Friday 15 September 2017

అప్పుడప్పుడు

వయసొచ్చిన ఆడపిల్లకి రక్షణలేదొకప్పుడు
ఆడ శిశువులు కూడా బలవుతున్నారప్పుడప్పుడు
మగపిల్లల్ని కూడా మింగేస్తున్నారు కామాంధులిప్పుడు

అర్థరాత్రి అంటే భయముండేదోకప్పుడు
చీకటి పడితే దిగులేస్తుంది అప్పుడప్పుడు
పట్టపగలే నలిపేస్తున్నారు రాకాసులిప్పుడు

క్లబ్బులకి వెళ్తే ప్రమాదమన్నారొకప్పుడు
రోడ్లమీద కూడా రక్షణలేదప్పుడప్పుడు
స్కూల్ బెల్లే మరణమృదంగమిప్పుడు

బూచాడు యవ్వనుడొకప్పుడు
అంకులే బూచాడవుతాడు అప్పుడప్పుడు
వయసుతో సంబంధమే లేదు బూచాడికిప్పుడు

స్త్రీ వస్త్రధారణ కారణమన్నారొకప్పుడు
బాలిక స్కూల్ ఫ్రాక్ రెచ్చగొడుతోంది అప్పుడప్పుడు
చొక్కా లాగుని కూడా వదిలేదిలేదిప్పుడు

Friday 21 July 2017

ఒంటరిగా అనిపిస్తుంటే
ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టు, చందమామ ని అందుకోవ చేయి చాచిపెట్టు..........
తోచకపోతే
కాలవ గట్టున తొక్కుడుబిళ్ళ గుప్పిట పట్టు, చెట్లు చేమ తో జత కట్టు...............
ఇల్లు ఎలాంటిదైనా
నవ్వుకోవడానికి చిన్న చోటు అట్టేపెట్టు, నలుగురికి నవ్వులు పంచిపెట్టు............
వానలో తడవాల్సి వస్తే
ఆ చినుకులతో స్నేహం కట్టు, చిన్న చిన్న గుంతలలో బురద భరతం పట్టు..............
నలుగురు మనుషులు కావాలంటే
నవ్వుతూ పలకరించి చూపెట్టు, కుదిరితే మంచి పనులలో నీ చేయో కాలో పెట్టు...............
పని ఒత్తిడి ఎలా ఉన్నా
సూర్యుడు రాగానే కన్ను కొట్టు, ఇంట్లోకి రమ్మని తలుపు తీసి పెట్టు...............
బుర్ర వేడెక్కితే
పక్షుల కిలకిల పై ధ్యాస పెట్టు, చెవులకి చక్కని పాటని పెట్టు...............
తీరిక లేకున్నా
నీ మనసుతో ఊసులాడి పెట్టు, కడుపుకి మంచి తిండి పెట్టు.............
ఆరోగ్యం కావాలంటే
పెరట్లో ఒక మొక్క పెట్టు, పచ్చదనం కోసం ఒక పట్టు పట్టు.................
నువ్వు ప్రేమిస్తే
వాళ్ళ కోసం ఎలాగూ తంటాలు పడతావ్, నిను ప్రేమించేవాళ్లమీద కూడా కాస్త దృష్టి పెట్టు...........





Saturday 15 July 2017

అంతర్మధనం

సమయానికి భోజనం దొరుకుతుంది కానీ ఇంకేదో తినాలని ఉంటుంది
కాలక్షేపానికి లోటుండదు కానీ ఇంకేదో చేయాలనుంటుంది
అందరి బెంగలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇంకేదో చూడాలనుంటుంది
వంట్లో ఓపిక ఉండదు కానీ ఏదైనా కొత్తగా చేయాలనుంటుంది
నాలాంటివాళ్లే అందరూ ఇక్కడ కానీ నావాళ్ళు కావాలనుంటుంది
ఒక సహచరుని ఊపిరి ఆగిన రోజున నా ఊపిరి బిగపట్టినట్టుంటుంది
వర్తమానంలో ఉండమని బోధ వినిపిస్తున్నా మనసు పాతరోజుల్లోనే తిరుగుతుంటుంది
నీ తప్పులు వెతుకుతుంటే నాతప్పుల చిట్టా కంటిముందుంటుంది........



