Wednesday, 4 May 2016

అమ్మ రుణం తీరేదా?

అమ్మని కోల్పోయి ఈరోజుకి నాలుగు సంవత్సరాలు అయ్యాయి. ఇన్ని ఏళ్ళు అమ్మ లేకుండా ఎలా గడిచిందా అని ఆలోచిస్తే ఆశ్చర్యం తప్ప సమాధానం దొరకలేదు.

నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు నాకు అనుక్షణం గుర్తు వస్తూ ఉంటాయి. అమ్మ అనారోగ్యం నన్ను చాలా బాధించేది. అమ్మని త్వరగా తీసుకుపొమ్మని దేవుణ్ణి  ప్రార్థించిన రోజులు కూడా ఉన్నాయి. కొడుకుని అని ఏమో అక్క, చెల్లాయి కంటే అమ్మ నన్ను కొంచం ఎక్కువ ప్రేమించేది అనిపిస్తుంది నాకు.  ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉంటూ సెలవలకి అమ్మ దగ్గరకి వెళ్లినప్పుడు ఎంతో శ్రమకోర్చి నాకు ఇష్టమైనవి అన్నీ చేసిపెట్టేది. అలాంటి అమ్మ  ఇంత అవస్థ పడడం నాకు చాలా కష్టం తోచేది. పని మనుషులు ఉన్నా దగ్గర ఉండి అమ్మ అవసరాలని చూసుకోవడంలో ఆనందం ఉండేది.  అమ్మ నా పసితనంలో నాకు చేతకాని నా అవసరాలు ఎలా తీర్చిందో అలాగే నాకు వచ్చినట్లుగా ఆవిడ అవసరాలు తీర్చేవాడిని. మగవాడివి ఇవన్నీ నువ్వెందుకు చేయడం పెండ్లి చేసుకోమని బంధువులు సలహాలిచ్చినా ఏనాడూ పట్టించుకోలేదు.



అలాంటి నేను ఒక దుర్దినాన పరిస్థితులకు లొంగిపోవడం వల్లో, నా లోని ఓపిక తగ్గిపోవడం వల్లో లేదా నా దురదృష్టం వల్లో కొంతమంది స్నేహితుల సలహాతో అమ్మని కాకినాడలోని వృద్ధాశ్రమానికి తీసుకుని వచ్చాను. అక్కడి ఫార్మాలిటీలు అన్నీ పూర్తి అయ్యాకా అక్కడ పనిచేసేవారు 'మేము చూసుకుంటాం మీరు వెళ్లిరండి' అని అనగానే నాకు ఉన్నట్టుండి నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది.  " అదేంటి! అమ్మదగ్గర ఎవ్వరం ఉండకుండా వెళ్లిపోతున్నాం. నేను కానీ, అక్క లేదా చెల్లి కానీ ఉండాలి కదా! నేను వెళ్లిపోవడం ఏమిటి, ఇక్కడ ఉండాలి. అమ్మకి ఏదైనా అవసరం వస్తే? 'బాబూ' అని పిలిస్తే? ఇదేంటి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నాను. సెలవు లేకపోతే, ఉద్యోగం పోయేలా ఉంటే మాత్రం ఇలా వదిలేసి వెళ్లిపోదామని ఎందుకు అనుకున్నాను?" రకరకాల ప్రశ్నలు, బుర్రలో ఏవేవో ఆలోచనలు, ఏమిచేయాలో తెలియని పరిస్థితి. తీసుకున్న ఈ నిర్ణయం సరి అయినదేనా అని అనుమానం.
స్నేహితుని ఇంట్లో ఆ రాత్రి పడుకున్నా కానీ ఒక్క క్షణం కునుకు పడితే ఒట్టు. అమ్మకి నిద్ర పట్టిందో లేదో, మందులు వేశారో లేదో, ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడని ఆక్రోశంతో ఉందో, పోనీలే ఎన్నాళ్లని కష్టపడతాడు అని జాలి పడుతోందో, ఆవిడ మనోభావాలు ఎలాఉన్నాయో అనే కలవరం తోనే తెల్లారింది.

