజూకుగా, తీరువ గా ఉన్నట్టు అనిపించింది చూడగానే. పక్క ఊళ్ళో మావారి స్నేహితుని ఇంట్లో పని చేసే లక్ష్మికి పెళ్లి చేసి ఈ ఊరు పంపింది వాళ్ళ అమ్మ. తండ్రి లేకపోయినా  ప్రభుత్వ ఉద్యోగిని ఇచ్చి, ఉన్నదాంట్లో ఆర్భాటంగా పెళ్లి చేసింది. అంతవరకు ఇంటి పని నేనే చేసుకునే అలవాటు ఉన్నా చదువు పరీక్షల సమయం లో కాస్త చేదోడుగా ఉంటుందని పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను. చాలా కొద్ది రోజులకే లక్ష్మి మా ఇంట్లో మనిషిలా అలవాటు అయిపోయింది. నాకంటే పొందికగా పని చేస్తుందని చెప్పడానికి ఏ భేషజమూ లేదు నాకు. పట్నం లో దొరికిన  అవకాశాన్ని ఉపయోగించుకుని చాలా త్వరగా కుట్లు అల్లికలు వంటివి  కూడా నేర్చుకుంది లక్ష్మి. కూతురు లేని లోటు తీర్చడానికే ఇది నా ఇంటికి వచ్చిందా అనిపించేది నాకు చాలా సార్లు.

అది ఈ ఊరు రావడం నా అదృష్టమో దాని దురదృష్టమో తెలియదు కానీ, ఒకొక్కరోజు తాగి వచ్చి భర్త కొట్టిన గాయాలు దాని మొహం మీద కనపడి నపుడు మాత్రం కడుపులో బాధ తన్నుకు వచ్చేది. ఆవేశం తో నేను దాని భర్త ని తిడితే పోనీలెండమ్మా, ఏదో బలహీనత. తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియక కొడతాడు. మనిషి చెడ్డవాడు కాదు అని నాకే సర్ది చెప్పేది. ఒకటి రెండు సార్లు దాని భర్త ని ఇంటికి పిలిచి మందలించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. నాకు డిగ్రీ వచ్చిన రోజు నాకంటే దానికే ఎక్కువ సంతోషం కలిగింది.
రెండు నెలల క్రితం తల్లికి బాలేదని తెలిస్తే చూడడానికి ఊరు వెళ్ళి, తిరిగి వస్తూ మూడు సంవత్సరాల పాపని వెంట బెట్టుకుని వచ్చింది. చూడడానికి ముద్దుగా బొద్దుగా ఉంది ఆ పాప. మూడు సంవత్సరాల క్రితం కూలి పని కి వెళ్ళి వస్తుంటే అప్పుడే పుట్టిన పాపని ఎవరో రోడ్డుమీద వదిలేస్తే లక్ష్మి, దాని తల్లి దయతో దాన్ని తెచ్చుకుని పెంచుకుంటున్నారుట. చాలా మంది మీకే దిక్కు లేదు ఇంకా ఆ పసిగుడ్డుని ఎలా సాకుతారు అని వారించినా మేము తినే గంజి అన్నమే దానికి పెడతాము అని ఊరందరికీ సర్ది చెప్పి పెంచుకుంటున్నారు. లక్ష్మి పెళ్లి అయ్యాకా ఆ పాప ని తల్లే చూసుకుంటోంది. ఇప్పుడు తల్లి కి ఆరోగ్యం బాగాలేదని ఆ పిల్ల బాధ్యత ఇది తీసుకుంది. దయాగుణం ఉండాలి కానీ సంపాదనకి దానధర్మాలకి సంబంధం లేదు అనిపించింది ఆ క్షణం నాకు. ఈ బిడ్డ పెంపకం లో నాకు తోచిన సాయం నేను చేద్దాం అని అనుకున్నా మనసులో.

రోజూ కంటే కాస్త ముందుగా వచ్చింది లక్ష్మి ఆరోజు పనిలోకి రోజూ కంటే కాస్త ఎక్కువ గాయాలతో, ఎర్రబడిన కళ్ళతో. ఏమైంది మళ్ళీ తాగొచ్చి గొడవ చేశాడా అన్నా నేను ఆవేశం తో. ఈసారి పోనీలెండమ్మా అనలేదు లక్ష్మి. "ఈ బిడ్డ నాకే పుట్టిందని, ఎవరితోనో తిరిగి బిడ్డని కని తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నా అని, నన్ను వదిలేస్తా అని అంటున్నాడు. తనతో కాపురం చేయాలి అంటే ఈ బిడ్డని అనాథ ఆశ్రమం లో పడేయమంటున్నాడు" అని వాపోయింది లక్ష్మి.