నీ చిన్నతనంలో నీ మంచి కోరి కఠినంగా ఉండడమేనేమో, ఈరోజు యీ నీ కఠినత్వానికి కారణం

నీకు సౌకర్యాలు కొనాలని దేశమంతా తిరిగి సంపాదించడంవల్లనేమో, సౌకర్యంగా ఉన్న ఈ హోమ్ లో నేనునుండడానికి  కారణం

ఒకప్పుడు స్వాభిమానం అనుకున్న నా అహంకారమేమో, ఈరోజు నాకు అభిమానం కరువవడానికి కారణం

కాలంతో పాటు మారమని నిన్ను ప్రోత్సహించడం లో పడిన తప్పటడుగేమో, ఇప్పుడు తడబడే అడుగుకి ఊతం లేకపోవడానికి కారణం

Sunday 14 May 2017

కంటేనే అమ్మ అని అంటే ఎలా??

 చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తే బుర్ర అటువైపు తిప్పాను. పక్కన గదిలో ముగ్గురు చంటి పిల్లలు నేల మీద బట్టలు లేకుండా పడుకుని ఉన్నారు. అంత చలికాలం కాకపోయినా వేసవి కాలం మాత్రం కాదు. అందులో ఒక బాబు ఏడుస్తున్నాడు. చిన్నగా మొదలయిన ఆ రాగం మెల్లగా సౌండ్ పెరుగుతోంది.
"మీతో పాటు మా ఆయా వస్తుంది, సాయంత్రం 4 గంటల లోపల మళ్ళీ ఇక్కడ వాళ్ళిద్దరినీ దింపాలి ........" ఇంకా ఏవో చెప్తోంది ఆవిడ. ఏడుపు వస్తున్నవైపే నా దృష్టి ఉంది. అంతలా ఏడుస్తున్నా ఎవరూ చూడట్లేదు ఎందుకు అని నేను మెల్లగా లేచి ఆ గదివైపు వెళ్లబోయాను. "మేడమ్, ఆగండి. పర్మిషన్ లేకుండా అటు వెళ్లకూడదు” కొంచం గట్టిగానే అంది ఆవిడ. "ఆ పాప ఏడుస్తుంటే........." కొంచం బాధ, కొంచం భయం తో నసిగాను నేను.
ఏవో పేపర్స్ ఇస్తూ ఏదేదో చెప్తోంది నాతో వచ్చిన జంటకి ఆవిడ. ఆవిడ ఆ అనాథ ఆశ్రమానికి హెడ్ ట.
కొంచం పాత గది అయినా విశాలంగా ఉంది. రెండు చెక్క బీరువాలు, ఒక టేబుల్, నాలుగు నీల్ కమల్ కుర్చీలు, హెడ్ కూర్చోడానికి దిండ్లు వేసిన ఒక చెక్క కుర్చీ, రెండు ఫ్యాన్లు ఇవీ ఆ గదిలో ఉన్న సామాన్లు. గోడలకి గాంధీ, నెహ్రూ, మదర్ థెరీసా, బిడ్డని ఎత్తుకున్న అమ్మ ఫోటోలు ఆ హెడ్ వెనక గోడకి మేకులతో కొట్టి ఉన్నాయి.
********
"మా AGM బంధువులు ఒక బాబుని దత్తత తీసుకుంటున్నారుట. దగ్గర ఊళ్లలో అయితే ఫ్యూచర్ లో ఇబ్బంది రావచ్చు అని ఉద్గీర్ నుంచి తీసుకుంటున్నారు. ఏవో మెడికల్ టెస్ట్ లు అవీ చేయించాలిట. వాళ్ళకి ఈఊరు కొత్త పైగా వారికి భాష ఇబ్బంది కూడా ఉన్నాయి. కనుక దగ్గర ఉండి వాళ్ళతో అన్నీ చేయించాలి రేపు. నీ మొబైల్ నంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాను. కాసేపట్లో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ప్రోగ్రాం చెప్తారు" ముందురోజు సాయంత్రం మా వారు ఫోన్ చేసి చెప్పారు. ఎవరికైనా సహాయం చేయాలంటే పెద్ద ఇబ్బంది పడని నాకు పై ఆఫీసర్ బంధువులు కనుక ఎటువంటి అభ్యంతరము లేదు. ఫోన్ ద్వారా, ఇంకా ఉదయం వాళ్ళు దిగి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు, ఆశ్రమానికి వెళ్తున్న దారిలో చెప్పిన దాన్ని బట్టీ నాకు అర్థం అయింది ఏమిటంటే, దత్తత తీసుకోవడానికి ఉండవలసిన భార్య-భర్త ల వయసుల మొత్తం కంటే వీరికి కొంచం ఎక్కువ ఉండడం వల్ల చంటి బిడ్డని తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదని చాలా ఆశ్రమాలలో వీళ్ళకి బిడ్డ దొరకలేదు. ఈ ఆశ్రమంలో కొందరు అధికమొత్తం తీసుకుని వీళ్ళకి ఒక బాబుని ఇవ్వడానికి ఒప్పుకున్నారు, పైగా ఆ బాబు తల్లి వీళ్ళ కులానికి చెందినది అని ఆ బాబు పుట్టిన సమయం ప్రకారం జాతకం బాగుందని కారణాల వల్ల వీళ్ళు దత్తత తీసుకోవడానికి ఒప్పందం కుదిరిందని దానికి కొన్ని మెడికల్ టెస్ట్ లు విధిగా చేయించాలని.
