Sunday, 6 September 2015

భగవద్గీత

దాదాపు రెండు దశాబ్దాలు గా మహారాష్ట్ర లో నివసిస్తున్నాం. ఈ మధ్య నాగపూర్ కి మారాక మాకు తెలుగు వారి పొరుగు  దొరికింది. ఏదో పండగలకి పుట్టింటికి, అత్తవారింటికి వెళ్లడం, ఆ సమయం లో విడుదల అయిన తెలుగు సినిమాలను చూసి ఆనందించడం తప్ప తెలుగు TV తో కూడా పెద్దగా పరిచయం లేదు. ఉదయం పని చేసుకుంటూ భక్తి పాటలు, భజనలు పెట్టుకుని వాటితో గొంతు కలుపడం నాకు ఒక అలవాటు. ఆదివారం అవడం వల్ల కొద్దిగా హడావుడి లేకుండా ఘంటసాల గారి భగవద్గీత వింటూ నా గాడిద స్వరం(నా పాటలు విని తరించి మా వారు, మా అబ్బాయి ఇచ్చిన బిరుదు లెండి) మధ్య మధ్యలో కలుపుతూ పని చేసుకుంటున్నా.

ఒక మిత్రుడు వాట్సాప్ శుభోదయ సందేశం తో పాటుగా ఏమి చేస్తున్నావ్ ఆదివారం విశ్రాంతా? అని అడగడం తో నా గోడు వినిపిద్దామని "గృహిణి కి ఆదివారం విశ్రాంతి ఎక్కడది నాయనా, రోజు కంటే కాస్త ఎక్కువ పనే ఉంటుంది" అన్నాను. ఏమి చేస్తున్నావ్ అని అడగగానే ఎంతో ఉత్సాహంగా "ఘంటసాల వారి భగవద్గీత వింటూ ఉప్మా పెసరట్టు కి ఏర్పాట్లు చేస్తున్నా. రోజూ డబ్బాల్లో ఎండిపోయిన రొట్టెలు తినే మా వాళ్ళకి రుచిగా చేసిపెడదామని". ఆహా విను విను, వింటూ తిను. ఘంటసాల గారు మంచి రాగాలతో చాలా బాగా పాడారు, మనవాళ్లే దానిని ఆ టైమ్ లో పెట్టి అందం పోగొట్టారు. నాకు ఆదివారం ఇప్పుడే తెల్లారింది. మళ్ళీ కలుస్తా, వస్తా'

ఏ టైమ్? ఏమోలే ఈ గాయకులు (నా స్నేహితుడు సంగీత పరిజ్ఞానం ఉన్న గాయకుడు లెండి), కవులు ఏమి మాట్లాడతారో అంత త్వరగా అర్థం కాదు అనుకుని నా పనిలో నేను పడ్డాను.

ఇంతలో పక్కింటి గాయత్రి గారు పరుగు పరుగున మా ఇంటికి వచ్చి ఏమిటి మీరు చేస్తున్న పని అని ఎంతో కంగారుగా అడిగింది. నాకు అర్థం కాలేదు.
ముందు ఆ టేప్ రికార్డర్ ఆపండి అంది. మీరు బావుంటున్నాయి అన్నారని ఈరోజు సౌండ్ కొంచం 
ఎక్కువ పెట్టాను అన్నాను ఏదో ఘనకార్యం చేసినట్టు. ఒక్క పరుగున వెళ్ళి ఆవిడే ఆపేసింది. 

ఏమైందండీ అన్నా నేను ఏమీ అర్థం కాక. అది పెట్టారెంటండీ అని ఆవిడ సాగదీస్తుంటే నేను వారానికి ఒకటి రెండు సార్లు వింటాను. ఇంచుమించు కంఠస్థం కూడా నాకు అంటున్నా గర్వంగా.
"ఏమిటండీ పొద్దున్నే ఇది? మా బామ్మ గారు, మా వారి బంధువుల మరణాలన్నీ వరసగా గుర్తొస్తున్నాయి. ఎవరు పోయారా అని నేను మా వారు ఇందాకటి నుంచి ఒకటే గాబరా పడుతున్నాం. ఇంకేమీ దొరకనట్టు ఇది పెట్టారు ఏంటి? ఇంక ఉండబట్టలేక నేను వచ్చేసాను"

ఆవిడ వివరించిన తరవాత నాకు అర్థమైంది ఏమిటంటే ఎవరైనా మరణించినపుడు మన రాష్ట్రం లో ఘంటసాల గారి భగవద్గీత లౌడ్ స్పీకర్ లో పెడుతున్నారని. మొన్నెప్పుడో ఊరెళ్ళినపుడు మా అబ్బాయి ఒక చోట షామియానా వేసి ఉంటే అక్కడ ఏమిజరుగుతోంది అని అడిగాడు. ఏదో ఫంక్షనో లేదా ఎవరో పోయారో అన్నారు మా అత్తగారు. భగవద్గీత వినిపిస్తే పోయినట్టా అన్నాను నేను యథాలాపంగా గాయత్రి తో. మీకు అన్నీ వేళాకోళమే, నాకు చాలా పని ఉంది అంటూ వెళ్లింది గాయత్రి.

పని చేస్తున్నానే కానీ ఆలోచన ఆగట్లేదు. 'ఆ టైమ్ లో పెట్టి' అన్న స్నేహితుని మాట కూడా ఇప్పుడు అర్థం అయింది నా మట్టి బుర్రకి. భగవద్గీత లోని సారం అందరికీ తెలియాలని, పామరులు కూడా సులభంగా అర్థం చేసుకోవాలని కొందరు మహానుభావులు చేసిన ఈ మహత్కార్యం ఇలాంటి స్థితికి వచ్చిందని నాలో నేను బాధ పడ్డాను.
ఒక శ్లోకం " పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జనియించకా తప్పదు. అనివార్యం అయిన మరణం గురించి చింతించటం వలదు" అని ఉన్నంత మాత్రాన భగవద్గీతని ఇలా వాడుకోవడం ఎంతో బాధ కలిగించింది. అనారోగ్యం తో బాధ పడుతూ కూడా అది ఎలాగైనా పూర్తి చేయాలని ఎంతో శ్రమించారు ఘంటసాల గారు అని ఎక్కడో చదివాను. ఇది ఇలాగే సాగితే తెలుగు వారు అందరూ విని తీరవలసిన ఘంటసాల భగవద్గీత అస్థిత్వం కోల్పోతుందేమో అనే భయం వేస్తోంది.