వదిలేయడం అంతా సులువా? కోర్టు విడాకులు ఇవ్వద్దూ అన్నా నా లాయరు బుర్ర ఉపయోగిస్తూ. మాలో కోర్టులు విడాకులు ఉండవు అమ్మా. భర్త వదిలేస్తున్నా అని చెప్పితే అవే విడాకులు. ఈ బిడ్డ నాకు పుట్టలేదని ఎలా నిరూపించుకోగలను మీరే చెప్పండి. రెండు సంవత్సరాలలో నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నాడు నా భర్త. ఇక చేయగలిగినది ఏదీ లేదు. మీకు తెలిసిన రెండు మూడు ఇళ్ళలో పని చూపిస్తే ఈ చంటి దానికి కాస్త లోటు లేకుండా చూసుకుంటాను అని అనగానే దాని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి అనిపించింది.
దాని భర్త ని పిలిపించి సర్ది చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాం నేను మావారు కలసి. నీ ఇష్టం వచ్చినట్టు వదిలేయడానికి కుదరదు కోర్టు విడాకులు ఇచ్చేవరకు అది నీ భార్యే. విడాకులు ఇస్తే నీ జీతం లో కొంత భాగం దానికి ఇవ్వాల్సి వస్తుంది అని బెదిరించి రాజీ కుదర్చడానికి అన్ని అస్త్రాలని వాడాం. ఆ పాపని వదిలేస్తే కాపురం చేస్తానని లేదంటే తానే కోర్టు కి వెళ్ళి ఇద్దరి పీడ వదిలించుకుంటా అని భీష్మించుకుని కూర్చున్నాడు.
ఈ బిడ్డ నీకు పుట్టలేదని నిరూపించచ్చు, అదేమంత కష్టం కాదు. అయినా ఈ పాపని ఏ అనాథ ఆశ్రమంలోనో చేర్పిద్దాం. దూరంగా ఉంటూనే దీని బాగోగులు చూద్దాం. రోడ్డు మీద దొరికిన పాప కోసం నీ జీవితం పాడుచేసుకోకు అని సర్ది చెప్పా ఒక సాధారణ తల్లి హృదయంతో.

పాపని ఎక్కడ ఉంచాలి అనే విషయం తరువాత. ఇది నాకు పుట్టలేదు అని నిరూపించొచ్చా అమ్మా అని ఎంతో ఆశగా అడిగిన ఆ లక్ష్మి అమాయక కళ్ళు నా కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. నిరూపించొచ్చు. అవసరమైతే నీ తరఫున నేను వాదిస్తా అన్నా ఏదో లాయర్ అయిపోయానన్న గర్వంతో. ఆ మాటకి లక్ష్మి పట్టిన పట్టుకి ఫలితం ఇదిగో నా మొదటి కేసు గెలవడం.

ఇంతా కష్ట పడింది నీ సంసారం నిలబెట్టడానికే కదా. పాప బాగోగులు నేను కూడా పంచుకుంటా. దానిని మంచి హాస్టల్ లో పెట్టి చదివిద్దామ్. నీ సంసారం పాడు చేసుకోకు అని సర్ది చెప్పబోయిన నామాట వినకుండా మీరు నా తరఫున వాదిస్తారా లేదా అది చెప్పండి చాలు అని ఒకింత గట్టిగా అడిగింది లక్ష్మి. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ అలా మాట్లాడింది లేదు.

నూవ్వైనా చెప్పవే కౌన్సిలరు, చేతులారా జీవితం పాడుచేసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగం భర్తది. చక్కగా పిల్లాపాపలతో హాయిగా గడపక ఎవరో అనాథ బిడ్డ కోసం మతి చెలించినట్టు మాట్లాడుతోంది. ఈ కేసుకి, హాస్పటల్ కి దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు పెట్టింది. తీరా అన్నీ దానికి అనుకూలంగా వచ్చాక ఎలా వాగుతోందో చూడు. ఒంటరిగా బ్రతకడం అంటే అంత సులువా? లేదా విడాకులు తీసుకుంటే డబ్బులు వస్తాయని ఆలోచనా? TVలో పేపర్ లో చూడట్లేదా రోజుకి ఎన్ని మానభంగాలో. భర్త తో ఉండడం లోనే  సామాజిక భద్రత, ఆర్థిక భద్రత ఉన్నాయి అని దానికి అర్థం అయ్యేలా చెప్పు అన్నాగీతతో నాలో వస్తున్న ఆవేశాన్ని ఆపుకోలేక.
నీ భర్త విడాకులు కోరినప్పుడు పొరాడి ఇప్పుడు ఎందుకు నువ్వే ఇలా అడుగుతున్నావు అని అడిగింది గీత దాని స్టయిల్ లో.

"నాకు చిన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. మా అమ్మ కష్టపడి నన్ను పెంచింది. ఈ పసిదాన్ని పెంచడం మాకు ఎప్పుడూ కష్టం అనిపించలేదు. ఉన్నదానిలో సంతోషం గా గౌరవంగా బ్రతికాము. నా భర్త ఎంత కొట్టినా నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. అది తన బలహీనత అని సరిపెట్టుకున్నా నేను. నా గుణమే సరైనది కాదంటే ఒప్పుకోలేకపోయాను. నా నిజాయతి నిరూపించు కోవడానికి నేను ప్రయత్నించాను. రేపు ఈ పాప పెద్ద అయ్యాకా దానికి కూడా నామీద నమ్మకం, గౌరవం పోకూడదు అనే నేను ఇంత శ్రమ తీసుకున్నాను. కేవలం ఒక వ్యక్తి కి భార్య గా ఉంటేనే భద్రత ఉంటుందంటే నేను నమ్మను. TVలో చెప్పుతుంటే విన్నాను మానభంగం చేసిన వాళ్ళని నపుంసకులు చేయాలి సమర్ధించేవాళ్లు SMS చేయండి అని.  ఈ దేశం లో ఎంతో మంది స్త్రీలు  మగవాళ్ళకి బలి అవుతున్నారు. భార్యకి ఇష్టం లేనప్పుడు చేసినా, ప్రేమ పేరుతో మభ్యపెట్టి చేసినా అది మానభంగమే అని నా ఉద్దేశ్యం. మానభంగం శరీరానికి కాదు మనసుకి ఉంటుంది అని అనుకుంటా నేను. రేపు మా అమ్మని కూడా చూసుకోవలసిన బాధ్యత నామీద ఉంది. డబ్బు, మేడలు లేకపోయినా చక్కగా బ్రతకవచ్చు కానీ ప్రేమ, నమ్మకం లేకుండా కాపురాలు చేయలేము. ఆ మనిషితోనే సంబంధం వద్దు అనుకున్నప్పుడు అతని సంపాదన మీద ఎందుకు ఆశ ఉంటుందమ్మా? నా కాయకష్టం తో అభిమానం గా బ్రతకగలనని నమ్మకం నాకు ఉంది. మీలాంటి మంచి వాళ్ళ అండ నాకు ఎప్పుడూ ఉంటుంది. దయచేసి మీరు ఈ సహాయం చేసిపెట్టండి" అంది తన జీవిత గమ్యం మీద చక్కటి అవగాహన ఉన్నదానిలా.