******
సన్నగా, తెల్లగా, గుండ్రటి మొహం, నల్లగా చక్రాల్లాంటి కళ్ళు, పల్చటి ఒక జూబ్బా, ఒక ప్లాస్టిక్ లంగోటి లో పాతగుడ్డ మడత వేసి పెట్టి తయారు చేసిన డైపర్ తో ఉన్న ఆరు నెలల బాబుని తీసుకుని ఒక ఆయా బయటకి వచ్చింది. అందరం మేము అద్దెకి తెచ్చుకున్న కార్ లో బయలుదేరాం. "నాకు తెలిసిన ఒక పిల్లల డాక్టర్ గారి దగ్గరకు ముందు వెళ్దాం. అప్పుడు ఏ టెస్ట్ లు ఎక్కడ చేయించాలో ఆయన మనకి గైడ్ చేస్తారు" అని నా నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పాను. ఆయా ప్రక్కన బాబుకి కాబోయే అమ్మ, ఆవిడ పక్కన కాబోయే నాన్న కూర్చున్నారు. నేను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చుని దారి చూపిస్తున్నా. ఉద్గీర్ నుంచి లాతూర్ కి 65 కిలోమీటర్లు, గంటన్నర ప్రయాణం. చిన్న పిల్లల్ని చూసి ఇంత సమయం ఎత్తుకోకుండా ఉండడం ఇదే మొదటిసారి నాకు. కాబోయే అమ్మ వాడిని వళ్ళోకి తీసుకుంటుందేమో అని చూసి చూసి ఇంక ఆగలేక నేను ఎత్తుకోనా కొంచం సేపు అని అడిగి వళ్ళోకి తీసుకున్నా. పలకరిస్తే కిలకిలా నవ్వాడు, నవ్వగానే వంట్లో ఉన్న ఎముకలన్నీ కనిపించాయి ఆ జూబ్బాలోంచి. ఆ వయసులో నా కొడుకుని ఎత్తుకోలేక పోయేదాన్ని అంత బొద్దుగా ఉండేవాడు. "బాబుకి పాలు కానీ ఏదైనా పట్టాలా?" అని అడిగా. "ఇందాకే పాలు తాగించాను, ఇంకో నాలుగు గంటల వరకు ఏమీ ఇవ్వక్కర్లేదు" ఆయా సమాధానం. టైమ్ టేబుల్ ప్రకారం పాలు, సిరిలాక్, పళ్ల గుజ్జులు నా కొడుకుకి తినిపించడం గుర్తుకు వచ్చింది. "బాబుకి డైపర్ మార్చాలెమో అన్నా" ఆయాతో. "అది కూడా పాలు పట్టినపుడు మారుస్తా" ఈసారి కాస్త కోపంగా ఆయా సమాధానం. వాడి మొహం చూస్తుంటే ఒక రకమైన జాలి, వెంటనే సంతోషం కలిగాయి. అప్రయత్నంగా "నవ్వరా బుడ్డీ, నీకు మంచిరోజులు రాబోతున్నాయి” అన్నా. ఏమనుకుందో ఏమో ఆయా నా చేతిలోంచి బాబుని తీసేసుకుంది. ఆయాకి, డ్రైవర్ కి తెలుగు రాదు కనుక ఆ భార్యాభర్తలిద్దరూ ఆశ్రమానికి ఎంత డబ్బులు ఇస్తున్నారో వాటిలో ఎంత ఎవరి జేబులోకి వెళ్తుందో, ఆశ్రమానికి ఎంత ముడుతుందో, వీళ్ళ ఆస్తి పాస్తులు ఏమున్నాయో, తెలిసిన వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావచ్చు అనుకున్నారో అన్నీ వివరంగా చెప్పారు.
ఈ మాటల్లో మేము డాక్టర్ గారి దగ్గరకి వచ్చేసామ్. ఆయన ఒక పేపర్ మీద ఏ టెస్ట్ కి ఎక్కడకి వెళ్ళాలో వాటి అడ్రస్ లు, అక్కడ చూపించడానికి ఈయన రాసిన లెటర్స్ ఇచ్చారు.