నా ఆలోచనలనుంచి తప్పించాలని అనుకున్నాడో, నా బాధ చూడలేకపోయాడో తాను వెళ్తున్న పనికి నన్ను తోడు తీసుకెళ్ళాడు నా మిత్రుడు. అమ్మని చూసి వెళ్దాం అనుకున్నా కానీ, పని అయ్యి రాగానే వెళ్దాంలే అని స్నేహితునితో వెళ్ళాను. దారిలో ఉండగానే ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఇక నాకు లేదనే వార్త నేను జీర్ణిచుకోవడం తప్ప నాదగ్గర వేరే దారి లేదు.
ఎవరో చెప్తున్నారు నేను చేస్తున్నా. మంత్రాలు చెవిని చేరుతున్నాయి కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతోంది. " అమ్మ లేకుండా నేను ఉండాలి అనే దుఃఖం, అమ్మ అనే ధైర్యం కోల్పోయాను అనే భయం, చివరి సమయంలో దగ్గర ఉండలేకపోయానే అనే బాధ, ఇదే మరణం అమ్మకి రెండురోజుల ముందు ఇవ్వొచ్చు కదా అని దేవుని మీద కోపం"

రోజులు, నెలలు సంవత్సరాలు గడిచినా ఈ సంఘటనలు మరుపుకి రావు. పిన్ని లోనూ, మేనత్త లోనూ అమ్మని చూసినా అమ్మ అమ్మే కదా!

చివరి రోజుల్లో అమ్మని చూసుకున్న ఆ వృద్ధాశ్రమానికి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఇప్పటికీ నాకు చేతనైన సాయం పెద్దవారికి చేస్తూనే ఉంటాను కానీ నాలోని ఆ లోటు నాతో జీవితాంతం ఉండవలసినదే.


ప్రస్తుత సమాజం ఆలోచన ఎలా ఉంది అంటే వృద్ధాశ్రమంలో ఉన్నవారి అందరి  కొడుకులు- కోడళ్ళు దుర్మార్గులు. ఫేస్ బుక్ లలో వాటిల్లో కూడా ప్రతీ కొడుకు తల్లి తండ్రులని మర్చిపోయి బ్రతుకుతున్నట్టే ఎన్నో పోస్ట్ లు ప్రచారంలో ఉన్నాయి. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు కొందరు పెద్దవారు కూడా పిల్లలతో అడ్జస్ట్ అవ్వలేక ఆశ్రమాలని ఆశ్రయిస్తున్నారు. ప్రతీవారికి వారి స్వతంత్రం ముఖ్యం కానీ అది వేరే వారి స్వతంత్రాన్ని చంపి లాక్కోవలసిన అవసరం లేదు కదా. ఎంతో మంది వేరే దారి లేక ఆశ్రమానికి పంపించి ఉండవచ్చు.  పరిస్థితులను అధికమించలేని సమయంలో మాత్రమే పిల్లలు తల్లి తండ్రులని వృద్ధాశ్రమానికి పంపుతారు. వృద్ధాశ్రమం లోని వారి కొడుకులు అందరూ దుర్మార్గులు, మనసు లేనివారు అనుకోవడం తప్పు. చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కోట్లు సంపాదించాలని, వేరే దేశంలో ఉంటేనే వాళ్ళకి గౌరవం అని భావించే వారు చాలామంది తమని తామే వృద్దాశ్రమాలకి చేరుకునే బాట వేసుకుంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకీ పెరిగే వృద్ధాశ్రమాల సంఖ్య, వాటిలో చేరే, చేర్చబడే వారి సంఖ్య పెరగడం శోచనీయం. 

ఒక స్నేహితుని అనుభవం, నా అభిప్రాయం తప్ప ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదని మనవి.