లక్ష్మి మీద కాదు, తన భర్త మీద జాలి వేస్తోంది నాకు ఈ క్షణం. వజ్రం లాంటి భార్యని అజ్ఞానం తో పోగొట్టుకున్న నిర్భాగ్యుడు లా అనిపిస్తున్నాడు. తనతో పాటూ తన తల్లికి కూడా డి‌ఎన్‌ఏ పరీక్ష జరిపించమని పట్టిన పట్టుకి అంతరార్థం ఇప్పుడు అర్థం అయింది.

చదువుకోక పోయినా లక్ష్మి ఆలోచనా విధానం, దాని ఆత్మ స్థైర్యం ఎంతో నచ్చాయి నాకు. చదువుకి-మనోధైర్యానికి, చేసే పనికి-ఆత్మ గౌరవానికి, సంపాదనకి-గుణానికి ఏరకమైన సంబంధము లేదనే విషయం లక్ష్మి నాకు నేర్పిన పాఠం. నేను చదువుకున్న న్యాయ శాస్త్రం తో దానికి దక్కవలసిన న్యాయానికి నావంతు సాయం చేయడానికి నిర్ణయించుకుని, ఆ తల్లి కాని తల్లిని ప్రేమగా చూస్తున్న  చంటిదాన్ని ఎత్తుకుని ఆప్యాయంగా మొదటిసారి ముద్దాడాను.  


Sunday, 6 September 2015

భగవద్గీత

దాదాపు రెండు దశాబ్దాలు గా మహారాష్ట్ర లో నివసిస్తున్నాం. ఈ మధ్య నాగపూర్ కి మారాక మాకు తెలుగు వారి పొరుగు  దొరికింది. ఏదో పండగలకి పుట్టింటికి, అత్తవారింటికి వెళ్లడం, ఆ సమయం లో విడుదల అయిన తెలుగు సినిమాలను చూసి ఆనందించడం తప్ప తెలుగు TV తో కూడా పెద్దగా పరిచయం లేదు. ఉదయం పని చేసుకుంటూ భక్తి పాటలు, భజనలు పెట్టుకుని వాటితో గొంతు కలుపడం నాకు ఒక అలవాటు. ఆదివారం అవడం వల్ల కొద్దిగా హడావుడి లేకుండా ఘంటసాల గారి భగవద్గీత వింటూ నా గాడిద స్వరం(నా పాటలు విని తరించి మా వారు, మా అబ్బాయి ఇచ్చిన బిరుదు లెండి) మధ్య మధ్యలో కలుపుతూ పని చేసుకుంటున్నా.

ఒక మిత్రుడు వాట్సాప్ శుభోదయ సందేశం తో పాటుగా ఏమి చేస్తున్నావ్ ఆదివారం విశ్రాంతా? అని అడగడం తో నా గోడు వినిపిద్దామని "గృహిణి కి ఆదివారం విశ్రాంతి ఎక్కడది నాయనా, రోజు కంటే కాస్త ఎక్కువ పనే ఉంటుంది" అన్నాను. ఏమి చేస్తున్నావ్ అని అడగగానే ఎంతో ఉత్సాహంగా "ఘంటసాల వారి భగవద్గీత వింటూ ఉప్మా పెసరట్టు కి ఏర్పాట్లు చేస్తున్నా. రోజూ డబ్బాల్లో ఎండిపోయిన రొట్టెలు తినే మా వాళ్ళకి రుచిగా చేసిపెడదామని". ఆహా విను విను, వింటూ తిను. ఘంటసాల గారు మంచి రాగాలతో చాలా బాగా పాడారు, మనవాళ్లే దానిని ఆ టైమ్ లో పెట్టి అందం పోగొట్టారు. నాకు ఆదివారం ఇప్పుడే తెల్లారింది. మళ్ళీ కలుస్తా, వస్తా'

ఏ టైమ్? ఏమోలే ఈ గాయకులు (నా స్నేహితుడు సంగీత పరిజ్ఞానం ఉన్న గాయకుడు లెండి), కవులు ఏమి మాట్లాడతారో అంత త్వరగా అర్థం కాదు అనుకుని నా పనిలో నేను పడ్డాను.

ఇంతలో పక్కింటి గాయత్రి గారు పరుగు పరుగున మా ఇంటికి వచ్చి ఏమిటి మీరు చేస్తున్న పని అని ఎంతో కంగారుగా అడిగింది. నాకు అర్థం కాలేదు.
ముందు ఆ టేప్ రికార్డర్ ఆపండి అంది. మీరు బావుంటున్నాయి అన్నారని ఈరోజు సౌండ్ కొంచం 
ఎక్కువ పెట్టాను అన్నాను ఏదో ఘనకార్యం చేసినట్టు. ఒక్క పరుగున వెళ్ళి ఆవిడే ఆపేసింది. 