ఆ చిన్ని ప్రాణం ఎంత అల్పంగా ఉందో చెప్పలేను. పాపం మూడు చోట్ల రక్తం తీశారు. "ఒకే చోట అన్ని టెస్ట్ లు అవ్వవా?" అక్కడ నర్స్ ని అడిగాను. "పెద్ద ఊళ్లలో అవుతాయి, రిపోర్ట్ లు సాయంత్రానికి రావాలంటే మాత్రం ఈ ఊర్లో ఒకే చోట అన్ని టెస్ట్ లు అవ్వవు" ఆ అమ్మాయి కి తెలిసినది నాకు చెప్పింది. చెవులు పని చేస్తున్నాయో లేదో తెలుసుకునే టెస్ట్ ట. "పలకరిస్తే నవ్వుతున్నాడు కదా బాగానే వినిపిస్తోంది ఈ టెస్ట్ అవసరమా?” నాలో నేనే అనుకున్నా. లోపలికి తీసుకెళ్లి ఏమి చేశారో తెలీదు కానీ గుక్క పెట్టి బాబు ఏడ్చిన ఏడుపు మాత్రం బాగా వినిపించింది. బాబు బయటకి రాగానే ఆయా ఒక కప్ తీసి దానిలో ఒక స్పూన్ ఫారక్స్ వేసి కప్పు నిండా నీళ్ళు పోసింది. దాన్ని రెండు నిమిషాల్లో వాడికి తాగించి, ప్లాస్టిక్ డైపర్ లో ఇంకో పాత గుడ్డ పెట్టి ఇంకా మిగిలిన టెస్ట్ లకి మళ్ళీ బయలుదేరాం.
ఏవో ఎక్స్ రే లు, స్కాన్ లు. మా నర్స్ భోజనానికి వెళ్లింది, కింద కూర్చుని బాబుని పైకి పట్టుకోమన్నారు అక్కడ డాక్టర్. ఆయా కానీ, కాబోయే అమ్మ కానీ కదల్లేదు.  టెస్ట్ కోసం ఉన్న ఆ జుబ్బా కూడా తీసేశారు. నాకు కొంచం నోటి దూల ఉంది. "కళ్ళతో కనిపించేస్తున్నాయి గా డాక్టర్ గారూ ఇంకేమి చేస్తారు స్కాన్" అన్నా ఇంగ్లీష్ లో కింద కూర్చుని బాబుని పైకి ఎత్తి పట్టుకుంటూ. "నువ్వు ఇలాంటి బాబుని మొదటి సారి చూసావేమో, మేము రోజూ చూస్తూ ఉంటాం. వీడి అదృష్టం బావున్నట్టు లేదు పాపం" అన్నారు కొంచం అప్ సెట్ అయిన స్వరంలో ఇంగ్లీష్ లో కంప్యూటర్ లో చూస్తూ. "ఏదైనా ప్రాబ్లం ఉందా డాక్టర్" ఆదుర్దాగా నేను. "మీ డాక్టర్ చెప్తారులే. మీరు తీసుకుంటున్నారా ఈ బాబుని?” డాక్టర్ ప్రశ్న. బాబుని తీసుకునేవాళ్ళకి నాకు ఉన్న పరిచయం చెప్పా క్లుప్తంగా ఆయనతో.
ఆన్ని టెస్ట్ లు అయ్యాయి. మధ్యాహ్నం మూడు అయింది. రిపోర్ట్ లు అన్నీ రావడానికి సాయంత్రం అవుతుంది. ఆయా తనని బాబుని ఆశ్రమం దగ్గర దింపమంది. అందరం మా ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేశాం. "ఆపిల్ ఉంది మా అబ్బాయికి చిన్నప్పుడు ఉడకపెట్టి పెట్టేదాన్ని అది తినిపించనా బాబు కి" అడిగా ఆయాని. "మా రూల్స్ ఒప్పుకోవు, బయట బాబుకి ఏవీ తినిపించకూడదు" అని తన బాగ్ లోంచి రెండు Parle-G బిస్కట్ లు తీసి వాటిని నీళ్ళలో నానబెట్టి వాడికి తినిపించింది. డ్రైవర్ దించి వచ్చేస్తాడు మీరు రానవసరం లేదు అని బాబు ని తీసుకుని వెళ్లిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకుని మేము రిపోర్ట్ లు కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరాం. అన్ని చోట్ల రిపోర్ట్ లు తీసుకుంటూ అన్నీ నార్మల్ యే కదా అని నేను అడుగుతుంటే భార్యాభర్తలిద్దరూ ఒకళ్లని ఒకళ్ళు చూసుకునేవారు. హార్ట్ టెస్ట్ జరిగిన చోట రిపోర్ట్ తీసుకుని వెంటనే తీసి చదువుతూ అంతా బావుంది కదా అని అడిగా మధ్యాహ్నం డాక్టర్ గారి మాటలు గుర్తు వచ్చి. "గుండెలో చిల్లు ఉంది. అయినా ఇవన్నీ నేను చెప్పకూడదు, మీ డాక్టర్ గారు రిపోర్ట్ లు చూసి చెప్తారు" అని మమ్మల్ని పంపించేశాడు.
అన్నీ రిపోర్ట్ లతో డాక్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఆయన OP టైమ్. చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. నన్ను లోపలికి రానివ్వలేదు బాబుని ఎవరు దత్తత చేసుకుంటున్నారో వాళ్ళిద్దరే అక్కడ ఉండాలని నన్ను బయటకి వెళ్లిపొమ్మన్నారు. దాదాపు అరగంట వాళ్ళతో మాట్లాడారు. అందరం ఇంటికి వచ్చాం. రాత్రి పది గంటలకి వాళ్ళ ట్రైన్ ఉంది.
