Sunday 14 May 2017

కంటేనే అమ్మ అని అంటే ఎలా??

 చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తే బుర్ర అటువైపు తిప్పాను. పక్కన గదిలో ముగ్గురు చంటి పిల్లలు నేల మీద బట్టలు లేకుండా పడుకుని ఉన్నారు. అంత చలికాలం కాకపోయినా వేసవి కాలం మాత్రం కాదు. అందులో ఒక బాబు ఏడుస్తున్నాడు. చిన్నగా మొదలయిన ఆ రాగం మెల్లగా సౌండ్ పెరుగుతోంది.
"మీతో పాటు మా ఆయా వస్తుంది, సాయంత్రం 4 గంటల లోపల మళ్ళీ ఇక్కడ వాళ్ళిద్దరినీ దింపాలి ........" ఇంకా ఏవో చెప్తోంది ఆవిడ. ఏడుపు వస్తున్నవైపే నా దృష్టి ఉంది. అంతలా ఏడుస్తున్నా ఎవరూ చూడట్లేదు ఎందుకు అని నేను మెల్లగా లేచి ఆ గదివైపు వెళ్లబోయాను. "మేడమ్, ఆగండి. పర్మిషన్ లేకుండా అటు వెళ్లకూడదు” కొంచం గట్టిగానే అంది ఆవిడ. "ఆ పాప ఏడుస్తుంటే........." కొంచం బాధ, కొంచం భయం తో నసిగాను నేను.
ఏవో పేపర్స్ ఇస్తూ ఏదేదో చెప్తోంది నాతో వచ్చిన జంటకి ఆవిడ. ఆవిడ ఆ అనాథ ఆశ్రమానికి హెడ్ ట.
కొంచం పాత గది అయినా విశాలంగా ఉంది. రెండు చెక్క బీరువాలు, ఒక టేబుల్, నాలుగు నీల్ కమల్ కుర్చీలు, హెడ్ కూర్చోడానికి దిండ్లు వేసిన ఒక చెక్క కుర్చీ, రెండు ఫ్యాన్లు ఇవీ ఆ గదిలో ఉన్న సామాన్లు. గోడలకి గాంధీ, నెహ్రూ, మదర్ థెరీసా, బిడ్డని ఎత్తుకున్న అమ్మ ఫోటోలు ఆ హెడ్ వెనక గోడకి మేకులతో కొట్టి ఉన్నాయి.
********
"మా AGM బంధువులు ఒక బాబుని దత్తత తీసుకుంటున్నారుట. దగ్గర ఊళ్లలో అయితే ఫ్యూచర్ లో ఇబ్బంది రావచ్చు అని ఉద్గీర్ నుంచి తీసుకుంటున్నారు. ఏవో మెడికల్ టెస్ట్ లు అవీ చేయించాలిట. వాళ్ళకి ఈఊరు కొత్త పైగా వారికి భాష ఇబ్బంది కూడా ఉన్నాయి. కనుక దగ్గర ఉండి వాళ్ళతో అన్నీ చేయించాలి రేపు. నీ మొబైల్ నంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాను. కాసేపట్లో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ప్రోగ్రాం చెప్తారు" ముందురోజు సాయంత్రం మా వారు ఫోన్ చేసి చెప్పారు. ఎవరికైనా సహాయం చేయాలంటే పెద్ద ఇబ్బంది పడని నాకు పై ఆఫీసర్ బంధువులు కనుక ఎటువంటి అభ్యంతరము లేదు. ఫోన్ ద్వారా, ఇంకా ఉదయం వాళ్ళు దిగి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు, ఆశ్రమానికి వెళ్తున్న దారిలో చెప్పిన దాన్ని బట్టీ నాకు అర్థం అయింది ఏమిటంటే, దత్తత తీసుకోవడానికి ఉండవలసిన భార్య-భర్త ల వయసుల మొత్తం కంటే వీరికి కొంచం ఎక్కువ ఉండడం వల్ల చంటి బిడ్డని తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదని చాలా ఆశ్రమాలలో వీళ్ళకి బిడ్డ దొరకలేదు. ఈ ఆశ్రమంలో కొందరు అధికమొత్తం తీసుకుని వీళ్ళకి ఒక బాబుని ఇవ్వడానికి ఒప్పుకున్నారు, పైగా ఆ బాబు తల్లి వీళ్ళ కులానికి చెందినది అని ఆ బాబు పుట్టిన సమయం ప్రకారం జాతకం బాగుందని కారణాల వల్ల వీళ్ళు దత్తత తీసుకోవడానికి ఒప్పందం కుదిరిందని దానికి కొన్ని మెడికల్ టెస్ట్ లు విధిగా చేయించాలని.