ఏమైందండీ అన్నా నేను ఏమీ అర్థం కాక. అది పెట్టారెంటండీ అని ఆవిడ సాగదీస్తుంటే నేను వారానికి ఒకటి రెండు సార్లు వింటాను. ఇంచుమించు కంఠస్థం కూడా నాకు అంటున్నా గర్వంగా.
"ఏమిటండీ పొద్దున్నే ఇది? మా బామ్మ గారు, మా వారి బంధువుల మరణాలన్నీ వరసగా గుర్తొస్తున్నాయి. ఎవరు పోయారా అని నేను మా వారు ఇందాకటి నుంచి ఒకటే గాబరా పడుతున్నాం. ఇంకేమీ దొరకనట్టు ఇది పెట్టారు ఏంటి? ఇంక ఉండబట్టలేక నేను వచ్చేసాను"

ఆవిడ వివరించిన తరవాత నాకు అర్థమైంది ఏమిటంటే ఎవరైనా మరణించినపుడు మన రాష్ట్రం లో ఘంటసాల గారి భగవద్గీత లౌడ్ స్పీకర్ లో పెడుతున్నారని. మొన్నెప్పుడో ఊరెళ్ళినపుడు మా అబ్బాయి ఒక చోట షామియానా వేసి ఉంటే అక్కడ ఏమిజరుగుతోంది అని అడిగాడు. ఏదో ఫంక్షనో లేదా ఎవరో పోయారో అన్నారు మా అత్తగారు. భగవద్గీత వినిపిస్తే పోయినట్టా అన్నాను నేను యథాలాపంగా గాయత్రి తో. మీకు అన్నీ వేళాకోళమే, నాకు చాలా పని ఉంది అంటూ వెళ్లింది గాయత్రి.

పని చేస్తున్నానే కానీ ఆలోచన ఆగట్లేదు. 'ఆ టైమ్ లో పెట్టి' అన్న స్నేహితుని మాట కూడా ఇప్పుడు అర్థం అయింది నా మట్టి బుర్రకి. భగవద్గీత లోని సారం అందరికీ తెలియాలని, పామరులు కూడా సులభంగా అర్థం చేసుకోవాలని కొందరు మహానుభావులు చేసిన ఈ మహత్కార్యం ఇలాంటి స్థితికి వచ్చిందని నాలో నేను బాధ పడ్డాను.
ఒక శ్లోకం " పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జనియించకా తప్పదు. అనివార్యం అయిన మరణం గురించి చింతించటం వలదు" అని ఉన్నంత మాత్రాన భగవద్గీతని ఇలా వాడుకోవడం ఎంతో బాధ కలిగించింది. అనారోగ్యం తో బాధ పడుతూ కూడా అది ఎలాగైనా పూర్తి చేయాలని ఎంతో శ్రమించారు ఘంటసాల గారు అని ఎక్కడో చదివాను. ఇది ఇలాగే సాగితే తెలుగు వారు అందరూ విని తీరవలసిన ఘంటసాల భగవద్గీత అస్థిత్వం కోల్పోతుందేమో అనే భయం వేస్తోంది.

* * * * * * * * * * * * * * * * * *

ఇది రాసి పక్కకి పెట్టి కొద్దిగా దృష్టి మరల్చాలని ఈమధ్యనే పెట్టించిన డిష్ టి‌వి ఆన్ చేసాను. ఏదో సినిమా చివరి ఘట్టం. కథానాయిక మరణించింది. "అశతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతమ్గమయ" అని చూసి ఆశ్చర్యం కలిగింది. 'మృత్యోర్మా' అని వుందని ఉపనిషద్ లోని ఈ శ్లోకాన్ని కూడా చావుతో ముడి పెట్టారా అని. అప్పుడు నాకు అనిపించిన విషయం ఏమిటంటే ఘంటసాల భగవద్గీతని చావు కి ఆపాదించిన పుణ్యం కూడా మన టాలీవుడ్ దే అయి ఉండొచ్చు అని. ఎందుకంటే కొన్ని సినిమాల్లో విన్న, చూసిన గుర్తు వస్తోంది. కారణం ఏదైనా ఈ విషయం మాత్రం ఆలోచించవలసినదే.

ఇది ఎవరినీ బాధ పెట్టాలని రాసినది కాదు. భగవద్గీతని లక్ష్య గ్రంథం, రామాయణ మహాభారతాలను లక్షణ గ్రంథాలు అంటారు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే భగవద్గీతని చదవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి లక్షణాలు మనకి ఉండాలో ఎలాంటివి ఉండకూడదో తెలుసుకోవడానికి రామాయణ, మహాభారతాలు చదవాలి. ఈ బిజీ ప్రపంచం లో చదవడానికి సమయం లేకపోయినా  సులభమైన భాష లో అర్థం అయ్యేలా వివరించే ఘంటసాల వారి భగవద్గీత ని వినండి, పిల్లలకి వినిపించండి.


