Saturday 4 April 2015

బాల్యమా నువ్వెక్కడ?





ముందురోజు అంతా ప్రయాణం వల్ల నాకు ఉదయం కొద్దిగా ఆలస్యంగా  ఏడు గంటలకు మెలకువ వచ్చింది. ఏదో కోలాహలం విన్నాకా గుర్తొచ్చింది నేను మా పిన్ని కూతురు సరళ ఇంటికి వచ్చాను అని. గదిలోంచి బయటకి రాగానే కంటిముందు సర్కస్ చూస్తున్న అనుభవం కలిగింది. సరళ ఏడు సంవత్సరాల కొడుకుతో ఇంట్లో అందరూ విన్యాసాలు చేస్తున్నారు. బామ్మ మొహానికి చేతులకి ఏదో లోషన్ రాస్తుంటే, నాన్న బూట్లు తొడుగుతున్నాడు. అమ్మ నోట్లో అదేదో పదార్ధం కుక్కుతోంది. పని అమ్మాయి బ్యాగ్, అంతకంటే పెద్ద ఫుడ్ బాస్కెట్ తో సిద్ధంగా ఉంది. పిల్లవాడు బస్ ఎక్కడంతో ఇల్లు సద్దు మణిగింది.
"అక్క లేచావా? చిన్నూ గాడు స్కూల్ కి వెళ్ళేవారకూ హడావుడి అనుకో రోజూ".
 అందరం కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సరళ "ఈ మధ్య చిన్నూ ఉత్సాహం గా ఉండట్లేదు, చాలా డల్ గా ఉంటున్నాడు. నువ్వు చిన్నపిల్లల స్కూల్ లో చేస్తున్నావ్ కదా కొద్దిగా వాడిని గమనించి ఏమి చేయాలో చెప్పవూ" అని తన చింత వెళ్ళబుచ్చింది. "దానేదేముందే తప్పకుండా చెప్తాను నాలుగు రోజులు ఉంటాను కదా" అని ధైర్యం చెప్పాను.

రాత్రి ఎనిమిది దాటుతున్నా పిల్లవాడు ఇంటికి రాలేదు. ఇంక ఉండలేక సరళని అడిగాను "బాబు ఇంకా రాలేదేంటి?" అని. వచ్చేస్తాడు ఇంకో అరగంటలో అని కంగారుగా వాడు రాగానే ఏమి తినిపించాలో తయారు చేసేపనిలో పడింది.

వాడు ఇంటికి రాగానే వాడికి స్నానం చేయించి బట్టలు తొడిగి టి.వి. ముందర కూర్చోబెట్టింది. వాడు చానల్ మారుస్తూ ఏవేవో చూస్తుండగా వాడికి భోజనం తినిపించి పడుకోబెట్టింది. ఆ పిల్లవాడి నోటి నుంచి ఉదయం బై, ఇప్పుడు గుడ్ నైట్ తప్ప ఏమీ వినలేదు నేను.

అందరూ కలసి భోజనాలు ముగించాం. ఇంక ఉండబట్టలేక "ఉదయం ఏడు గంటలకు వెళ్ళిన పిల్లవాడు రాత్రి ఎనిమిది దాటాక ఇంటికి వచ్చాడు ఏంటి? ఇన్ని గంటలు కూర్చోబెట్టే అదేమి స్కూల్" అని అడిగాను ఒకింత ఆశ్చర్యంగా. చాలా సరళంగా చెప్పడం మొదలు పెట్టింది సరళ "స్కూల్ మూడు గంటలకే అయిపోతుంది. అక్కడ నుండి చెస్ నేర్చుకోవడానికి, అటునుంచి కోచింగ్ క్లాస్ కి, అది అయ్యకా డ్రాయింగ్ క్లాస్ కి వెళ్ళి వస్తాడు".

"మరి మధ్యలో విశ్రాంతి ఉండదా?"
"ఎందుకు ఉండదూ బస్ లో స్నాక్స్ బాక్స్ తినేసి నిద్రపోతాడు. స్కూల్ నుంచి క్లాస్ కి వెళ్లడానికి గంట పైగా పడుతుంది" అంది చాలా సరళంగా.
నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు. ."శనివారం స్కూల్ ఉండదేమో కదా" అన్నాను ఉండకపోతే బాగుణ్ణు అని కోరుకుంటూ.
"లేదు శనివారం, ఆదివారం స్కూల్ కి సెలవలు ఉంటాయి. అయితే ఆ రెండు రోజులు ఇంట్లో చేయడానికి ప్రాజక్ట్ అవీ ఇస్తారు".

"పోనీలే ఆ రెండు రోజులూ ఇంటిపట్టున ఉంటాడు" అన్నాను కాస్త ఊరట కలిగి.
వెంటనే అందుకుంది సరళ ."ఎక్కడ అక్కా, ఆ రెండు రోజులే కదా ఏవైనా నేర్చుకోవడానికి దొరికేది. ఆ రెండు రోజుల్లో అబాకస్, యోగా, సంస్కృతం, సాయంత్రం డాన్స్, టెన్నిస్ క్లాసులు ఉంటాయి".
ఒక్కసారి గుండె జారి పొట్టలోకి వచ్చినట్టు అయింది నాకు.