******
సన్నగా, తెల్లగా, గుండ్రటి మొహం, నల్లగా చక్రాల్లాంటి కళ్ళు, పల్చటి ఒక జూబ్బా, ఒక ప్లాస్టిక్ లంగోటి లో పాతగుడ్డ మడత వేసి పెట్టి తయారు చేసిన డైపర్ తో ఉన్న ఆరు నెలల బాబుని తీసుకుని ఒక ఆయా బయటకి వచ్చింది. అందరం మేము అద్దెకి తెచ్చుకున్న కార్ లో బయలుదేరాం. "నాకు తెలిసిన ఒక పిల్లల డాక్టర్ గారి దగ్గరకు ముందు వెళ్దాం. అప్పుడు ఏ టెస్ట్ లు ఎక్కడ చేయించాలో ఆయన మనకి గైడ్ చేస్తారు" అని నా నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పాను. ఆయా ప్రక్కన బాబుకి కాబోయే అమ్మ, ఆవిడ పక్కన కాబోయే నాన్న కూర్చున్నారు. నేను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చుని దారి చూపిస్తున్నా. ఉద్గీర్ నుంచి లాతూర్ కి 65 కిలోమీటర్లు, గంటన్నర ప్రయాణం. చిన్న పిల్లల్ని చూసి ఇంత సమయం ఎత్తుకోకుండా ఉండడం ఇదే మొదటిసారి నాకు. కాబోయే అమ్మ వాడిని వళ్ళోకి తీసుకుంటుందేమో అని చూసి చూసి ఇంక ఆగలేక నేను ఎత్తుకోనా కొంచం సేపు అని అడిగి వళ్ళోకి తీసుకున్నా. పలకరిస్తే కిలకిలా నవ్వాడు, నవ్వగానే వంట్లో ఉన్న ఎముకలన్నీ కనిపించాయి ఆ జూబ్బాలోంచి. ఆ వయసులో నా కొడుకుని ఎత్తుకోలేక పోయేదాన్ని అంత బొద్దుగా ఉండేవాడు. "బాబుకి పాలు కానీ ఏదైనా పట్టాలా?" అని అడిగా. "ఇందాకే పాలు తాగించాను, ఇంకో నాలుగు గంటల వరకు ఏమీ ఇవ్వక్కర్లేదు" ఆయా సమాధానం. టైమ్ టేబుల్ ప్రకారం పాలు, సిరిలాక్, పళ్ల గుజ్జులు నా కొడుకుకి తినిపించడం గుర్తుకు వచ్చింది. "బాబుకి డైపర్ మార్చాలెమో అన్నా" ఆయాతో. "అది కూడా పాలు పట్టినపుడు మారుస్తా" ఈసారి కాస్త కోపంగా ఆయా సమాధానం. వాడి మొహం చూస్తుంటే ఒక రకమైన జాలి, వెంటనే సంతోషం కలిగాయి. అప్రయత్నంగా "నవ్వరా బుడ్డీ, నీకు మంచిరోజులు రాబోతున్నాయి” అన్నా. ఏమనుకుందో ఏమో ఆయా నా చేతిలోంచి బాబుని తీసేసుకుంది. ఆయాకి, డ్రైవర్ కి తెలుగు రాదు కనుక ఆ భార్యాభర్తలిద్దరూ ఆశ్రమానికి ఎంత డబ్బులు ఇస్తున్నారో వాటిలో ఎంత ఎవరి జేబులోకి వెళ్తుందో, ఆశ్రమానికి ఎంత ముడుతుందో, వీళ్ళ ఆస్తి పాస్తులు ఏమున్నాయో, తెలిసిన వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావచ్చు అనుకున్నారో అన్నీ వివరంగా చెప్పారు.
ఈ మాటల్లో మేము డాక్టర్ గారి దగ్గరకి వచ్చేసామ్. ఆయన ఒక పేపర్ మీద ఏ టెస్ట్ కి ఎక్కడకి వెళ్ళాలో వాటి అడ్రస్ లు, అక్కడ చూపించడానికి ఈయన రాసిన లెటర్స్ ఇచ్చారు.