* * * * * * * * * * * * * * * * * *

ఇది రాసి పక్కకి పెట్టి కొద్దిగా దృష్టి మరల్చాలని ఈమధ్యనే పెట్టించిన డిష్ టి‌వి ఆన్ చేసాను. ఏదో సినిమా చివరి ఘట్టం. కథానాయిక మరణించింది. "అశతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతమ్గమయ" అని చూసి ఆశ్చర్యం కలిగింది. 'మృత్యోర్మా' అని వుందని ఉపనిషద్ లోని ఈ శ్లోకాన్ని కూడా చావుతో ముడి పెట్టారా అని. అప్పుడు నాకు అనిపించిన విషయం ఏమిటంటే ఘంటసాల భగవద్గీతని చావు కి ఆపాదించిన పుణ్యం కూడా మన టాలీవుడ్ దే అయి ఉండొచ్చు అని. ఎందుకంటే కొన్ని సినిమాల్లో విన్న, చూసిన గుర్తు వస్తోంది. కారణం ఏదైనా ఈ విషయం మాత్రం ఆలోచించవలసినదే.

ఇది ఎవరినీ బాధ పెట్టాలని రాసినది కాదు. భగవద్గీతని లక్ష్య గ్రంథం, రామాయణ మహాభారతాలను లక్షణ గ్రంథాలు అంటారు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే భగవద్గీతని చదవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి లక్షణాలు మనకి ఉండాలో ఎలాంటివి ఉండకూడదో తెలుసుకోవడానికి రామాయణ, మహాభారతాలు చదవాలి. ఈ బిజీ ప్రపంచం లో చదవడానికి సమయం లేకపోయినా  సులభమైన భాష లో అర్థం అయ్యేలా వివరించే ఘంటసాల వారి భగవద్గీత ని వినండి, పిల్లలకి వినిపించండి.


Friday, 10 July 2015

ఎటో తీసుకెళ్లిన కోణార్క్ ఎక్స్ ప్రెస్



ముంబాయి వెళ్లడానికి విశాఖపట్టణం లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. సెకండ్ ఏ‌సి కంపార్టుమెంటు లో ఒక జంట నా ఎదురుగా కూర్చున్నారు. విశాఖపట్టణం అందాలను హుద్ హుద్ ఎలా మింగేసిందీ సంభాషణలు మా మధ్య నడుస్తున్నాయి. చమటలు తుడుచుకుంటూ ఒక యువతి రైలు బండి ఎక్కింది. అప్సరస అని పుస్తకాలలో చదవడమే అంతవరకు, ఇప్పుడు ప్రత్యక్ష్యం గా చూడడం.  నేను హృతిక్ రోశన్ అంత అందగాడిని కాకపోయినా అనాకారిని మాత్రం కాదు.

ఆమె అందాన్ని చూసి మైమరచి పోయేలోపే ఆమె నాదగ్గరకి వచ్చింది. హలో సర్, are you single? అని అడిగింది. నలభై అయిదు సంవత్సరాలు ఉన్న నాకు ఆ ప్రశ్న కొంచం ఆశ్చర్యాన్ని కలిగించినా ఒక్క క్షణం అబద్ధం చెప్పేద్దామా అనిపించింది. నన్ను నేను తమాయించుకుని కాదండీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్నాను. అయ్యో అవునా bad luck అని జావ కారిపోయింది ఆమె. నీది కాదు నాది bad luck అనుకున్నా మనసులో.

కూర్చుని చమట మొత్తం తుడుచుకుని తాపీగా చెప్పింది “మా వారు పక్క కంపార్టు మెంటు లో ఉన్నారు మీరు single అయితే సీట్ మార్చుకుందామని అడిగాను”
ఇప్పుడు జావ కారడం నావంతయ్యింది.


Saturday, 4 April 2015

బాల్యమా నువ్వెక్కడ?





ముందురోజు అంతా ప్రయాణం వల్ల నాకు ఉదయం కొద్దిగా ఆలస్యంగా  ఏడు గంటలకు మెలకువ వచ్చింది. ఏదో కోలాహలం విన్నాకా గుర్తొచ్చింది నేను మా పిన్ని కూతురు సరళ ఇంటికి వచ్చాను అని. గదిలోంచి బయటకి రాగానే కంటిముందు సర్కస్ చూస్తున్న అనుభవం కలిగింది. సరళ ఏడు సంవత్సరాల కొడుకుతో ఇంట్లో అందరూ విన్యాసాలు చేస్తున్నారు. బామ్మ మొహానికి చేతులకి ఏదో లోషన్ రాస్తుంటే, నాన్న బూట్లు తొడుగుతున్నాడు. అమ్మ నోట్లో అదేదో పదార్ధం కుక్కుతోంది. పని అమ్మాయి బ్యాగ్, అంతకంటే పెద్ద ఫుడ్ బాస్కెట్ తో సిద్ధంగా ఉంది. పిల్లవాడు బస్ ఎక్కడంతో ఇల్లు సద్దు మణిగింది.
"అక్క లేచావా? చిన్నూ గాడు స్కూల్ కి వెళ్ళేవారకూ హడావుడి అనుకో రోజూ".
 అందరం కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సరళ "ఈ మధ్య చిన్నూ ఉత్సాహం గా ఉండట్లేదు, చాలా డల్ గా ఉంటున్నాడు. నువ్వు చిన్నపిల్లల స్కూల్ లో చేస్తున్నావ్ కదా కొద్దిగా వాడిని గమనించి ఏమి చేయాలో చెప్పవూ" అని తన చింత వెళ్ళబుచ్చింది. "దానేదేముందే తప్పకుండా చెప్తాను నాలుగు రోజులు ఉంటాను కదా" అని ధైర్యం చెప్పాను.

రాత్రి ఎనిమిది దాటుతున్నా పిల్లవాడు ఇంటికి రాలేదు. ఇంక ఉండలేక సరళని అడిగాను "బాబు ఇంకా రాలేదేంటి?" అని. వచ్చేస్తాడు ఇంకో అరగంటలో అని కంగారుగా వాడు రాగానే ఏమి తినిపించాలో తయారు చేసేపనిలో పడింది.

వాడు ఇంటికి రాగానే వాడికి స్నానం చేయించి బట్టలు తొడిగి టి.వి. ముందర కూర్చోబెట్టింది. వాడు చానల్ మారుస్తూ ఏవేవో చూస్తుండగా వాడికి భోజనం తినిపించి పడుకోబెట్టింది. ఆ పిల్లవాడి నోటి నుంచి ఉదయం బై, ఇప్పుడు గుడ్ నైట్ తప్ప ఏమీ వినలేదు నేను.