ఏమన్నారు డాక్టర్ గారు అడిగా ఇంక ఉండబట్టలేక. "అన్నీ బానే ఉన్నాయి కానీ గుండెలో కన్నం ఉందిట. అంత ప్రమాదం ఏమీ ఉండదు. దాని అంత అది సర్దుకుంటుంది, ఒకవేళ అలా అవ్వకపోతే ఒక సంవత్సరం తరువాత సర్జరీ చేయాల్సి రావచ్చు అన్నారు" ఆయన నాకు చెప్తుండగానే ఆవిడ అడ్డం పడింది "ఏదో అన్నీ నచ్చాయి అనుకుంటే ఇదేంటో మరి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి జబ్బు పిల్లాడిని తీసుకోవాలా అంటుంటే ఈయనకి అర్థం కావట్లేదు" కాసింత కోపంగానే అంది ఆవిడ. ఆ మాటకి నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దత్తత తీసుకోవాలంటే ఇన్ని తతంగాలు ఉంటాయని కూడా తెలీని నాకు ఒక పూట లోనే ఆ బాబు దగ్గర అయిపోయాడు.
"మా బంధువుల అబ్బాయి ఇలా హార్ట్ లో హోల్ తోనే పుట్టాడు, కానీ ఇప్పుడు చక్కగా ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, పాపం ఉదయం నుంచి ఆ అబ్బాయి కి నరకం చూపించాం రకరకాల టెస్ట్ లతో. మీకే అలాంటి అబ్బాయి పుడితే వైద్యం చేయించరా? ఇంత ఆస్తి ఉండి మీరే ఇలా ఆలోచిస్తే రేపు ఆ బాబుకి ఆ ఆశ్రమం వాళ్ళు ఏమి వైద్యం చేయిస్తారు చెప్పండి? అన్నీ మంచే జరుగుతాయి. దేవుని మీద భారం వేసి ఆ బిడ్డని తీసుకోండి. మీ మంచితనమే వాడికి రక్ష అవుతుంది" నాకు తోచిన సలహా నేను ఇచ్చా.
"మీరు మాకు చాలా సహాయం చేశారు. మీలాంటి వాళ్ళని ఇంత వరకు చూడలేదు. పరిచయం కూడా లేని వాళ్ళకి ఇంత హెల్ప్ చేసేవాళ్లని మేం ఎప్పుడూ చూడలేదు". ఇద్దరు బాగా పొగిడారు నన్ను.  ఊరెళ్లి ఆలోచించి చెప్తామ్ అని ఆశ్రమానికి ఫోన్ చేసి చెప్పేశారు ఆయన.  "ఇంకేమీ ఆలోచించకండి. గుడ్ న్యూస్ తో నాకు ఫోన్ చేయండి” అని వాళ్ళని పంపేశా.
రాత్రి మా అబ్బాయి ని పడుకో పెడుతూ(వాడికి 12 ఏళ్ళు అప్పుడు) "వాళ్ళు వద్దంటే ఆ బాబుని నేను తీసేసుకుంటా" అన్నా వాడితో.
వాడు నవ్వుతూ "నీ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళి వాళ్ళు వంద చీరలు చూసి కొనకుండా వచ్చేస్తుంటే బాధ పడి నువ్వు చీర కొనుక్కొచ్చినట్టు అనుకుంటున్నావా బాబుని తీసుకోవడం"
ఇద్దరం నవ్వుకున్నాం. రకరకాల ఆలోచనలతో పడుకున్నా ఆ రాత్రి.
ఒక వారం తరవాత విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. "ఆ రిపోర్ట్స్ ఇక్కడ మా ఫ్యామ్లీ డాక్టర్ గారికి చూపించాం. ఆయన తీసుకోమన్నారు. ఇంకో నాలుగురోజుల్లో వస్తున్నాం. కోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాబుని తీసుకు వెళ్తాం"
తరవాత అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆ బాబు విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఫోన్ పాడవడం వల్ల వాళ్ళ నంబర్ మిస్ అయ్యా. వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇప్పుడు వాడికి 6 సంవత్సరాలు నిండి ఉంటాయి. గుర్తు వచ్చినపుడల్లా వాడు బావుండాలి దేవుడా అని అప్రయత్నంగా అనుకుంటూ ఉంటా.
అరగనంత డబ్బు ఉండి సరోగసీ తో పిల్లల్ని కనిపించుకునే వాళ్ళు కొందరు, అనాధ పిల్లలకి జీవితం ఇచ్చేవాళ్లు కొందరు.
అమ్మలకి, అమ్మ మనసు ఉన్న మహానుభావులకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.