ఆ చిన్ని ప్రాణం ఎంత అల్పంగా ఉందో చెప్పలేను. పాపం మూడు చోట్ల రక్తం తీశారు. "ఒకే చోట అన్ని టెస్ట్ లు అవ్వవా?" అక్కడ నర్స్ ని అడిగాను. "పెద్ద ఊళ్లలో అవుతాయి, రిపోర్ట్ లు సాయంత్రానికి రావాలంటే మాత్రం ఈ ఊర్లో ఒకే చోట అన్ని టెస్ట్ లు అవ్వవు" ఆ అమ్మాయి కి తెలిసినది నాకు చెప్పింది. చెవులు పని చేస్తున్నాయో లేదో తెలుసుకునే టెస్ట్ ట. "పలకరిస్తే నవ్వుతున్నాడు కదా బాగానే వినిపిస్తోంది ఈ టెస్ట్ అవసరమా?” నాలో నేనే అనుకున్నా. లోపలికి తీసుకెళ్లి ఏమి చేశారో తెలీదు కానీ గుక్క పెట్టి బాబు ఏడ్చిన ఏడుపు మాత్రం బాగా వినిపించింది. బాబు బయటకి రాగానే ఆయా ఒక కప్ తీసి దానిలో ఒక స్పూన్ ఫారక్స్ వేసి కప్పు నిండా నీళ్ళు పోసింది. దాన్ని రెండు నిమిషాల్లో వాడికి తాగించి, ప్లాస్టిక్ డైపర్ లో ఇంకో పాత గుడ్డ పెట్టి ఇంకా మిగిలిన టెస్ట్ లకి మళ్ళీ బయలుదేరాం.
ఏవో ఎక్స్ రే లు, స్కాన్ లు. మా నర్స్ భోజనానికి వెళ్లింది, కింద కూర్చుని బాబుని పైకి పట్టుకోమన్నారు అక్కడ డాక్టర్. ఆయా కానీ, కాబోయే అమ్మ కానీ కదల్లేదు.  టెస్ట్ కోసం ఉన్న ఆ జుబ్బా కూడా తీసేశారు. నాకు కొంచం నోటి దూల ఉంది. "కళ్ళతో కనిపించేస్తున్నాయి గా డాక్టర్ గారూ ఇంకేమి చేస్తారు స్కాన్" అన్నా ఇంగ్లీష్ లో కింద కూర్చుని బాబుని పైకి ఎత్తి పట్టుకుంటూ. "నువ్వు ఇలాంటి బాబుని మొదటి సారి చూసావేమో, మేము రోజూ చూస్తూ ఉంటాం. వీడి అదృష్టం బావున్నట్టు లేదు పాపం" అన్నారు కొంచం అప్ సెట్ అయిన స్వరంలో ఇంగ్లీష్ లో కంప్యూటర్ లో చూస్తూ. "ఏదైనా ప్రాబ్లం ఉందా డాక్టర్" ఆదుర్దాగా నేను. "మీ డాక్టర్ చెప్తారులే. మీరు తీసుకుంటున్నారా ఈ బాబుని?” డాక్టర్ ప్రశ్న. బాబుని తీసుకునేవాళ్ళకి నాకు ఉన్న పరిచయం చెప్పా క్లుప్తంగా ఆయనతో.
ఆన్ని టెస్ట్ లు అయ్యాయి. మధ్యాహ్నం మూడు అయింది. రిపోర్ట్ లు అన్నీ రావడానికి సాయంత్రం అవుతుంది. ఆయా తనని బాబుని ఆశ్రమం దగ్గర దింపమంది. అందరం మా ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేశాం. "ఆపిల్ ఉంది మా అబ్బాయికి చిన్నప్పుడు ఉడకపెట్టి పెట్టేదాన్ని అది తినిపించనా బాబు కి" అడిగా ఆయాని. "మా రూల్స్ ఒప్పుకోవు, బయట బాబుకి ఏవీ తినిపించకూడదు" అని తన బాగ్ లోంచి రెండు Parle-G బిస్కట్ లు తీసి వాటిని నీళ్ళలో నానబెట్టి వాడికి తినిపించింది. డ్రైవర్ దించి వచ్చేస్తాడు మీరు రానవసరం లేదు అని బాబు ని తీసుకుని వెళ్లిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకుని మేము రిపోర్ట్ లు కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరాం. అన్ని చోట్ల రిపోర్ట్ లు తీసుకుంటూ అన్నీ నార్మల్ యే కదా అని నేను అడుగుతుంటే భార్యాభర్తలిద్దరూ ఒకళ్లని ఒకళ్ళు చూసుకునేవారు. హార్ట్ టెస్ట్ జరిగిన చోట రిపోర్ట్ తీసుకుని వెంటనే తీసి చదువుతూ అంతా బావుంది కదా అని అడిగా మధ్యాహ్నం డాక్టర్ గారి మాటలు గుర్తు వచ్చి. "గుండెలో చిల్లు ఉంది. అయినా ఇవన్నీ నేను చెప్పకూడదు, మీ డాక్టర్ గారు రిపోర్ట్ లు చూసి చెప్తారు" అని మమ్మల్ని పంపించేశాడు.
అన్నీ రిపోర్ట్ లతో డాక్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఆయన OP టైమ్. చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. నన్ను లోపలికి రానివ్వలేదు బాబుని ఎవరు దత్తత చేసుకుంటున్నారో వాళ్ళిద్దరే అక్కడ ఉండాలని నన్ను బయటకి వెళ్లిపొమ్మన్నారు. దాదాపు అరగంట వాళ్ళతో మాట్లాడారు. అందరం ఇంటికి వచ్చాం. రాత్రి పది గంటలకి వాళ్ళ ట్రైన్ ఉంది.