అందరూ కలసి భోజనాలు ముగించాం. ఇంక ఉండబట్టలేక "ఉదయం ఏడు గంటలకు వెళ్ళిన పిల్లవాడు రాత్రి ఎనిమిది దాటాక ఇంటికి వచ్చాడు ఏంటి? ఇన్ని గంటలు కూర్చోబెట్టే అదేమి స్కూల్" అని అడిగాను ఒకింత ఆశ్చర్యంగా. చాలా సరళంగా చెప్పడం మొదలు పెట్టింది సరళ "స్కూల్ మూడు గంటలకే అయిపోతుంది. అక్కడ నుండి చెస్ నేర్చుకోవడానికి, అటునుంచి కోచింగ్ క్లాస్ కి, అది అయ్యకా డ్రాయింగ్ క్లాస్ కి వెళ్ళి వస్తాడు".

"మరి మధ్యలో విశ్రాంతి ఉండదా?"
"ఎందుకు ఉండదూ బస్ లో స్నాక్స్ బాక్స్ తినేసి నిద్రపోతాడు. స్కూల్ నుంచి క్లాస్ కి వెళ్లడానికి గంట పైగా పడుతుంది" అంది చాలా సరళంగా.
నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు. ."శనివారం స్కూల్ ఉండదేమో కదా" అన్నాను ఉండకపోతే బాగుణ్ణు అని కోరుకుంటూ.
"లేదు శనివారం, ఆదివారం స్కూల్ కి సెలవలు ఉంటాయి. అయితే ఆ రెండు రోజులు ఇంట్లో చేయడానికి ప్రాజక్ట్ అవీ ఇస్తారు".

"పోనీలే ఆ రెండు రోజులూ ఇంటిపట్టున ఉంటాడు" అన్నాను కాస్త ఊరట కలిగి.
వెంటనే అందుకుంది సరళ ."ఎక్కడ అక్కా, ఆ రెండు రోజులే కదా ఏవైనా నేర్చుకోవడానికి దొరికేది. ఆ రెండు రోజుల్లో అబాకస్, యోగా, సంస్కృతం, సాయంత్రం డాన్స్, టెన్నిస్ క్లాసులు ఉంటాయి".
ఒక్కసారి గుండె జారి పొట్టలోకి వచ్చినట్టు అయింది నాకు.

ఇంతలో సరళ వాళ్ళ ఆయనతో చెప్పడం మొదలు పెట్టింది. "చిన్నప్పుడు మా అక్క వల్ల మేమందరం చాలా తిట్లు తినేవాళ్లం. అక్క పదకొండు సంవత్సరాలకి పదవ క్లాస్ పాస్ అయింది అదీ డి.ఇ.ఓ. ప్రత్యేక అనుమతితో ఇంకా జిల్లా లొకే ఎక్కువ మార్కులతో". అవునా గ్రేట్ అని అనడం పూర్తికాకుండానే కంటిన్యూ చేసింది "పదిహేడు సంవత్సరాలకి B Tech ఇంకా పంతొమ్మిదికి M Tech చేసి ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది అన్ని పత్రికలనీ. చిన్నతనం లోనే విదేశాల్లో ఉద్యోగాలు ఒక వెలుగు వెలిగింది అనుకోండి". "
అవునా మా అబ్బాయి కి ఏవైనా మెళకువలు చెప్పండి ఎలా చదువుకోవాలో, ఎలా ప్రణాళిక వేసుకోవాలో అని ఆమె భర్త వినయంతో కూడిన రిక్వస్ట్ చేస్తూనే ఇంతలో ఒకింత ఆశ్చర్యంతో అదేంటి మీరు ఏదో చిన్నపిల్లల స్కూల్ టీచర్ అని చెప్పింది నిన్న సరళ.
నేను ఒక చిన్న నవ్వు నవ్వి అవును ఇప్పుడు నేను టీచర్ నే.
మెల్లగా చెప్పడం ప్రారంభించాను "మీరు ఏమీ అనుకొక పోతే ఒక విషయం చెబుతాను. వాడికి గట్టిగా ఏడు సంవత్సరాలు లేవు. తలకి మించిన భారం మోపుతున్నారు. చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో వాడికి ఇన్ని రకాల క్లాసులు అవసరమా? ఒక వయసు వచ్చాక వాడి ఇష్టాన్ని బట్టి వాడికి ఆటలు, కళలు నేర్పించడం లో తప్పు లేదు. కానీ ఇంత చిన్న వయసులో వాడి శరీరం, బుర్ర రెండూ అలసిపోతున్నాయి. ఇంకా ఉత్సాహంగా ఉండట్లేదు అని అనుకోవడం లో అర్థం లేదు కదా?"
'అదేంటండి? ఈ పోటీ ప్రపంచం లో తట్టుకోవాలంటే ఆ మాత్రం శిక్షణ అవసరం' అని నాకే పాఠం చెప్పబోయాడు సరళ భర్త.

"ఈరోజుల్లో పెద్దవాళ్లకి టెన్షన్ లేకుండా తయారు చేయడానికి చాలా శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. పెద్దవాళ్లని పిల్లల్లా మార్చి ఆహ్లాదంగా జీవించేలా చాలా రకాల టెక్నిక్ లు అవీ నేర్పి, ఉల్లాసం ఉత్సాహం పెంచుతున్నారు. మీరేమో చిన్న పిల్లవాడిని వయసుకు మించిన పెద్దవాడిగా తయారు చేస్తున్నారు. ఒక పాతిక సంవత్సరాల క్రితం నేను బాల మేధావిని అని చాలా బహుమతులు సన్మానాలు అందుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆ బాల మేధావిగా గుర్తించరు కదా. ఎంతో దీక్షతో చదివాను, చాలా బహుమతులు గెలిచాను కానీ అదే సమయం లో నేను నా బాల్యాన్నే కోల్పోయాను. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ వాళ్ళల్లో నా బాల్యాన్ని వెతుక్కుంటున్నాను. నాలో ఈ మార్పు ఒక బాలుడే తీసుకు వచ్చాడు.