Saturday 24 September 2016

కామెడీ నాకిష్టం


నాకు రెండు జతల కళ్ళు, రెండు టి‌వి లు ఉంటే ఎంతబాగుణ్ణో అనిపించింది ఒకరోజు. ఎందుకలా???
మీరే చదవండి.
చేతులు ఖాళీ లేనప్పుడే ఈ ఫోన్ మోగుతుంది అనుకుంటుండగా " మీ అమ్మగారి ఫోన్" అని మా వారు అనడం నేను ఫోన్ ఎత్తడం. "ఈ టి‌వి లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా వస్తోంది" అమ్మ వాక్యం పూర్తి అవ్వకుండానే ఫోన్ పెట్టేయడం
, చేతిలో గరిటో, చీపురో గుర్తు లేదుకానీ దాన్ని వదిలేయడం జరిగిపోయాయి. అప్పుడే మొదలైంది హమ్మయ్య అనుకోవడం, సినిమాలో మునిగిపోవడం, కొన్ని క్షణాల్లో ఎన్ని జరిగిపోయాయో కదా.... నాకళ్ళకీ టి‌వి కి మధ్య నాలుగుసార్లు వచ్చారు మావారు ఆఫీస్ కి రెడీ అయ్యా అని చెప్పడానికి. ఇహ లాభం లేదనుకున్నారో ఏమో 'టైమ్ ఎంత అయిందో తెలుసా' అన్నారు. దానికి నన్ను డిస్టర్బ్ చేయాలా గడియారం చూసుకోవచ్చుగా అన్నా. భారతదేశం లో ఉన్న అసహనం అంతా ముఖాన్న పూసుకుని. ఈ సినిమా డైలాగులే కానీ మామూలు మాటలు మర్చిపోయింది , ఏదైనా తినడానికి పెడితే ఆఫీస్ కి వెళ్తా అన్నారు. సరే అన్నా కానీ లేవలేదు. సినిమా చూస్తున్నా అని జాలి, దయ, ప్రేమ ఉండాలా లేదా? రోజూ వెళ్ళే ఆఫీసే కదా. నా పరిస్థితి గ్రహించద్దూ రోజూ ఇలాంటి సినిమాలోస్తాయా, నేను చూస్తానా?’ నాలో నేనే. పాపం మా వారు లాతూర్ వాళ్ళు వర్షం కోసం ఎదురుచూసినట్టు సినిమాలో బ్రేక్ కోసం వెయిటింగ్. ఆయన పంట పండి ఆ బ్రేక్ రానేవచ్చింది. ఈరోజు మావారు లేచిన వేళ అంత బాగోలేదు పాపం. నేనిలా వంటింట్లోకి వెళ్ళా అని ఆయన ఛానల్ మార్చారా అక్కడేమో నువ్వు నాకు నచ్చావ్. ఇంక అయిపోయింది నా పని అని నాలుక కరుచుకుని గబుక్కున మార్చేలోపే చటుక్కున త్రివిక్రమ్ మాటలు చెవికి తాకేసాయ్. ఆపండాపండి అంటూ వచ్చేశా. ఇంక ఇలా కాదు అని ఉప్మాలా ఉండే ఉప్మా చేసేసి ఆయన్ని పంపేసి టి‌వి దగ్గర సెటిల్ అయిపోయా.