Friday, 20 November 2015

అమ్మంటే అమ్మే





పెళ్లితో అమాంతం అందంగా మారిపోయింది రమ్య జీవితం. కోరి చేసుకున్న సుధీర్ కుటుంబం చూపించే అభిమానం ముందు తన గతంలోని బాధలన్నీ మర్చిపోయింది. అత్తవారింటిలో పురుడు పోసుకుని, సుధీర్కి కొత్తగా బదిలీ అయిన కలకత్తా కి వచ్చింది కొద్దిరోజుల క్రితం. 
తన చదువు, ర్యాంక్లు, సాధించిన ప్రైజ్లు, పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇవేవీ గుర్తు లేవు రమ్యకి, ఆ నాలుగు నెలల పసి పాప బోసి నవ్వులకి మురిసిపోవడం తప్ప. తనకి ఇంక వేరే ఆశ లేదు మంచి అమ్మ అనిపించుకోవడం తప్ప.

"చూడమ్మా, గదిలో దూరి తలుపు వేసుకుంది నీ కోడలు. అపాయింట్మెంట్ ఇచ్చిన టైమ్ కూడా దాటిపోయేలా ఉంది, ఎలా ఒప్పిస్తావో నీదే భారం" అని తల్లిని ఊదరకొట్టాడు సుధీర్.

"రమ్యా, ఏమీ కాదమ్మా, రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతుంది, బయటకి రామ్మా" అని బ్రతిమాలగా మెల్లగా 
బయటకి వచ్చింది రమ్య. పోనీ నేను అమ్మ వెళ్తాం, నువ్వు ఇంట్లో ఉండు అని సర్దిచెప్పబోయాడు సుధీర్. ఇంజెక్షన్ నొప్పికి ఏడిస్తే కొద్దిగా 
పాలు తాగిస్తే ఏడుపు ఆపుతారు పిల్లలు. దానినే తీసుకువెళ్ళు అని ఒప్పించగా వేక్సిన్ వేయించడానికి తీసుకెళ్లారు పాపని.

వేక్సిన్ వేయించి బయటకి వస్తూ ముక్కులో గొట్టాలు, చేతులకు సూదులతో చిన్నారులని చూసి కలవరపడింది రమ్య. ఒక పసిపాపకి 
సపర్యలు చేస్తున్న ఒక ఆవిడ తన కంటపడింది. ఆమెని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించింది. ఇంటికి వచ్చినా కూడా ఆమె 
మొహమే తన కళ్ళలో మెదులుతోంది.

పరధ్యానంగా ఉన్న రమ్యని "త్వరగా తినేసి పడుకో. ఒక రాత్రి వేళ పాపకి నొప్పి చేసి ఏడిస్తే మళ్ళీ నిద్ర ఉండదు. మిగిలిన పని నేను చూసుకుంటా" అని భోజనం ఏర్పాట్లు చేసింది అత్తగారు.

ప్రయత్నిస్తోందే కానీ నిద్ర రావట్లేదు. హాస్పిటల్లో కనిపించిన వ్యక్తే కళ్ల ముందు మెదులుతోంది. ఎక్కడో బాగా చూసిన ముఖం. ఎక్కడ 
చూసిందో మాత్రం గుర్తురావటం లేదు. మనిషిని పోలిన వాళ్ళు ఉంటారు అని ఎక్కువ ఆలోచించకుండా పడుకోమని సర్దిచెప్పాడు సుధీర్.

"అమ్మా?" అవును అమ్మే. తనకు ఊహ వచ్చాకా ఒకే ఒక్క సారి చూసింది అమ్మని. 
అదీ 16,17 సంవత్సరాల క్రితం. లీలగా గుర్తొస్తోంది తనకి. అమ్మ మాట్లాడకుండా నుంచుని ఉంటే నానమ్మ గట్టిగా ఏదో మాట్లాడి పంపించింది. అప్పుడు తన వయసు 6,7సంవత్సరాలు ఉండచ్చు. అమ్మగురించి నానమ్మ చెప్పడమే కానీ తనకు ఏమీ తెలియదు. అమ్మకి ఏ పనీ చేత కాదనీ, తనని కూడా చూడకుండా చదువు, డిగ్రీలు అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందని, తనని కలవడానికి కూడా ఎప్పుడూ రాలేదని, 
తనని, నాన్నని వదిలేసి వెళ్లిపోయిందనీ ఇంకా ఏదో ఏదో. క్రమక్రమంగా అమ్మ మీద ద్వేషం పెరిగింది రమ్యకి. ఇంట్లో అమ్మ ఫోటో కూడా 
లేదు. కనీసం తనకి అమ్మ పేరు కూడా తెలియదు. తనకి నానమ్మ, తాత వీళ్ళే రికార్డుల్లో అమ్మ-నాన్న. 
నాన్న అప్పుడప్పుడు వచ్చిఏవో కొని ఇవ్వడమే కానీ నాన్న ప్రేమ కూడా తనకి తెలియదు. పిన్ని, తమ్ముడు ఉన్నారు కానీ ఎప్పుడైనా 
పండగలకే వస్తారు. ఈ జీవితంమీద తనకు ఉన్న కసిని చదువుతో కప్పి పెట్టుకుంది రమ్య. ఎన్నో ర్యాంకులు, బహుమతులు సాధించింది. 
వీటన్నిటినీ మరిచిపోయేంత ప్రేమ అత్తవారింట దొరికింది రమ్యకి.