ఆఫీసు పని మీద అమెరికా వెళ్తున్నాను ఒకరోజు. ఫ్లైట్ లో పక్కన ఒక కుర్రాడు 'హలో అక్కా నా పేరు సంతోష్ నీ పేరు?' అని పలకరించాడు. ఎంతో ఆనందంతో మెరిసిపోతోంది అతని ముఖం. చేతిలో ఒక లావు పుస్తకం ఉంది. ఏమిటి ఆ పుస్తకం అని అడిగాను అతన్ని. 'ఇదా షేక్స్ పియర్ డ్రామా. పదవ తరగతిలో ఈ నాటకం మీద ఒక పాఠం ఉంది. అది నాకు బాగా నచ్చి మొత్తం చదువుదామని కొనుక్కున్నా, సెలవలు కదా అన్నాడు నవ్వుతూ'. "అర్థం అవుతుందా మరి నీకు?" అన్నాను నేను ఆశ్చర్యంగా.
'ఎంత అర్థం అయితే అంత అవుతుంది'.
"ఏంటి ఫ్యూచర్ ప్లాన్?" అని అడిగా తెలుసుకుందాం అతని ప్రణాళికలు ఎలా ఉన్నాయో అని.
'చూడాలి వచ్చిన మార్కులని బట్టి. మాత్స్ తీసుకుందాం అనుకుంటున్నా అయినా ఇంకా చాలా సమయం ఉందిగా దానిగురించి ఆలోచించడానికి' అన్నాడు ఎంతో తేలికగా.
"మరి ఈ పుస్తకం బదులు ఉపయోగ పడే క్లాసు పుస్తకం చదవచ్చుగా
? నేను అలాగే చేసేదాన్ని క్లాసులు మొదలవకుండా  ముందే చదివేసి అన్నాను" కొంచం గర్వంగా.
'తరవాత ఎలాగా చదవాలి కదా అక్కా
, ఈ ఖాళీ సమయం లో ఇవి చదువుకోవచ్చు అని. ఇంకా బోలెడు పుస్తకాలు ఉన్నాయి బ్యాగ్ నిండా. ఇంతకీ నువ్వేమి చదువుతున్నావ్ అక్కా?' అని అడిగాడు నన్ను. 

"నా చదువు అయిపోయింది నేను ఉద్యోగం చేస్తున్నా అని కొంత గర్వంతో నేను చేస్తున్న ఉద్యోగ వివరాలు చెప్పాను.
'చిన్న దానిలా కనిపిస్తున్నావ్ ఇంకా స్టూడెంట్ లా ఉన్నావ్'
" అవును స్టూడెంట్ గా ఉండాల్సిన దాన్నే. పదకొండు సంవత్సరాల వయసులో పదవతరగతి
90శాతం తో పాస్ అయ్యా" అన్నాను నా తెలివి ప్రదర్శించాలని.
'ఓహో నిచ్చెన ఎక్కేశావా భలే ఉందే' అన్నాడు నవ్వుతూ.
"నెచ్చెన
? అదేంటి?"

'వైకుంఠపాళి నిచ్చెన. ఆడదామా నాదగ్గర ఉంది' అని బ్యాగ్ లోంచి తీసేసి నా సమాధానం వినకుండానే నీది ఎరుపు నాది పసుపు నువ్వే ముందు ఆడు అని నా చేతికి గవ్వలు కూడా ఇచ్చేశాడు. తనతో గడిపిన కొన్ని గంటలలో నేను నా బాల్యంలో ఏమి కోల్పోయానో తెలుసుకున్నా. ఇంక మా గమ్యం చేరే సమయానికి ఇద్దరం చాలా స్నేహితులమయ్యాం. వెళ్లిపోతూ 'అక్కా చదువు అయిపోవడం అనేది ఉండదు నా గుర్తుగా నువ్వు ఈ పుస్తకం ఉంచుకో నేను మళ్ళీ కొనుక్కుంటా' అని "కింగ్ లియర్" నాటకం నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. తరువాత నేను నాకు తెలియకుండానే మారిపోయాను. నేను చేసే ఉద్యోగం లో నాకు సంతృప్తి దొరకలేదు. లిటరేచర్ లో MA తరువాత చిన్నపిల్లల స్కూల్ లో పని చేయడానికి ఉపయోగ పడే డిప్లొమాలు, సైకాలజీ లో డాక్టరేటు చేసి ఇప్పుడు ఒక స్కూల్ నడుపుతున్నా.

పిల్లలని పిల్లల్లా ఉండనిద్దామ్. ఈ రోజుల్లో పిల్లలకి చాలా ఆటలు తెలియనే తెలియవు కంప్యూటర్ ఆటలు మొబైల్ ఆటలు తప్ప. వాళ్ళకి ప్రకృతి ని, మన సంస్కృతి ని చూపిస్తూ వాళ్ళతో సమయం గడపండి. రోజు మొత్తం వాడు బయటే ఉంటే ఇంక అమ్మ ప్రేమ, స్పర్శ అవి చూసే అవకాశమే వాడికి కలగట్లేదు. వాళ్ళు కొంచం పెద్ద అయ్యాకా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఆటలు, కళలు నేర్పించచ్చు. ఏ ఒక్కరూ అన్ని కళల్లోనూ నిష్ణాతులు అవ్వలేరు. ఒక్క మనిషి అన్నీ నేర్చుకోలేడు. పోటీ ప్రపంచం మనమే సృష్టిస్తున్నాం. వాళ్ళు మొగ్గల్లాంటి వాళ్ళు. మొగ్గ వికసించడానికి అవసరమైన సమయం దానికి ఇద్దాం. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవ్వడానికి అవసరమైన సమయం ఇవ్వాలి లేదా అని సీతాకోకచిలుకగా మారకుండానే అంతరించిపోతుంది.
సరళ, తన, భర్త అత్తమామలు అందరూ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, ఆనందించిన సందర్భాలు అన్నీ గుర్తు తెచ్చుకుని   ఈ కాలం పిల్లలు ఏవి కోల్పోతున్నారో అవి కనీసం కొన్నైనా మన పిల్లవాడికి ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.










Friday, 13 March 2015

పిజ్జా రొద

సుబ్బారావు గారింట్లో అందరూ కూర్చుని పిజ్జా తింటున్నారు. అందరూ తినగలినదాని కంటే కొద్దిగా ఎక్కువే తినగా ఇంకా ఒక పెట్టెలో సగం పిజ్జా మిగిలింది. ఇది చూసిన శ్రీమతి సుబ్బారావు పిల్లల్ని ఆ మిగిలినది కూడా తినేయమని వెంట పడసాగింది. అప్పటికే కడుపునిండుగా తిన్న వాళ్ళు ఇంక వాళ్ళ వల్ల కాదన్నారు. ఉదయం ఏభై రూపాయలు జీతం పెంచమన్న పనిమనిషి తో అరగంట వాదులాడిన శ్రీమతి సుబ్బారావు రెండువందల రూపాయల పిజ్జా వృధాగా పోవడానికి ఇష్టపడక తానే తినడానికి సిద్ధం అయింది.  ఆరోగ్యాభిలాషి అయిన సుబ్బరావు బావుమరిది "అక్కా వృధా అవుతుందని తినడానికి నీ కడుపు చెత్తకుండీ కాదు. రేపు ఆరోగ్యం పాడు అయితే ఇంతకు రెండింతలు ఖర్చు. దానిబదులు ఇప్పుడే దాన్ని చెత్తకుండీ లో పడెయ్యి" అని హితబోధ చేశాడు. బాధ పడుతూనే చెత్తబుట్టలో పడేసింది ఆ పిజ్జాని.