ఇంతలో సరళ వాళ్ళ ఆయనతో చెప్పడం మొదలు పెట్టింది. "చిన్నప్పుడు మా అక్క వల్ల మేమందరం చాలా తిట్లు తినేవాళ్లం. అక్క పదకొండు సంవత్సరాలకి పదవ క్లాస్ పాస్ అయింది అదీ డి.ఇ.ఓ. ప్రత్యేక అనుమతితో ఇంకా జిల్లా లొకే ఎక్కువ మార్కులతో". అవునా గ్రేట్ అని అనడం పూర్తికాకుండానే కంటిన్యూ చేసింది "పదిహేడు సంవత్సరాలకి B Tech ఇంకా పంతొమ్మిదికి M Tech చేసి ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది అన్ని పత్రికలనీ. చిన్నతనం లోనే విదేశాల్లో ఉద్యోగాలు ఒక వెలుగు వెలిగింది అనుకోండి". "
అవునా మా అబ్బాయి కి ఏవైనా మెళకువలు చెప్పండి ఎలా చదువుకోవాలో, ఎలా ప్రణాళిక వేసుకోవాలో అని ఆమె భర్త వినయంతో కూడిన రిక్వస్ట్ చేస్తూనే ఇంతలో ఒకింత ఆశ్చర్యంతో అదేంటి మీరు ఏదో చిన్నపిల్లల స్కూల్ టీచర్ అని చెప్పింది నిన్న సరళ.
నేను ఒక చిన్న నవ్వు నవ్వి అవును ఇప్పుడు నేను టీచర్ నే.
మెల్లగా చెప్పడం ప్రారంభించాను "మీరు ఏమీ అనుకొక పోతే ఒక విషయం చెబుతాను. వాడికి గట్టిగా ఏడు సంవత్సరాలు లేవు. తలకి మించిన భారం మోపుతున్నారు. చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో వాడికి ఇన్ని రకాల క్లాసులు అవసరమా? ఒక వయసు వచ్చాక వాడి ఇష్టాన్ని బట్టి వాడికి ఆటలు, కళలు నేర్పించడం లో తప్పు లేదు. కానీ ఇంత చిన్న వయసులో వాడి శరీరం, బుర్ర రెండూ అలసిపోతున్నాయి. ఇంకా ఉత్సాహంగా ఉండట్లేదు అని అనుకోవడం లో అర్థం లేదు కదా?"
'అదేంటండి? ఈ పోటీ ప్రపంచం లో తట్టుకోవాలంటే ఆ మాత్రం శిక్షణ అవసరం' అని నాకే పాఠం చెప్పబోయాడు సరళ భర్త.

"ఈరోజుల్లో పెద్దవాళ్లకి టెన్షన్ లేకుండా తయారు చేయడానికి చాలా శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. పెద్దవాళ్లని పిల్లల్లా మార్చి ఆహ్లాదంగా జీవించేలా చాలా రకాల టెక్నిక్ లు అవీ నేర్పి, ఉల్లాసం ఉత్సాహం పెంచుతున్నారు. మీరేమో చిన్న పిల్లవాడిని వయసుకు మించిన పెద్దవాడిగా తయారు చేస్తున్నారు. ఒక పాతిక సంవత్సరాల క్రితం నేను బాల మేధావిని అని చాలా బహుమతులు సన్మానాలు అందుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆ బాల మేధావిగా గుర్తించరు కదా. ఎంతో దీక్షతో చదివాను, చాలా బహుమతులు గెలిచాను కానీ అదే సమయం లో నేను నా బాల్యాన్నే కోల్పోయాను. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ వాళ్ళల్లో నా బాల్యాన్ని వెతుక్కుంటున్నాను. నాలో ఈ మార్పు ఒక బాలుడే తీసుకు వచ్చాడు.