ఏమన్నారు డాక్టర్ గారు అడిగా ఇంక ఉండబట్టలేక. "అన్నీ బానే ఉన్నాయి కానీ గుండెలో కన్నం ఉందిట. అంత ప్రమాదం ఏమీ ఉండదు. దాని అంత అది సర్దుకుంటుంది, ఒకవేళ అలా అవ్వకపోతే ఒక సంవత్సరం తరువాత సర్జరీ చేయాల్సి రావచ్చు అన్నారు" ఆయన నాకు చెప్తుండగానే ఆవిడ అడ్డం పడింది "ఏదో అన్నీ నచ్చాయి అనుకుంటే ఇదేంటో మరి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి జబ్బు పిల్లాడిని తీసుకోవాలా అంటుంటే ఈయనకి అర్థం కావట్లేదు" కాసింత కోపంగానే అంది ఆవిడ. ఆ మాటకి నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దత్తత తీసుకోవాలంటే ఇన్ని తతంగాలు ఉంటాయని కూడా తెలీని నాకు ఒక పూట లోనే ఆ బాబు దగ్గర అయిపోయాడు.
"మా బంధువుల అబ్బాయి ఇలా హార్ట్ లో హోల్ తోనే పుట్టాడు, కానీ ఇప్పుడు చక్కగా ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, పాపం ఉదయం నుంచి ఆ అబ్బాయి కి నరకం చూపించాం రకరకాల టెస్ట్ లతో. మీకే అలాంటి అబ్బాయి పుడితే వైద్యం చేయించరా? ఇంత ఆస్తి ఉండి మీరే ఇలా ఆలోచిస్తే రేపు ఆ బాబుకి ఆ ఆశ్రమం వాళ్ళు ఏమి వైద్యం చేయిస్తారు చెప్పండి? అన్నీ మంచే జరుగుతాయి. దేవుని మీద భారం వేసి ఆ బిడ్డని తీసుకోండి. మీ మంచితనమే వాడికి రక్ష అవుతుంది" నాకు తోచిన సలహా నేను ఇచ్చా.
"మీరు మాకు చాలా సహాయం చేశారు. మీలాంటి వాళ్ళని ఇంత వరకు చూడలేదు. పరిచయం కూడా లేని వాళ్ళకి ఇంత హెల్ప్ చేసేవాళ్లని మేం ఎప్పుడూ చూడలేదు". ఇద్దరు బాగా పొగిడారు నన్ను.  ఊరెళ్లి ఆలోచించి చెప్తామ్ అని ఆశ్రమానికి ఫోన్ చేసి చెప్పేశారు ఆయన.  "ఇంకేమీ ఆలోచించకండి. గుడ్ న్యూస్ తో నాకు ఫోన్ చేయండి” అని వాళ్ళని పంపేశా.
రాత్రి మా అబ్బాయి ని పడుకో పెడుతూ(వాడికి 12 ఏళ్ళు అప్పుడు) "వాళ్ళు వద్దంటే ఆ బాబుని నేను తీసేసుకుంటా" అన్నా వాడితో.
వాడు నవ్వుతూ "నీ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళి వాళ్ళు వంద చీరలు చూసి కొనకుండా వచ్చేస్తుంటే బాధ పడి నువ్వు చీర కొనుక్కొచ్చినట్టు అనుకుంటున్నావా బాబుని తీసుకోవడం"
ఇద్దరం నవ్వుకున్నాం. రకరకాల ఆలోచనలతో పడుకున్నా ఆ రాత్రి.
ఒక వారం తరవాత విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. "ఆ రిపోర్ట్స్ ఇక్కడ మా ఫ్యామ్లీ డాక్టర్ గారికి చూపించాం. ఆయన తీసుకోమన్నారు. ఇంకో నాలుగురోజుల్లో వస్తున్నాం. కోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాబుని తీసుకు వెళ్తాం"
తరవాత అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆ బాబు విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఫోన్ పాడవడం వల్ల వాళ్ళ నంబర్ మిస్ అయ్యా. వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇప్పుడు వాడికి 6 సంవత్సరాలు నిండి ఉంటాయి. గుర్తు వచ్చినపుడల్లా వాడు బావుండాలి దేవుడా అని అప్రయత్నంగా అనుకుంటూ ఉంటా.
అరగనంత డబ్బు ఉండి సరోగసీ తో పిల్లల్ని కనిపించుకునే వాళ్ళు కొందరు, అనాధ పిల్లలకి జీవితం ఇచ్చేవాళ్లు కొందరు.
అమ్మలకి, అమ్మ మనసు ఉన్న మహానుభావులకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.