 ఇలాంటి దారుణాలు ఇంకా నేను ఎన్ని చేయాలో, ఎన్ని చూడాలో అని తనలో తానే కుమిలి పోయింది చెత్తబుట్ట. నా జన్మ ఎంత ధన్యం. నేను ఒక మొక్కకి ఆశ్రయం ఇస్తున్నా అని ప్రక్కనే గర్వంగా చూస్తున్న తన చెల్లెల్ని (ప్లాస్టిక్ పూల కుండీ) చూసి ఒకింత బాధపడింది పాపం చెత్తబుట్ట.

ఉదయాన్నే చెత్తబుట్టలు సేకరించి సమాజ శుభ్రతకి సహాయపడే ఒక శ్రామికుడు (ప్రజలు వాడే పేరు వాడడం ఇష్టం లేక) మిగిలిన పెట్టెలకంటే బరువుగా ఉన్న పెట్టెని తెరిచి వీటి రుచి ఎలా ఉంటుందో కూడా ఎరగని వాళ్ళు కొందరైతే ఎక్కసం అయినవాళ్ళు కొందరు అని బాధ పడుతూ దానిని బండి మీదకి విసిరాడు.

ఆ బండి మీద ప్రయాణిస్తున్న పిజ్జా మనోగతం ఇలా ఉంది.
నేను రుచికరం గా తయారవడానికి ఎంత మంది శ్రమిస్తున్నారో కదా!!
 నా మొదటి విడత తయారీకి దేశ విదేశీ రైతులు(కొన్ని పదార్థాలు విదేశాలనుండి కూడా వస్తాయిట), ముడి పదార్థాలు తయారు చేయడానికి శ్రమించిన వారు, రెండవ విడత తయారీకి కూడా చాలా మంది శ్రమించారు. ఇంకా వాటిని పెట్టడానికి ఉపయోగించే పెట్టెల తయారీకి ఎన్ని చెట్లు బలి అయ్యాయో కదా? [ఆశ్చర్యం ఏమిటంటే కొట్టుకి (అదే పిజ్జా హట్టుకి) వెళ్ళి తిన్నా ఈ అట్టపెట్టెలలోనే వడ్డిస్తారు] పెట్టెలు తయారు చేసిన శ్రామికుల శ్రమ, వాటిని ఇంటివరకూ అందించిన వారి శ్రమ, ఈ చెత్తని ప్రక్షాళన చేసేవారి శ్రమ, ఇంకా నేను ప్రస్తావించని ఎందరి శ్రమ ఇక్కడ ఉందో.

మనం వృధా చేసే ఆహార పదార్థం మనకి పెద్ద విలువైనది అనిపించకపోవచ్చు మన సంపాదన, ఆ వస్తువు ఖరీదు తో పోలిస్తే.  కానీ మనకి తెలియకుండా ఎంత మంది శ్రమని మనం వృధా చేస్తున్నామో కదా. ఒక తోటకూర కట్ట మన అశ్రద్ధ వల్లో లేదా మన బద్దకం వల్లో కుళ్లి పోయి చెత్తబుట్ట ని ఆశ్రయించినపుడు మనకు పెద్దగా నష్టం కలగదు కానీ తన శ్రమకి తగిన ఫలితం దొరక్క, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల వ్యధ గురించి ఆలోచిస్తే మనం చేసే వృధా కొద్దిగా తగ్గించవచేమో అని చిన్న ఆలోచన. జపాన్ లాంటి దేశాల్లో హోటళ్లలో ఆహార పదార్థాలు వృధా చేసిన వారికి పెనాల్టీలు వేస్తారుట. ఇలా వృధా చేసే వారికి ఎలాంటి పెనాల్టీ లు వేస్తే ఈ సమస్య తీరుతుంది.


మన పిల్లలకి ఇతరుల శ్రమని గుర్తించే విలువలు నేర్పుదాం. శ్రామికులను గౌరవిద్దాం.

Thursday, 19 February 2015

చిన్న విన్నపం

ప్రియమైన దేముడా,
ఎందుకయ్యా మా తెలుగు చిత్ర పరిశ్రమ మీద పగబట్టావు? రంభ ఊర్వశి ల వినోదం విసుగు తెప్పించిందా? తెలుగు గడ్డమీద వినోదం తో ఈర్ష్య కలిగిందా?  మొన్న వరుస పెట్టి కొంత మంది హాస్య నటులని, కారక్టర్ నటులని తీసుకువెళ్లావు. దర్శక రత్నాలు బాపు, బాలచందర్ లని కొంప మునిగినట్టు తీసుకుపోయావు. ఒకరి శోకం నుండి బయట పడే లోపు ఇంకొకళ్లని నీ దగ్గరకు తీసుకు పోతున్నావు. ఏదో నీకు వినోదం తక్కువ అయి మా హాస్య నటులని తీసుకెళ్తున్నావనుకున్నాం. మొన్న జగపతి రాజేంద్రుణ్ణి  ఈ రోజు తెలుగు సినిమాకి రాజైన రామానాయుడిని. బహుశా మీ టీం కి క్రమశిక్షణ, నిబద్ధత మొదలైన అంశాలు కూడా కరువైనట్టున్నాయి. శిక్షణ శిబిరం లాంటివి మొదలు పెట్టలేదు కదా.
తెలుగు వాడికి సినిమా ఒక వినోదం మాత్రమే కాదు, జీవితం లో ఒక భాగం. తెలుగు ప్రజలు సినీ రంగం వారిని అభిమానించినట్టు మారేరాష్ట్రం లోనూ కనపడదు. రామానాయుడు అంతిమ యాత్రకి వచ్చిన వారిని చూసిన తరువాత  నీ తప్పు నీకు తెలిసి ఉంటుంది. ఆ ధన్యజీవి లోని క్రమశిక్షణ, శ్రమించే గుణం, మానవత్వం, దయాగుణం లాంటివి అన్నీ ఆయన బిడ్డలు, మనుమలు, ఆయన దగ్గర శిష్యరికం చేసిన ప్రతివారూ నేర్చుకున్నారులే. కష్టపడే గుణం, క్రమశిక్షణ ఉన్నవాళ్లకి అదృష్టం ఆ రెండిటి మధ్య ఇరుక్కుని వచ్చేస్తుందని నిరూపించిన వాళ్ళలో రామానాయుడు ఒకరు.
నిన్ను విన్నవించుకునేది ఏమిటంటే కొన్నాళ్ళ పాటు మా టాలీవుడ్ వైపుకి రాకు. ప్రజలు తట్టుకో లేకపోతున్నారు. ఇది విన్నపం అనుకుంటావో ఆజ్ఞ అనుకుంటావో నీయిష్టం. ఈ కష్టాలనుండి తెరుకునే శక్తి ని పరిశ్రమకి, అందులోని సభ్యులకి, సామాన్య ప్రేక్షకునికి ఇయ్యి. రామానాయుడి ఆత్మ కి శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనో స్థైర్యం కలగాలని విన్నవించుకుంటూ