Friday, 10 July 2015

ఎటో తీసుకెళ్లిన కోణార్క్ ఎక్స్ ప్రెస్



ముంబాయి వెళ్లడానికి విశాఖపట్టణం లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. సెకండ్ ఏ‌సి కంపార్టుమెంటు లో ఒక జంట నా ఎదురుగా కూర్చున్నారు. విశాఖపట్టణం అందాలను హుద్ హుద్ ఎలా మింగేసిందీ సంభాషణలు మా మధ్య నడుస్తున్నాయి. చమటలు తుడుచుకుంటూ ఒక యువతి రైలు బండి ఎక్కింది. అప్సరస అని పుస్తకాలలో చదవడమే అంతవరకు, ఇప్పుడు ప్రత్యక్ష్యం గా చూడడం.  నేను హృతిక్ రోశన్ అంత అందగాడిని కాకపోయినా అనాకారిని మాత్రం కాదు.

ఆమె అందాన్ని చూసి మైమరచి పోయేలోపే ఆమె నాదగ్గరకి వచ్చింది. హలో సర్, are you single? అని అడిగింది. నలభై అయిదు సంవత్సరాలు ఉన్న నాకు ఆ ప్రశ్న కొంచం ఆశ్చర్యాన్ని కలిగించినా ఒక్క క్షణం అబద్ధం చెప్పేద్దామా అనిపించింది. నన్ను నేను తమాయించుకుని కాదండీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్నాను. అయ్యో అవునా bad luck అని జావ కారిపోయింది ఆమె. నీది కాదు నాది bad luck అనుకున్నా మనసులో.

కూర్చుని చమట మొత్తం తుడుచుకుని తాపీగా చెప్పింది “మా వారు పక్క కంపార్టు మెంటు లో ఉన్నారు మీరు single అయితే సీట్ మార్చుకుందామని అడిగాను”
ఇప్పుడు జావ కారడం నావంతయ్యింది.


Saturday, 4 April 2015

బాల్యమా నువ్వెక్కడ?





ముందురోజు అంతా ప్రయాణం వల్ల నాకు ఉదయం కొద్దిగా ఆలస్యంగా  ఏడు గంటలకు మెలకువ వచ్చింది. ఏదో కోలాహలం విన్నాకా గుర్తొచ్చింది నేను మా పిన్ని కూతురు సరళ ఇంటికి వచ్చాను అని. గదిలోంచి బయటకి రాగానే కంటిముందు సర్కస్ చూస్తున్న అనుభవం కలిగింది. సరళ ఏడు సంవత్సరాల కొడుకుతో ఇంట్లో అందరూ విన్యాసాలు చేస్తున్నారు. బామ్మ మొహానికి చేతులకి ఏదో లోషన్ రాస్తుంటే, నాన్న బూట్లు తొడుగుతున్నాడు. అమ్మ నోట్లో అదేదో పదార్ధం కుక్కుతోంది. పని అమ్మాయి బ్యాగ్, అంతకంటే పెద్ద ఫుడ్ బాస్కెట్ తో సిద్ధంగా ఉంది. పిల్లవాడు బస్ ఎక్కడంతో ఇల్లు సద్దు మణిగింది.
"అక్క లేచావా? చిన్నూ గాడు స్కూల్ కి వెళ్ళేవారకూ హడావుడి అనుకో రోజూ".
 అందరం కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సరళ "ఈ మధ్య చిన్నూ ఉత్సాహం గా ఉండట్లేదు, చాలా డల్ గా ఉంటున్నాడు. నువ్వు చిన్నపిల్లల స్కూల్ లో చేస్తున్నావ్ కదా కొద్దిగా వాడిని గమనించి ఏమి చేయాలో చెప్పవూ" అని తన చింత వెళ్ళబుచ్చింది. "దానేదేముందే తప్పకుండా చెప్తాను నాలుగు రోజులు ఉంటాను కదా" అని ధైర్యం చెప్పాను.

రాత్రి ఎనిమిది దాటుతున్నా పిల్లవాడు ఇంటికి రాలేదు. ఇంక ఉండలేక సరళని అడిగాను "బాబు ఇంకా రాలేదేంటి?" అని. వచ్చేస్తాడు ఇంకో అరగంటలో అని కంగారుగా వాడు రాగానే ఏమి తినిపించాలో తయారు చేసేపనిలో పడింది.

వాడు ఇంటికి రాగానే వాడికి స్నానం చేయించి బట్టలు తొడిగి టి.వి. ముందర కూర్చోబెట్టింది. వాడు చానల్ మారుస్తూ ఏవేవో చూస్తుండగా వాడికి భోజనం తినిపించి పడుకోబెట్టింది. ఆ పిల్లవాడి నోటి నుంచి ఉదయం బై, ఇప్పుడు గుడ్ నైట్ తప్ప ఏమీ వినలేదు నేను.

అందరూ కలసి భోజనాలు ముగించాం. ఇంక ఉండబట్టలేక "ఉదయం ఏడు గంటలకు వెళ్ళిన పిల్లవాడు రాత్రి ఎనిమిది దాటాక ఇంటికి వచ్చాడు ఏంటి? ఇన్ని గంటలు కూర్చోబెట్టే అదేమి స్కూల్" అని అడిగాను ఒకింత ఆశ్చర్యంగా. చాలా సరళంగా చెప్పడం మొదలు పెట్టింది సరళ "స్కూల్ మూడు గంటలకే అయిపోతుంది. అక్కడ నుండి చెస్ నేర్చుకోవడానికి, అటునుంచి కోచింగ్ క్లాస్ కి, అది అయ్యకా డ్రాయింగ్ క్లాస్ కి వెళ్ళి వస్తాడు".