ఇక్కడ శ్రీలక్ష్మి చెప్పే సినిమా కథ టైటిల్స్ తో సహా విందామంటే అక్కడ వెంకటేష్ బయోగ్రఫీ మిస్ అయిపోతా, అక్కడ బంతి చేసే కామెడీ తాగాలంటే, ఇక్కడ సంగీత వంటలు తినలేకపోతున్నా. ఇటు సుత్తివీరభద్ర రావు గోడకి తన బాధ మొరపెట్టుకుంటుంటే, అటు హరికథ అంత ఇంటరెస్టింగ్ లేక సినిమాకి వెళ్లిపోవడం.  పొట్టిప్రసాద్ ఒక ఆట వేసుకుందాం అని ఇటు పిలుస్తుంటే, అక్కడ అమ్మ మీద కవిత రా రమ్మంటోంది. పూర్ణిమ కల ఇటువైపు, వెంకీ చేసే పెళ్లి ఏర్పాట్లు అటువైపు. ఉత్తరం అందుకున్న సుత్తివేలు హావభావాలు ఆస్వాదించేలోపే హేమ కాళ్ళు కడగడం, ఎం‌ఎస్ పేకాట పర్వం మిస్ అయిపోయా. ఇక్కడ మంచి రసపట్టులో కథ, పూర్ణిమ అప్సెట్ అవడం, ఉత్తరం ముడి విడిపోవడం, అక్కడ బ్రహ్మీ పార్క్ లో చేసే విన్యాసం.  అబ్బో ఏమి చెప్పమంటారు నా బాధ.
ఒకపక్క జంధ్యాల విసిరే నవ్వుల వల, ఇంకో పక్క త్రివిక్రమ్ చేసే మాటల గడబిడ.
ఒకవైపు జంధ్యాల నిఘంటువుకే మాటలు నేర్పుతుంటే, ఇంకోవైపు త్రివిక్రమ్ మాటల పంచ్ లు వదలడం.
ఇక్కడ పెళ్లి కాన్సిలా, చీర ఇప్పెయనా అనే కామెడీ క్లైమాక్స్, అక్కడ పెళ్లి ఆగిపోయే సీరియస్ క్లైమాక్స్. బాబోయ్ ఏమి చేయను దేవుడా అని బుర్ర గోక్కొవడం.
చక్కటి చతురత, సుత్తి ద్వయం హాస్యం, మాటలతో మనుషుల్ని కట్టి పడేయొచ్చు అని జంధ్యాల గారికి ఎవరు నేర్పారో కదా. ఎన్నేళ్లయినా ఆ పరిమళం తగ్గనే లేదు. ఎన్ని సార్లు ఆస్వాదించినా మళ్ళీ కొత్తగా అనిపించే ఆ తీయదనం.
తెలుగు సినిమాని మాటలతో హిట్ కొట్టించచ్చు అని నిరూపించిన త్రివిక్రమ్. ఒక బలమైన విలన్, ఒక బక్క మొనగాడు అతి బలంగా దెబ్బకొట్టడం(మనం నమ్మాలి అది వేరే సంగతి) ఇవే అలవాటైపోయిన మనకి కేవలం మాటలతో సినిమా హిట్ కొట్టించవచ్చు అని, సినిమాల్లో మాటల మీద శ్రద్ధ పెట్టాలని అందరి దృష్టిని మార్చేలా రాశాడు సినిమాలకి మాటలు.
నాకు నచ్చిన ఇద్దరి సినిమాలలో అంశాలు చెప్పా కానీ ఒకళ్లకంటే ఇంకోళ్ళు గొప్ప అనలేదు, ఒకళ్లతో ఇంకొకళ్లని పోల్చనూ లేదు కనుక కామెంటుల మీటింగులు పెట్టద్దని మనవి.
రెండు సినిమాలు పూర్తిగా చూడలేక, తృప్తి పడలేక తరవాత యూ ట్యూబ్ ని ఆశ్రయించా అనుకోండి అది వేరే విషయం. మీకు కూడా మళ్ళీ చూడాలనిపిస్తే యూ ట్యూబ్ లో చూడొచ్చోచ్.........