సెలవు.

Monday, 16 February 2015

పోరా, పోటీ నా?



ఉదయం పేపర్ చూడగానే ఒక వార్త నన్ను ఆలోచనలోకి నెట్టింది. "భారత్ పాకిస్తాన్ మధ్య పోరు (war), ఐతిహాసికం" చదవగానే ఏదో కలవరం. ఏదో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిపోతున్నట్లు రాసారు. ఇంక టి‌వి ఛానల్ వాళ్ళు సరేసరి. ప్రపంచ కప్ ఆటల పోటీ లా లేనేలేదు. భారత్ బ్యాట్స్ మన్ కి  పాక్ బౌలర్ కి మధ్య యుద్ధం అని ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా రాసిన కథానిక చదివి కొంచం బాధ కొంచం భయం కూడా కలిగాయి.
ఒక స్నేహితుని దగ్గరనుండి ఫోను వచ్చింది పూజ చేశావా అంటూ. ఏదైనా పర్వదినామా నేను మర్చిపోయానా అనే అనుమానం కలిగింది నాకు. ఏమిటి విశేషం? ప్రత్యేక పూజ ఏమీ చేయలేదే అన్నాను నేను. అదేంటి క్రికెట్ మ్యాచ్ కదా, భారత్ గెలవాలని పూజ చేయలేదా అని. కనీసం ప్రార్థన అయినా చేయి భారత్ గెలవాలి. ఏదో పరీక్ష రాయడానికి వెళ్తున్నట్టు ఒకళ్ళకి ఒకరు అల్ ద బెస్ట్ అంటూ విష్ చేసుకోవడం అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ మ్యాచ్ తో ప్రజలు చాలా రకాలుగా ముడిపడి ఉన్నారు. ఖాళీ స్థలాల్లో పందిళ్ళు వేసి పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి టిక్కెట్లు అమ్మినవాళ్లు కొందరైతే  ఉదయం నుండి బార్లు తెరిచి కూర్చున్నవారు కొందరు. ఒక టి‌వి ఛానల్ వాళ్ళు అమితాభ్ బచన్ ని తెస్తే వేరే ఛానల్ వాళ్ళు ఇంకో సెలెబ్రేటి ని తెచ్చారు. సినిమాకి వెళ్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే మొన్న శుక్రవారం విడుదల అయిన సినిమా కి హాల్ అంతా ఖాళీ. ఎప్పుడూ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే వీధులు నిర్మానుష్యం. అన్నికంటే వింత అయిన విశేషం ఏమిటంటే ఒక పెళ్ళికి వెళ్లవలసి వచ్చి వేదిక చూద్దామని శుభలేఖ తెరిచిన నాకు ఆశ్చర్యానికి అమ్మమ్మ లాంటిది ఏదో కలిగింది. అది ఏమిటంటే శుభలేఖ లో గమనిక: భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూపబడును అని వేశారు. పెళ్ళికి ఎవరూ రారేమో అనే గాబరా వాళ్ళది. పెళ్లి వేదికలో తెరలు పెట్టి మరీ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూపించారు పెళ్ళివారు.
సాయంత్ర సమయంలో దీపావళి సంబరాలు. మ్యాచ్ మంచి రసవత్తరం గా లేదని కొందరిలో అసంతృప్తి ఉన్నా ఘనవిజయ సంబరాలను అందరూ జరుపుకున్నారు.

సమాంతర వినోదం గా ఫేస్ బుక్ ఇంకా వాట్స్ ఆప్ లో మ్యాచ్ కి ముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంకా మ్యాచ్ అయిన తరువాత వచ్చిన జోక్ లకి ప్రజల సృజన, సమయస్ఫూర్తి లకు చక్కని వేదిక దొరికింది అనిపించింది.