"మరి మధ్యలో విశ్రాంతి ఉండదా?"
"ఎందుకు ఉండదూ బస్ లో స్నాక్స్ బాక్స్ తినేసి నిద్రపోతాడు. స్కూల్ నుంచి క్లాస్ కి వెళ్లడానికి గంట పైగా పడుతుంది" అంది చాలా సరళంగా.
నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు. ."శనివారం స్కూల్ ఉండదేమో కదా" అన్నాను ఉండకపోతే బాగుణ్ణు అని కోరుకుంటూ.
"లేదు శనివారం, ఆదివారం స్కూల్ కి సెలవలు ఉంటాయి. అయితే ఆ రెండు రోజులు ఇంట్లో చేయడానికి ప్రాజక్ట్ అవీ ఇస్తారు".

"పోనీలే ఆ రెండు రోజులూ ఇంటిపట్టున ఉంటాడు" అన్నాను కాస్త ఊరట కలిగి.
వెంటనే అందుకుంది సరళ ."ఎక్కడ అక్కా, ఆ రెండు రోజులే కదా ఏవైనా నేర్చుకోవడానికి దొరికేది. ఆ రెండు రోజుల్లో అబాకస్, యోగా, సంస్కృతం, సాయంత్రం డాన్స్, టెన్నిస్ క్లాసులు ఉంటాయి".
ఒక్కసారి గుండె జారి పొట్టలోకి వచ్చినట్టు అయింది నాకు.

ఇంతలో సరళ వాళ్ళ ఆయనతో చెప్పడం మొదలు పెట్టింది. "చిన్నప్పుడు మా అక్క వల్ల మేమందరం చాలా తిట్లు తినేవాళ్లం. అక్క పదకొండు సంవత్సరాలకి పదవ క్లాస్ పాస్ అయింది అదీ డి.ఇ.ఓ. ప్రత్యేక అనుమతితో ఇంకా జిల్లా లొకే ఎక్కువ మార్కులతో". అవునా గ్రేట్ అని అనడం పూర్తికాకుండానే కంటిన్యూ చేసింది "పదిహేడు సంవత్సరాలకి B Tech ఇంకా పంతొమ్మిదికి M Tech చేసి ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది అన్ని పత్రికలనీ. చిన్నతనం లోనే విదేశాల్లో ఉద్యోగాలు ఒక వెలుగు వెలిగింది అనుకోండి". "
అవునా మా అబ్బాయి కి ఏవైనా మెళకువలు చెప్పండి ఎలా చదువుకోవాలో, ఎలా ప్రణాళిక వేసుకోవాలో అని ఆమె భర్త వినయంతో కూడిన రిక్వస్ట్ చేస్తూనే ఇంతలో ఒకింత ఆశ్చర్యంతో అదేంటి మీరు ఏదో చిన్నపిల్లల స్కూల్ టీచర్ అని చెప్పింది నిన్న సరళ.
నేను ఒక చిన్న నవ్వు నవ్వి అవును ఇప్పుడు నేను టీచర్ నే.
మెల్లగా చెప్పడం ప్రారంభించాను "మీరు ఏమీ అనుకొక పోతే ఒక విషయం చెబుతాను. వాడికి గట్టిగా ఏడు సంవత్సరాలు లేవు. తలకి మించిన భారం మోపుతున్నారు. చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో వాడికి ఇన్ని రకాల క్లాసులు అవసరమా? ఒక వయసు వచ్చాక వాడి ఇష్టాన్ని బట్టి వాడికి ఆటలు, కళలు నేర్పించడం లో తప్పు లేదు. కానీ ఇంత చిన్న వయసులో వాడి శరీరం, బుర్ర రెండూ అలసిపోతున్నాయి. ఇంకా ఉత్సాహంగా ఉండట్లేదు అని అనుకోవడం లో అర్థం లేదు కదా?"
'అదేంటండి? ఈ పోటీ ప్రపంచం లో తట్టుకోవాలంటే ఆ మాత్రం శిక్షణ అవసరం' అని నాకే పాఠం చెప్పబోయాడు సరళ భర్త.

"ఈరోజుల్లో పెద్దవాళ్లకి టెన్షన్ లేకుండా తయారు చేయడానికి చాలా శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. పెద్దవాళ్లని పిల్లల్లా మార్చి ఆహ్లాదంగా జీవించేలా చాలా రకాల టెక్నిక్ లు అవీ నేర్పి, ఉల్లాసం ఉత్సాహం పెంచుతున్నారు. మీరేమో చిన్న పిల్లవాడిని వయసుకు మించిన పెద్దవాడిగా తయారు చేస్తున్నారు. ఒక పాతిక సంవత్సరాల క్రితం నేను బాల మేధావిని అని చాలా బహుమతులు సన్మానాలు అందుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆ బాల మేధావిగా గుర్తించరు కదా. ఎంతో దీక్షతో చదివాను, చాలా బహుమతులు గెలిచాను కానీ అదే సమయం లో నేను నా బాల్యాన్నే కోల్పోయాను. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ వాళ్ళల్లో నా బాల్యాన్ని వెతుక్కుంటున్నాను. నాలో ఈ మార్పు ఒక బాలుడే తీసుకు వచ్చాడు.

