Saturday 24 September 2016

కామెడీ నాకిష్టం


నాకు రెండు జతల కళ్ళు, రెండు టి‌వి లు ఉంటే ఎంతబాగుణ్ణో అనిపించింది ఒకరోజు. ఎందుకలా???
మీరే చదవండి.
చేతులు ఖాళీ లేనప్పుడే ఈ ఫోన్ మోగుతుంది అనుకుంటుండగా " మీ అమ్మగారి ఫోన్" అని మా వారు అనడం నేను ఫోన్ ఎత్తడం. "ఈ టి‌వి లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా వస్తోంది" అమ్మ వాక్యం పూర్తి అవ్వకుండానే ఫోన్ పెట్టేయడం
, చేతిలో గరిటో, చీపురో గుర్తు లేదుకానీ దాన్ని వదిలేయడం జరిగిపోయాయి. అప్పుడే మొదలైంది హమ్మయ్య అనుకోవడం, సినిమాలో మునిగిపోవడం, కొన్ని క్షణాల్లో ఎన్ని జరిగిపోయాయో కదా.... నాకళ్ళకీ టి‌వి కి మధ్య నాలుగుసార్లు వచ్చారు మావారు ఆఫీస్ కి రెడీ అయ్యా అని చెప్పడానికి. ఇహ లాభం లేదనుకున్నారో ఏమో 'టైమ్ ఎంత అయిందో తెలుసా' అన్నారు. దానికి నన్ను డిస్టర్బ్ చేయాలా గడియారం చూసుకోవచ్చుగా అన్నా. భారతదేశం లో ఉన్న అసహనం అంతా ముఖాన్న పూసుకుని. ఈ సినిమా డైలాగులే కానీ మామూలు మాటలు మర్చిపోయింది , ఏదైనా తినడానికి పెడితే ఆఫీస్ కి వెళ్తా అన్నారు. సరే అన్నా కానీ లేవలేదు. సినిమా చూస్తున్నా అని జాలి, దయ, ప్రేమ ఉండాలా లేదా? రోజూ వెళ్ళే ఆఫీసే కదా. నా పరిస్థితి గ్రహించద్దూ రోజూ ఇలాంటి సినిమాలోస్తాయా, నేను చూస్తానా?’ నాలో నేనే. పాపం మా వారు లాతూర్ వాళ్ళు వర్షం కోసం ఎదురుచూసినట్టు సినిమాలో బ్రేక్ కోసం వెయిటింగ్. ఆయన పంట పండి ఆ బ్రేక్ రానేవచ్చింది. ఈరోజు మావారు లేచిన వేళ అంత బాగోలేదు పాపం. నేనిలా వంటింట్లోకి వెళ్ళా అని ఆయన ఛానల్ మార్చారా అక్కడేమో నువ్వు నాకు నచ్చావ్. ఇంక అయిపోయింది నా పని అని నాలుక కరుచుకుని గబుక్కున మార్చేలోపే చటుక్కున త్రివిక్రమ్ మాటలు చెవికి తాకేసాయ్. ఆపండాపండి అంటూ వచ్చేశా. ఇంక ఇలా కాదు అని ఉప్మాలా ఉండే ఉప్మా చేసేసి ఆయన్ని పంపేసి టి‌వి దగ్గర సెటిల్ అయిపోయా.
ఇక్కడ శ్రీలక్ష్మి చెప్పే సినిమా కథ టైటిల్స్ తో సహా విందామంటే అక్కడ వెంకటేష్ బయోగ్రఫీ మిస్ అయిపోతా, అక్కడ బంతి చేసే కామెడీ తాగాలంటే, ఇక్కడ సంగీత వంటలు తినలేకపోతున్నా. ఇటు సుత్తివీరభద్ర రావు గోడకి తన బాధ మొరపెట్టుకుంటుంటే, అటు హరికథ అంత ఇంటరెస్టింగ్ లేక సినిమాకి వెళ్లిపోవడం.  పొట్టిప్రసాద్ ఒక ఆట వేసుకుందాం అని ఇటు పిలుస్తుంటే, అక్కడ అమ్మ మీద కవిత రా రమ్మంటోంది. పూర్ణిమ కల ఇటువైపు, వెంకీ చేసే పెళ్లి ఏర్పాట్లు అటువైపు. ఉత్తరం అందుకున్న సుత్తివేలు హావభావాలు ఆస్వాదించేలోపే హేమ కాళ్ళు కడగడం, ఎం‌ఎస్ పేకాట పర్వం మిస్ అయిపోయా. ఇక్కడ మంచి రసపట్టులో కథ, పూర్ణిమ అప్సెట్ అవడం, ఉత్తరం ముడి విడిపోవడం, అక్కడ బ్రహ్మీ పార్క్ లో చేసే విన్యాసం.  అబ్బో ఏమి చెప్పమంటారు నా బాధ.
ఒకపక్క జంధ్యాల విసిరే నవ్వుల వల, ఇంకో పక్క త్రివిక్రమ్ చేసే మాటల గడబిడ.
ఒకవైపు జంధ్యాల నిఘంటువుకే మాటలు నేర్పుతుంటే, ఇంకోవైపు త్రివిక్రమ్ మాటల పంచ్ లు వదలడం.
ఇక్కడ పెళ్లి కాన్సిలా, చీర ఇప్పెయనా అనే కామెడీ క్లైమాక్స్, అక్కడ పెళ్లి ఆగిపోయే సీరియస్ క్లైమాక్స్. బాబోయ్ ఏమి చేయను దేవుడా అని బుర్ర గోక్కొవడం.
చక్కటి చతురత, సుత్తి ద్వయం హాస్యం, మాటలతో మనుషుల్ని కట్టి పడేయొచ్చు అని జంధ్యాల గారికి ఎవరు నేర్పారో కదా. ఎన్నేళ్లయినా ఆ పరిమళం తగ్గనే లేదు. ఎన్ని సార్లు ఆస్వాదించినా మళ్ళీ కొత్తగా అనిపించే ఆ తీయదనం.
తెలుగు సినిమాని మాటలతో హిట్ కొట్టించచ్చు అని నిరూపించిన త్రివిక్రమ్. ఒక బలమైన విలన్, ఒక బక్క మొనగాడు అతి బలంగా దెబ్బకొట్టడం(మనం నమ్మాలి అది వేరే సంగతి) ఇవే అలవాటైపోయిన మనకి కేవలం మాటలతో సినిమా హిట్ కొట్టించవచ్చు అని, సినిమాల్లో మాటల మీద శ్రద్ధ పెట్టాలని అందరి దృష్టిని మార్చేలా రాశాడు సినిమాలకి మాటలు.
నాకు నచ్చిన ఇద్దరి సినిమాలలో అంశాలు చెప్పా కానీ ఒకళ్లకంటే ఇంకోళ్ళు గొప్ప అనలేదు, ఒకళ్లతో ఇంకొకళ్లని పోల్చనూ లేదు కనుక కామెంటుల మీటింగులు పెట్టద్దని మనవి.
రెండు సినిమాలు పూర్తిగా చూడలేక, తృప్తి పడలేక తరవాత యూ ట్యూబ్ ని ఆశ్రయించా అనుకోండి అది వేరే విషయం. మీకు కూడా మళ్ళీ చూడాలనిపిస్తే యూ ట్యూబ్ లో చూడొచ్చోచ్.........