Tuesday, 27 January 2015

పిల్లలు - గణతంత్రదినం




   అమ్మా, నాకు 300 రూ. ఇస్తావా? రేపు ఫ్రెండ్స్ ఒక పది మంది కలసి పార్టీ చేసుకుని అటునుంచి ఒక దేశభక్తి సినిమా వచ్చింది అది చూద్దాం అనుకుంటున్నాం అని గారంగా అడిగాడు మా అబ్బాయి. విశేషం ఏమిటో అని అడిగాను తెలీక. నీకు తెలియదా రేపు రిపబ్లిక్ డే. ఓహో రిపబ్లిక్ డే కి కూడా పార్టీలు చేసుకుంటున్నారా ఈ మధ్య అనే సందేహం వెలిబుచ్చాను. ఇది మామూలు రిపుబ్లిక్ డే కాదమ్మా. ఒబామా వస్తున్నాడు నీకు తెలియదా? ఇది చాలా స్పెషల్ రిపబ్లిక్ డే. ఎంతో ఉత్సాహంగా, ఒబామా వస్తున్నందుకు ఎన్ని వందల సి‌సి కెమెరాలు పెట్టారు, ఒబామా కార్ ఎలాంటిది, దాని విశేషాలు, దాని ప్రత్యేకతలు, జరుగుతున్న ఏర్పాట్లు అన్నీ గుక్క తిప్పుకోకుండా ఎంత విశేషమైన రిపబ్లిక్ డే అనే విషయం చెప్పాడు మా వాడు. నాకు కూడా ఎందుకో అంత స్పెషల్ రేపబ్లిక్ డే వాళ్ళతో గదుపుకుందామని బుద్ధి పుట్టింది. రేపు కాలేజీ లో జండావందనం అయ్యాకా మీ ఫ్రెండ్స్ ని బ్రేక్ ఫాస్ట్ కి  ఇంటికి పిలు. ఇడ్లీ వడ చేస్తా. సరదాగా గడిపి అప్పుడు సినిమా చూసి వద్దురుగాని అన్నాను. సౌత్ ఇండియన్ అంటే ఈ మహారాష్ట్ర వాళ్ళు పది కాదు పాతిక మంది వస్తారు మన ఇంటికి. పాతిక వద్దులే బాగా దగ్గర స్నేహితులని ఒక 8 – 10 మందిని పిలు. జండా వందనం ఎన్ని గంటలకి కాలేజీలో అడిగాను ఏర్పాట్లు చేసుకుందామని. ఏంటమ్మా ఇంకా జండావందనాలకి ఏమి వెళ్తామ్ చెప్పు. స్కూల్ లో అంటే తప్పేది కాదు. ఇప్పుడు కాలేజీ కి వచ్చేసాం అమ్మా. ఏదో ఎన్‌సి‌సి వాళ్ళు ఎన్‌ఎస్‌ఎస్ వాళ్ళు వెళ్తారు తప్ప మేము వెళ్లము. ఈరోజంతా నాకు అశ్చర్యాలే కాబోలు అనుకుని అయితే అందరినీ ఎనిమిది గంటలకి రమ్మని చెప్పు అని పప్పులు నానబెట్టే పనిలోకి వెళ్ళాను.
       త్వరగా అన్నీ వండి, సర్ది ఉంచేలోపే ఒక్కొక్కరూ రావడం మొదలు పెట్టారు ఎనిమిది కాకుండానే. వస్తూనే అందరూ విష్ చేసుకుంటూ నాకు కూడా హాపీ రిపబ్లిక్ డే ఆంటీ అని విష్ చేశారు. అందరూ తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే నాకు కూడా ఆనందం వేసింది. వాళ్ళ సంభాషణలు కొంత నవ్వు కూడా తెప్పించేవిగా ఉన్నాయి. ఏరా నేను రిపబ్లిక్ డే విష్ పెడితే లైక్ చేయలేదేంట్రా ఫేస్ బుక్ లో అని ఒకడు అన్నాడు. వాడు దానికి ఎందుకు చేస్తాడురా సన్నీ లియోన్ అయితే చేసేవాడు. బొత్తిగా దేశభక్తి లేకుండా పోతోందిరా అన్నాడు ఇంకొకడు. నా విష్ కి ఒక గంటలో వంద పైన లైకులు వచ్చాయి తెలుసా అంది ఒక అమ్మాయి. నీ ఫ్రెండ్స్ అందరూ దేశభక్తులు మరీ అన్నాడు ఇంకో కుర్రాడు. ఇలా వాట్సెప్ ఫేస్ బుక్ కబుర్లే ఎక్కువ ఉన్నాయి.
      సామాన్లు సర్దడానికి నాకు సహాయం చేస్తూ చాలా బాగా చేశారు ఆంటీ, అయినా ఇంత మందికి ఎలా చేశారు మీరు నేను తమ్ముడికి మాగీ చేసి పెట్టడానికే అలసిపోతాను అంది ఒక అమ్మాయి. నాకు ఇలా తినిపించడం సరదా అమ్మా అన్నాను నవ్వుతూ. నువ్వు లక్కీ రా అని పొగిడారు అందరూ, దానికి కొంత గర్వంగా ఫీల్ అయ్యాడు మా అబ్బాయి. సరే కానీ రిపబ్లిక్ డే అంటే ఏంటో ఎవరైనా చెప్తారా అని అడిగా ఏదో వాళ్ళతో మాటలాడాలి కదా అని. వాళ్ళు చెప్పిన సమాధానాల్లో కొన్ని షాక్ తెప్పించినవి ఇస్తున్నా మీకోసం. బంగ్లాదేశ్ ఇండియా నుంచి విడిపోయిన రోజు, స్వతంత్రం ఆగష్టులో వచ్చింది రిపబ్లిక్ ఈ రోజు వచ్చింది, గాంధీగారు పోయిన రోజు అనుకుంటా..... ఇలాంటి సమాధానాలు విని ముందురోజు ఆశ్చార్యానికి మించినది ఏదో కలిగింది నాకు. ఈలోపు ఒకడు ఒన్ సెక్ ఆంటీ ఇప్పుడే చెప్తా అని మొబైల్ తీస్తున్నాడు. వద్దులే బాబు గూగుల్ చేయొద్దులే ఇప్పుడు అని మా అబ్బాయి ని అడిగా పోనీ నువ్వు చెప్పారా నీకు తెలుసు కదా అని. ఇండిపెండెన్స్ డే గుర్తుంది కానీ ఇది గుర్తు లేదు అన్నాడు కొద్దిగా సిగ్గు పడుతూ. అందేంటి మీ అందరికీ ఏడవ తరగతిలో సోషల్ స్టడీస్ లో ఒక పాఠం ఉంది కదా అని అడిగాను. ఎప్పుడో చిన్నప్పటివి ఏమి గుర్తు పెట్టుకుంటాం ఆంటీ అని నేను చూసిన చూపుకి నాలుక కరుచుకున్నాడు ఒక కుర్రాడు. అదేంటిరా నువ్వు స్పీచ్ కూడా ఇచ్చావ్ కదా గుర్తులేదా అన్నాను కొంచం గొంతు పెంచి. మీ వాడికి కొంచం ఎదగమని చెప్పండి ఆంటీ, అన్నిటికీ అమ్మ చెప్పింది అంటూ ఉంటాడు. మొన్న సిగ్నల్ బ్రేక్ చేస్తే ఒక ఏభై పోలీసు కి కొడితే సరిపోయే దానికి పావు గంట టైమ్ వేస్ట్ చేసి దానికీ, ఇంకా లైసెన్స్ మర్చిపోయాడని దానికి 250 రూ. ఇచ్చాడు. పైగా అమ్మ చెప్పింది అన్నాడు కూడా. సిగ్నల్ ఎందుకు బ్రేక్ చేయాలి అని అడిగా కొంత అసహనంతో. టైమ్ ఈజ్ మనీ ఆంటీ అన్నాడు ఆ అబ్బాయి. ఎదురుగా వస్తున్న బండి గుద్దెస్తే అనగానే చాన్సే లేదు ఆంటీ ఐదు సంవత్సరాలనుంచీ బండి నడుపుతున్నాను. అతనితో ఇంకా మాట్లాడడం అనవసరం అనుకున్నా నేను.