ఆఫీసు పని మీద అమెరికా వెళ్తున్నాను ఒకరోజు. ఫ్లైట్ లో పక్కన ఒక కుర్రాడు 'హలో అక్కా నా పేరు సంతోష్ నీ పేరు?' అని పలకరించాడు. ఎంతో ఆనందంతో మెరిసిపోతోంది అతని ముఖం. చేతిలో ఒక లావు పుస్తకం ఉంది. ఏమిటి ఆ పుస్తకం అని అడిగాను అతన్ని. 'ఇదా షేక్స్ పియర్ డ్రామా. పదవ తరగతిలో ఈ నాటకం మీద ఒక పాఠం ఉంది. అది నాకు బాగా నచ్చి మొత్తం చదువుదామని కొనుక్కున్నా, సెలవలు కదా అన్నాడు నవ్వుతూ'. "అర్థం అవుతుందా మరి నీకు?" అన్నాను నేను ఆశ్చర్యంగా.
'ఎంత అర్థం అయితే అంత అవుతుంది'.
"ఏంటి ఫ్యూచర్ ప్లాన్?" అని అడిగా తెలుసుకుందాం అతని ప్రణాళికలు ఎలా ఉన్నాయో అని.
'చూడాలి వచ్చిన మార్కులని బట్టి. మాత్స్ తీసుకుందాం అనుకుంటున్నా అయినా ఇంకా చాలా సమయం ఉందిగా దానిగురించి ఆలోచించడానికి' అన్నాడు ఎంతో తేలికగా.
"మరి ఈ పుస్తకం బదులు ఉపయోగ పడే క్లాసు పుస్తకం చదవచ్చుగా
? నేను అలాగే చేసేదాన్ని క్లాసులు మొదలవకుండా  ముందే చదివేసి అన్నాను" కొంచం గర్వంగా.
'తరవాత ఎలాగా చదవాలి కదా అక్కా
, ఈ ఖాళీ సమయం లో ఇవి చదువుకోవచ్చు అని. ఇంకా బోలెడు పుస్తకాలు ఉన్నాయి బ్యాగ్ నిండా. ఇంతకీ నువ్వేమి చదువుతున్నావ్ అక్కా?' అని అడిగాడు నన్ను. 

"నా చదువు అయిపోయింది నేను ఉద్యోగం చేస్తున్నా అని కొంత గర్వంతో నేను చేస్తున్న ఉద్యోగ వివరాలు చెప్పాను.
'చిన్న దానిలా కనిపిస్తున్నావ్ ఇంకా స్టూడెంట్ లా ఉన్నావ్'
" అవును స్టూడెంట్ గా ఉండాల్సిన దాన్నే. పదకొండు సంవత్సరాల వయసులో పదవతరగతి
90శాతం తో పాస్ అయ్యా" అన్నాను నా తెలివి ప్రదర్శించాలని.
'ఓహో నిచ్చెన ఎక్కేశావా భలే ఉందే' అన్నాడు నవ్వుతూ.
"నెచ్చెన
? అదేంటి?"

'వైకుంఠపాళి నిచ్చెన. ఆడదామా నాదగ్గర ఉంది' అని బ్యాగ్ లోంచి తీసేసి నా సమాధానం వినకుండానే నీది ఎరుపు నాది పసుపు నువ్వే ముందు ఆడు అని నా చేతికి గవ్వలు కూడా ఇచ్చేశాడు. తనతో గడిపిన కొన్ని గంటలలో నేను నా బాల్యంలో ఏమి కోల్పోయానో తెలుసుకున్నా. ఇంక మా గమ్యం చేరే సమయానికి ఇద్దరం చాలా స్నేహితులమయ్యాం. వెళ్లిపోతూ 'అక్కా చదువు అయిపోవడం అనేది ఉండదు నా గుర్తుగా నువ్వు ఈ పుస్తకం ఉంచుకో నేను మళ్ళీ కొనుక్కుంటా' అని "కింగ్ లియర్" నాటకం నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. తరువాత నేను నాకు తెలియకుండానే మారిపోయాను. నేను చేసే ఉద్యోగం లో నాకు సంతృప్తి దొరకలేదు. లిటరేచర్ లో MA తరువాత చిన్నపిల్లల స్కూల్ లో పని చేయడానికి ఉపయోగ పడే డిప్లొమాలు, సైకాలజీ లో డాక్టరేటు చేసి ఇప్పుడు ఒక స్కూల్ నడుపుతున్నా.

పిల్లలని పిల్లల్లా ఉండనిద్దామ్. ఈ రోజుల్లో పిల్లలకి చాలా ఆటలు తెలియనే తెలియవు కంప్యూటర్ ఆటలు మొబైల్ ఆటలు తప్ప. వాళ్ళకి ప్రకృతి ని, మన సంస్కృతి ని చూపిస్తూ వాళ్ళతో సమయం గడపండి. రోజు మొత్తం వాడు బయటే ఉంటే ఇంక అమ్మ ప్రేమ, స్పర్శ అవి చూసే అవకాశమే వాడికి కలగట్లేదు. వాళ్ళు కొంచం పెద్ద అయ్యాకా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఆటలు, కళలు నేర్పించచ్చు. ఏ ఒక్కరూ అన్ని కళల్లోనూ నిష్ణాతులు అవ్వలేరు. ఒక్క మనిషి అన్నీ నేర్చుకోలేడు. పోటీ ప్రపంచం మనమే సృష్టిస్తున్నాం. వాళ్ళు మొగ్గల్లాంటి వాళ్ళు. మొగ్గ వికసించడానికి అవసరమైన సమయం దానికి ఇద్దాం. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవ్వడానికి అవసరమైన సమయం ఇవ్వాలి లేదా అని సీతాకోకచిలుకగా మారకుండానే అంతరించిపోతుంది.
సరళ, తన, భర్త అత్తమామలు అందరూ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, ఆనందించిన సందర్భాలు అన్నీ గుర్తు తెచ్చుకుని   ఈ కాలం పిల్లలు ఏవి కోల్పోతున్నారో అవి కనీసం కొన్నైనా మన పిల్లవాడికి ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.