మరుసటి రోజు సాయంత్రం పాపని అత్తగారికి అప్పచెప్పి ముందురోజు వెళ్ళిన హాస్పిటల్ కి మళ్ళీ వెళ్లింది. అక్కడ విచారించగా, ఆమె అక్కడ యునివర్సిటి లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అనీ, రోజూ తను, తన 12 సంవత్సరాల  కూతురు వచ్చి రెండు గంటలు ఈ పేషెంట్ లకిసేవ చేస్తారని, మరి కాసేపటిలో వస్తారని తెలిసింది. ఆమె రాగానే రమ్య "మీరు ... మీరు.... మీ పేరు...." అంటూ 
నానుస్తుంటే ఆవిడ "ఏమ్మా రమ్యా బాగున్నావా?" అని అడగగానే రమ్య కి నోటిలో మాట రాలేదు. ఇద్దరి మధ్యా గడిచిన పది నిమిషాల 
నిశ్శబ్దం. తరువాత రమ్య మెల్లగా లేచి ఇంటికి బయలుదేరింది.

"ఏమీ అడగాలని కానీ ఏదైనా చెప్పాలని కానీ లేదా" అన్న మాటకి రమ్య వెనక్కి తిరిగి ఆవిడ కళ్లలోకి చూసింది. చిన్న నవ్వు నవ్వి తిరిగి 
వెళ్లబోయింది. 

"పోనీ నీలో ఉన్న కోపాన్ని తీర్చుకోవచ్చు కదా?" 
"నాకు నీమీద కోపం కాదు ద్వేషం ఉంది. నువ్వు పదిసంవత్సరాల క్రితం ఏదో ప్రమాదం లో చచ్చిపోయావని మా నానమ్మ చెప్పింది. ఆవిడ అలా ఎందుకు చెప్పిందో తెలియదు కానీ నువ్వు ఈరోజు నాకు కనబడకుండా ఉంటే బాగుణ్ణు అని మాత్రం అనిపించింది. నువ్వు నువ్వు 
కాకుండా ఉంటే బాగుణ్ణు అనుకుంటూనే ఇక్కడకి వచ్చాను. నాకు ఆ అదృష్టం కూడా లేదు అని తెలిసింది."

"నువ్వు నన్ను ఎన్నడూ చూడలేదు, నాతో గడపలేదు. ఎవరో చెప్పిన మాటలని బట్టి నా మీద ఒక అభిప్రాయం నువ్వు ఏర్పాటు 
చేసుకున్నావ్. నా వైపు వాదన కూడా వింటే నీ ద్వేషానికి ఒక అర్థం వస్తుందేమో. నాకు ఆ అవకాశం ఇస్తావా" అని ప్రాధేయపడింది ఆమె.

వింటాను చెప్పు అన్నట్టు కుర్చీ లో తిరిగి కూర్చుంది రమ్య.