       పోనీ లెండి. ఇప్పుడు టి‌వి లో ఒబామా పాల్గొనే ఉత్సవాలు వస్తాయి అది చూడండి అందరూ, నేను హోటల్ కి లంచ్ ఆర్డర్ ఇస్తా, తినేసి అప్పుడు సినిమా చూసి వద్దురుగాని అన్నాను. పోనీలే ఏదో క్లాస్ పీకినా మంచి ఆఫర్ ఇచ్చింది అనే ఒక తృప్తి కనబడింది వాళ్ళలో. టి‌వి పెట్టగానే ఒకడు అన్నాడు ఏముందిరా జండా ఎగరేస్తారు, మోదీ స్పీచ్ ఇస్తాడు అంతే కదా అని. అయినా మోదీ స్పీచ్ బావుంటుందిరలే, మొన్న అమెరికా, ఆస్ట్రేలియా దీ ఇంకా ఇండిపెండెన్స్ డే ది విన్నాను బావున్నాయి. ఇంకోడు అంటాడు లేదు ఒబామా వచ్చాడుగా ఏవో స్పెషల్ గా ఉంటాయి అన్నాడు చూద్దాం అన్నట్టుగా. దూర్ దర్శన్ లో కార్యక్రమం మొదలు అయింది. చక్కటి వ్యాఖ్యానం తో చూడ ముచ్చటగా ఉంది కార్యక్రమం. మెల్లగా ఈ పిల్లలందరిలోనూ కూడా ఆసక్తి కనబడింది నాకు. ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న అమరవీరుల సతీమణులు, మన భిన్న సంస్కృతులను తెలుపుతూ వచ్చిన శకటాలు, రకరకాల విన్యాసాలు అన్నీ చూసిన పిల్లల్లో ఒక రకమైన సంతోషం చూసాను. జాతీయ గీతం రాగానే అప్రయత్నం గా నుంచున్నారు అందరూ. చానల్ మార్చకుండా మూడు గంటల పాటు ఒక కార్యక్రమం చూడడం ఇదే మొదటి సారి కదా అనగానే అవును కదా అని ఆశ్చార్యానికి లోనవడం వాళ్ళ వంతయింది ఇప్పుడు. జండా వందనానికి వెళ్ళడం అంటే సమయం ఎక్కువ అయి కాదు. మనకోసం తమ ప్రాణాలు అర్పించిన వీరులకి మన దేశానికి వందనం తెల్పడం. అది ఒక గౌరవం తెలిపే పద్ధతి. మీకు ఏదైనా సందేహం వస్తే ఏమి చేస్తారు ఇంటర్నెట్ లో చూసుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఒక పది నిమిషాలు ఇస్తాను మీ గూగుల్ ఆంటీ ని అడిగి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసుకోండి. ఇంకో పావు గంటలో భోజనం వచ్చేస్తుంది.
          అందరూ రకరకాల సైట్స్ వెతికి మరీ చదువుకున్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ సంబాషణ కొంచం తృప్తినీ కొంచం ఆనందాన్నీ ఇచ్చింది. ఒక అబ్బాయి వాళ్ళ తాతగారికి ఫోన్ చేసి తాతా నేను ఇప్పటివరకూ రిపబ్లిక్ డే ప్రోగ్రాం చూసాను. సారీ తాతా, నువ్వు ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. చాలా బాగున్నాయి. ఇంకో గంటలో ఇంటికి వస్తాను అప్పుడు చాలా కబుర్లు చెప్పుకుందాం అన్నపుడు నాకు కలిగిన తృప్తి మాటల్లో వివరించలేను. సినిమా కి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం రా మా చెల్లికి రేపబ్లిక్ డే గురించి చెప్పి యూ ట్యూబ్ లో కార్యక్రమం చూపిస్తా. అందరూ ఇలాగే సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు.
       ప్రతి వాళ్ళు ఈ యువతరం పాడు అయిపోయింది అని ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పేముంది పాపం. వాళ్ళకి అందుబాటులో ఉన్నవి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళతో గడపడానికి వాళ్ళకి విలువలు నేర్పడానికి పెద్దవాళ్లకే తీరిక లేని బిజీ ప్రపంచం లో ఉన్నాం. ఆఫీసు నుంచి వచ్చాక కొంచం సమయం టి‌వి చూసుకోవాలని ఉండే వాళ్ళు కొందరైతే, పిల్లలు మన మాట ఎలాగూ వినరు అనే నిర్ణయానికి వచ్చేసినవాళ్లు కొందరు. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఇల్లు ఆఫీసు తప్ప వేరే దేనికీ సమయమే ఉండదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంటి పని, టి‌వి సీరియల్ తోనే సరిపోతుంది. యువతరం ఏది నేర్పినా నేర్చుకోవడానికి సిద్ధం గా ఉంటారు. వాళ్ళ కోసం మనమే కొంచం సమయం కేటాయించాలి. చెప్పే రీతిలో చెప్తే అందరూ నేర్చుకుంటారు. మొదటిసారి సిగ్నల్ బ్రేక్ చేసినపుడు ఎవరికో ఒక పెద్ద వాళ్ళకి చెప్పే ఉంటాడుగా ఆ కుర్రాడు. అప్పుడు అలా చేయకు అని, చేసినా ఫైను కట్టు అని అతనికి అర్థం అయ్యేలా చెప్పి ఉంటే అతని పద్దతి ఇలా ఉండేది కాదేమో కదా? యువతరానికి దగ్గర అవుతున్న, వాళ్ళను ఆకర్షిస్తున్న ప్రస్తుత ప్రధాన మంత్రి చేసే ప్రయత్నం సఫలం అవ్వాలంటే మనం అందరం ఒక చేయి వేయవలసినదే. వాళ్ళలో మంచి విలువలు పెంపొందించవలసినదే. ఏమంటారు మీరు కూడా మీ పిల్లలతో స్నేహం పెంచుకుందాం అనుకుంటున్నారా? లేదా గూగుల్ పిన్నిని రిపబ్లిక్ డే ఎందుకు ఎలా వచ్చింది అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నారా?  చెప్పండి.
ఒబామా రావడం వల్ల చాలా మంది యువకులకి రిపబ్లిక్ డే మీద ఆసక్తి కలిగింది. భారత ప్రధానికి, అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు.

ఇది నా అనుభవం ఇంకా నా  అభిప్రాయం మాత్రమే. ఎవరినీ నొప్పించడానికి ఇది రాయలేదు అని మనవి.