ఆఫీసు పని మీద అమెరికా వెళ్తున్నాను ఒకరోజు. ఫ్లైట్ లో పక్కన ఒక కుర్రాడు 'హలో అక్కా నా పేరు సంతోష్ నీ పేరు?' అని పలకరించాడు. ఎంతో ఆనందంతో మెరిసిపోతోంది అతని ముఖం. చేతిలో ఒక లావు పుస్తకం ఉంది. ఏమిటి ఆ పుస్తకం అని అడిగాను అతన్ని. 'ఇదా షేక్స్ పియర్ డ్రామా. పదవ తరగతిలో ఈ నాటకం మీద ఒక పాఠం ఉంది. అది నాకు బాగా నచ్చి మొత్తం చదువుదామని కొనుక్కున్నా, సెలవలు కదా అన్నాడు నవ్వుతూ'. "అర్థం అవుతుందా మరి నీకు?" అన్నాను నేను ఆశ్చర్యంగా.
'ఎంత అర్థం అయితే అంత అవుతుంది'.
"ఏంటి ఫ్యూచర్ ప్లాన్?" అని అడిగా తెలుసుకుందాం అతని ప్రణాళికలు ఎలా ఉన్నాయో అని.
'చూడాలి వచ్చిన మార్కులని బట్టి. మాత్స్ తీసుకుందాం అనుకుంటున్నా అయినా ఇంకా చాలా సమయం ఉందిగా దానిగురించి ఆలోచించడానికి' అన్నాడు ఎంతో తేలికగా.
"మరి ఈ పుస్తకం బదులు ఉపయోగ పడే క్లాసు పుస్తకం చదవచ్చుగా
? నేను అలాగే చేసేదాన్ని క్లాసులు మొదలవకుండా  ముందే చదివేసి అన్నాను" కొంచం గర్వంగా.
'తరవాత ఎలాగా చదవాలి కదా అక్కా
, ఈ ఖాళీ సమయం లో ఇవి చదువుకోవచ్చు అని. ఇంకా బోలెడు పుస్తకాలు ఉన్నాయి బ్యాగ్ నిండా. ఇంతకీ నువ్వేమి చదువుతున్నావ్ అక్కా?' అని అడిగాడు నన్ను. 

"నా చదువు అయిపోయింది నేను ఉద్యోగం చేస్తున్నా అని కొంత గర్వంతో నేను చేస్తున్న ఉద్యోగ వివరాలు చెప్పాను.
'చిన్న దానిలా కనిపిస్తున్నావ్ ఇంకా స్టూడెంట్ లా ఉన్నావ్'
" అవును స్టూడెంట్ గా ఉండాల్సిన దాన్నే. పదకొండు సంవత్సరాల వయసులో పదవతరగతి
90శాతం తో పాస్ అయ్యా" అన్నాను నా తెలివి ప్రదర్శించాలని.
'ఓహో నిచ్చెన ఎక్కేశావా భలే ఉందే' అన్నాడు నవ్వుతూ.
"నెచ్చెన
? అదేంటి?"

'వైకుంఠపాళి నిచ్చెన. ఆడదామా నాదగ్గర ఉంది' అని బ్యాగ్ లోంచి తీసేసి నా సమాధానం వినకుండానే నీది ఎరుపు నాది పసుపు నువ్వే ముందు ఆడు అని నా చేతికి గవ్వలు కూడా ఇచ్చేశాడు. తనతో గడిపిన కొన్ని గంటలలో నేను నా బాల్యంలో ఏమి కోల్పోయానో తెలుసుకున్నా. ఇంక మా గమ్యం చేరే సమయానికి ఇద్దరం చాలా స్నేహితులమయ్యాం. వెళ్లిపోతూ 'అక్కా చదువు అయిపోవడం అనేది ఉండదు నా గుర్తుగా నువ్వు ఈ పుస్తకం ఉంచుకో నేను మళ్ళీ కొనుక్కుంటా' అని "కింగ్ లియర్" నాటకం నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. తరువాత నేను నాకు తెలియకుండానే మారిపోయాను. నేను చేసే ఉద్యోగం లో నాకు సంతృప్తి దొరకలేదు. లిటరేచర్ లో MA తరువాత చిన్నపిల్లల స్కూల్ లో పని చేయడానికి ఉపయోగ పడే డిప్లొమాలు, సైకాలజీ లో డాక్టరేటు చేసి ఇప్పుడు ఒక స్కూల్ నడుపుతున్నా.

పిల్లలని పిల్లల్లా ఉండనిద్దామ్. ఈ రోజుల్లో పిల్లలకి చాలా ఆటలు తెలియనే తెలియవు కంప్యూటర్ ఆటలు మొబైల్ ఆటలు తప్ప. వాళ్ళకి ప్రకృతి ని, మన సంస్కృతి ని చూపిస్తూ వాళ్ళతో సమయం గడపండి. రోజు మొత్తం వాడు బయటే ఉంటే ఇంక అమ్మ ప్రేమ, స్పర్శ అవి చూసే అవకాశమే వాడికి కలగట్లేదు. వాళ్ళు కొంచం పెద్ద అయ్యాకా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఆటలు, కళలు నేర్పించచ్చు. ఏ ఒక్కరూ అన్ని కళల్లోనూ నిష్ణాతులు అవ్వలేరు. ఒక్క మనిషి అన్నీ నేర్చుకోలేడు. పోటీ ప్రపంచం మనమే సృష్టిస్తున్నాం. వాళ్ళు మొగ్గల్లాంటి వాళ్ళు. మొగ్గ వికసించడానికి అవసరమైన సమయం దానికి ఇద్దాం. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవ్వడానికి అవసరమైన సమయం ఇవ్వాలి లేదా అని సీతాకోకచిలుకగా మారకుండానే అంతరించిపోతుంది.
సరళ, తన, భర్త అత్తమామలు అందరూ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, ఆనందించిన సందర్భాలు అన్నీ గుర్తు తెచ్చుకుని   ఈ కాలం పిల్లలు ఏవి కోల్పోతున్నారో అవి కనీసం కొన్నైనా మన పిల్లవాడికి ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.