 "మా అమ్మ నాన్న లకి నేను ఒక్కత్తినే కూతుర్ని. చిన్నప్పటినుండి బాగా చదువుకున్నాను. గారంగా పెరగడం వల్ల నాకు ఇంట్లో పనులు 
అవీ సరిగా వచ్చేవి కావు. నన్ను చదువుకోవడానికే మా తండ్రి ఎక్కువ ప్రోత్సహించేవారు. నా M.Sc. అవుతుండగా మీనాన్నగారితో నాకు పెండ్లి అయింది. నువ్వు పుట్టినపుడు నేను Ph.D. చేస్తూ ఉండేదాన్ని. మీ నానమ్మకి నేను మీ నాన్నని మించి చదువుకోవడం ఇష్టం లేదు. నన్ను అక్కడితో ఆపేయమని చాలా సార్లు బలవంతపెట్టారు. మీ బామ్మ కి ఎదురు చెప్పలేక, నాకునచ్చ చెప్పలేక మీ నాన్నగారు మధ్యలో నలిగిపోయేవారు. నీకు రెండు సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు. ఒక్క నెల రోజులు నేను మా ప్రొఫెసర్ గారితో పని చేస్తే నా 
డాక్టరేటు పూర్తి అవుతుందని, ఈ సమయం లో వెనక్కి తీసుకోవద్దని, మీనానమ్మని ఆయన ఒప్పిస్తా అని మా నాన్న గారు నన్ను తీసుకు వెళ్లారు. ఏది ఏమైనా నిన్ను నాతో పంపడానికి మీ నానమ్మ ఒప్పుకోలేదు. నెల రోజుల్లో ఎటూ వస్తాను కదా అని నిన్ను వదిలి మా 
నాన్నగారితో వెళ్ళాను. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా నిన్నుకలవనివ్వలేదు. మానసికంగా క్రుంగిపోయిన నేను డిప్రెషన్ లోకి వెళ్ళడం 
వల్ల, నాకు మానసిక సంతులత లోపించిందని మీ నాన్నతో నన్ను వేరు చేశారు మీ నానమ్మ, తాతగారు. నేను కోలుకుని తిరిగి నిన్ను 
అడగడానికి మీ నానమ్మ ఇంటిని వెతుక్కుంటూవచ్చాను. అప్పటికే మీ నాన్నగారికి ఇంకో వివాహం జరగడం, ఎట్టి పరిస్థితి లోనూ నిన్ను 
ఇవ్వడం కుదరదని పంపడం నాకు తీరని అన్యాయాలు. 

నా స్నేహితురాలి ద్వారా నీ గురించి అప్పుడప్పుడు సమాచారం తెలుసుకుని తృప్తి పడేదాన్ని. నువ్వు సాధించిన ర్యాంకులు, ప్రశంసలు   చూసి మురిసిపోయేదాన్ని. ఒంటరిని అయిన నేను ఇక్కడ యునివర్సిటిలో ఉద్యోగం రావడం తో ఇక్కడకి వచ్చి స్థిరపడ్డాను. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి దీనిని పెంచుకుంటున్నాను. దీని పేరు రమ్య. నా మాటలు నమ్మి నీ మనసు కుదుట పడితే నాకంటే 
సంతోషించేవాళ్లు ఉండరు........"

ఆమె మాటలు పూర్తి కాకుండానే అక్కడనుండి వెళ్లిపోయింది రమ్య.



ఆవేదనతో వళ్ళో పడుకున్న రమ్య తల నిమురుతూ "రమ్యా! అమ్మ అమ్మేరా. ఎక్కువ ఆలోచించకు.  అన్నం తిందువుగాని పద" అని ఆప్యాయంగా ఊరడించిది అత్తగారు.

"మరి మా నానమ్మ కూడా అమ్మే కదా? మరి నాలో ఇంత ద్వేషం ఎలా నింపింది."

"నానమ్మ తన కొడుకు ఎక్కువ స్థాయి లో ఉండాలి అని కోరుకుంది. అందుకే కొద్దిగా పంతం వల్ల అలా ప్రవర్తించింది. తరవాత నీకు తల్లయింది. నిన్ను దూరం చేసుకోలేకపోయింది. ఎంతైనా అమ్మ కదా?"

ఈ ప్రపంచంలో తనకంటే అదృష్టం ఎవరికీ లేదనిపించింది ఆసమయంలో రమ్యకి. ముగ్గురు అమ్మలు నాకు అని సంతోష పడుతూ అత్త'అమ్మ' ని గాఢంగా కౌగలించుకుంది.