Friday, 13 March 2015

పిజ్జా రొద

సుబ్బారావు గారింట్లో అందరూ కూర్చుని పిజ్జా తింటున్నారు. అందరూ తినగలినదాని కంటే కొద్దిగా ఎక్కువే తినగా ఇంకా ఒక పెట్టెలో సగం పిజ్జా మిగిలింది. ఇది చూసిన శ్రీమతి సుబ్బారావు పిల్లల్ని ఆ మిగిలినది కూడా తినేయమని వెంట పడసాగింది. అప్పటికే కడుపునిండుగా తిన్న వాళ్ళు ఇంక వాళ్ళ వల్ల కాదన్నారు. ఉదయం ఏభై రూపాయలు జీతం పెంచమన్న పనిమనిషి తో అరగంట వాదులాడిన శ్రీమతి సుబ్బారావు రెండువందల రూపాయల పిజ్జా వృధాగా పోవడానికి ఇష్టపడక తానే తినడానికి సిద్ధం అయింది.  ఆరోగ్యాభిలాషి అయిన సుబ్బరావు బావుమరిది "అక్కా వృధా అవుతుందని తినడానికి నీ కడుపు చెత్తకుండీ కాదు. రేపు ఆరోగ్యం పాడు అయితే ఇంతకు రెండింతలు ఖర్చు. దానిబదులు ఇప్పుడే దాన్ని చెత్తకుండీ లో పడెయ్యి" అని హితబోధ చేశాడు. బాధ పడుతూనే చెత్తబుట్టలో పడేసింది ఆ పిజ్జాని.

 ఇలాంటి దారుణాలు ఇంకా నేను ఎన్ని చేయాలో, ఎన్ని చూడాలో అని తనలో తానే కుమిలి పోయింది చెత్తబుట్ట. నా జన్మ ఎంత ధన్యం. నేను ఒక మొక్కకి ఆశ్రయం ఇస్తున్నా అని ప్రక్కనే గర్వంగా చూస్తున్న తన చెల్లెల్ని (ప్లాస్టిక్ పూల కుండీ) చూసి ఒకింత బాధపడింది పాపం చెత్తబుట్ట.

ఉదయాన్నే చెత్తబుట్టలు సేకరించి సమాజ శుభ్రతకి సహాయపడే ఒక శ్రామికుడు (ప్రజలు వాడే పేరు వాడడం ఇష్టం లేక) మిగిలిన పెట్టెలకంటే బరువుగా ఉన్న పెట్టెని తెరిచి వీటి రుచి ఎలా ఉంటుందో కూడా ఎరగని వాళ్ళు కొందరైతే ఎక్కసం అయినవాళ్ళు కొందరు అని బాధ పడుతూ దానిని బండి మీదకి విసిరాడు.

ఆ బండి మీద ప్రయాణిస్తున్న పిజ్జా మనోగతం ఇలా ఉంది.
నేను రుచికరం గా తయారవడానికి ఎంత మంది శ్రమిస్తున్నారో కదా!!
 నా మొదటి విడత తయారీకి దేశ విదేశీ రైతులు(కొన్ని పదార్థాలు విదేశాలనుండి కూడా వస్తాయిట), ముడి పదార్థాలు తయారు చేయడానికి శ్రమించిన వారు, రెండవ విడత తయారీకి కూడా చాలా మంది శ్రమించారు. ఇంకా వాటిని పెట్టడానికి ఉపయోగించే పెట్టెల తయారీకి ఎన్ని చెట్లు బలి అయ్యాయో కదా? [ఆశ్చర్యం ఏమిటంటే కొట్టుకి (అదే పిజ్జా హట్టుకి) వెళ్ళి తిన్నా ఈ అట్టపెట్టెలలోనే వడ్డిస్తారు] పెట్టెలు తయారు చేసిన శ్రామికుల శ్రమ, వాటిని ఇంటివరకూ అందించిన వారి శ్రమ, ఈ చెత్తని ప్రక్షాళన చేసేవారి శ్రమ, ఇంకా నేను ప్రస్తావించని ఎందరి శ్రమ ఇక్కడ ఉందో.

మనం వృధా చేసే ఆహార పదార్థం మనకి పెద్ద విలువైనది అనిపించకపోవచ్చు మన సంపాదన, ఆ వస్తువు ఖరీదు తో పోలిస్తే.  కానీ మనకి తెలియకుండా ఎంత మంది శ్రమని మనం వృధా చేస్తున్నామో కదా. ఒక తోటకూర కట్ట మన అశ్రద్ధ వల్లో లేదా మన బద్దకం వల్లో కుళ్లి పోయి చెత్తబుట్ట ని ఆశ్రయించినపుడు మనకు పెద్దగా నష్టం కలగదు కానీ తన శ్రమకి తగిన ఫలితం దొరక్క, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల వ్యధ గురించి ఆలోచిస్తే మనం చేసే వృధా కొద్దిగా తగ్గించవచేమో అని చిన్న ఆలోచన. జపాన్ లాంటి దేశాల్లో హోటళ్లలో ఆహార పదార్థాలు వృధా చేసిన వారికి పెనాల్టీలు వేస్తారుట. ఇలా వృధా చేసే వారికి ఎలాంటి పెనాల్టీ లు వేస్తే ఈ సమస్య తీరుతుంది.


మన పిల్లలకి ఇతరుల శ్రమని గుర్తించే విలువలు నేర్పుదాం. శ్రామికులను గౌరవిద్దాం.