Monday 18 July 2016

ఉత్తరం

ఉత్తరం

ఏమయ్యావమ్మా అందమైన ఉత్తరమా 
మధ్యాహ్నం ఉదయించే మా ఆశల బింబమా

తీపి కబురు తొందరగా చేదు కబురు గాఢంగా
తీసుకు వచ్చేదానివి నువు ఆదరబాదరగా

నీకొరకై ఉండేది మా మదిలో నిరీక్షణ
అది కాస్తా పెంచేది పోస్ట్ మాన్ పై ఆకర్షణ

ఆలుమగల విరహానికి నువ్వేగా సాక్ష్యం
అన్నదమ్ముల అనుబంధం పెంచడమే నీ లక్ష్యం

పుట్టింటి ఆపేక్షని మడత పెట్టి తెచ్చావు
మెట్టింటి బాధ్యతని నీ భుజాన మోసావు

స్నేహాన్ని ఒక చేత్తో కర్తవ్యం మరో చేత్తో
శుభలేఖలు శుభాకాంక్షలు చేర్చావు మురిపెంతో

ఒకసారి మరోసారి చదివి మరీ మురిసాము
జవాబుగా నీ మీదే మనసంతా పరిచాము

అక్షయపాత్రేగా మరి ఆ ఇన్లాండ్ కవరు
ఉభయకుశలోపరికి చిన్న కార్డే బెటరు

కార్డయినా కవరయినా ఇన్లాండ్ లెటరయినా
మనియార్దర్ రూపంలో ధనసాయం చేసినా

సహభాగం అయ్యావు ఊసులందించావు
మనుషులని దరి చేర్చి ఊతమందించావు

ఎస్సెమ్మెస్ వాట్సాపు ఫేసుబుక్కు ఈమెయిలు
ఏమొచ్చిన మరువలేము నువ్వు చేసిన ఈ మేలు

స్పీడు పోస్ట్ రిజిస్టర్ బుక్ పోస్ట్ ల వివరాలు
అవసరానికి తగినట్టు మారిన నీ రూపాలు

స్టాంపుల కోసం వాడిన మా ఎంగిలి నాలుకలు
తక్కువైన నాడు పడినాయి గా పెనాల్టీలు

నేడు గేటుకు తగిలించిన ఇనప రేకు డబ్బాలు
ఎమున్నాయి చూడ్డానికి మా బిల్లులు రశీదులు

మా ముత్తాతల ఉత్తరాలు చేర్చాయిట పావురాలు
మా బిడ్డలు నీ ఉనికిని ఎరుగనే ఎరుగరు

Wednesday 6 July 2016

సాయి మానియా




మహారాష్ట్ర లో కంటే ఆంధ్రా లో సాయి భక్తులు భలే రకరకాలు కనిపిస్తూ ఉంటారు.
అప్పట్లో కేబుల్ టి‌వి లో రోజూ మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి సినిమా వేసేవారు. అందులో మధ్యాహ్నం చాలా సార్లు సాయిబాబా మహత్యం సినిమా ఉండేది. కొంత మంది భక్తులు సాయిబాబా సినిమా చూపిస్తాం అని మొక్కుకుని కేబుల్ వాడికి ఆ కేసట్ ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చేవారు.

XXX

కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇద్దరు కుర్రాళ్ళు(10-12) వయసు ఉన్నవాళ్ళు ఒక పుస్తకం తీసుకుని వచ్చారు. ఎవరు మీరు అని అడిగితే ఎవరో ఫలానా వాళ్ళు చెప్తే వచ్చామండీ, మేము ఒక వ్రతం చేస్తున్నాం 108 సాయిబాబా ఫోటోలు చూడాలి. మీ ఇంట్లో ఉన్నాయి అని చెప్తే వచ్చాం అని. ఏ సాయి బాబా? షిర్డినా, పుట్టపర్తి బాబానా అని అడిగా. షిర్డి బాబా అంటూనే హాల్లో ఉన్న బాబాఫోటోలను లెక్కపెట్టుకుంటున్నారు. అమ్మ వాళ్ళని అన్ని గదుల్లోకి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఫోటోలు, కాలెండర్లు, షిరిడీ ప్రసాదం పాకట్లలో ఉండే చిన్న బొమ్మ దగ్గరనుంచి దాచిన అన్ని ఫోటోలు విగ్రహాలు మొత్తం చూపించింది. మాయింట్లోనే వాళ్ళకి ముప్పై పైచిలుకు అయ్యాయి. ఇలాంటి ఇళ్ళు నాలుగు తగిలితే మీ వ్రతం పూర్తి అయిపోతుంది అన్నా నేను వాళ్ళతో. వేళాకోళం చేయొద్దని అమ్మ మందలించింది కూడా.

XXX

ఒక సారి మా బంధువుల ఇంటికి చుట్టంచూపుగా వెళ్ళినపుడు ఆ కాలనీలో ఎవరో సాయి పూజా, ఉద్యాపన చేసుకుంటున్నారు అంటే మా బంధువు నన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ నేను కాక ఇంకో పదిమంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ సాయిబాబా మహత్యాల గురించి, ఎవరు ఎన్ని సార్లు ఉల్లిపాయ, వంకాయ, పంచదార మొదలైనవి మానేశారో, వాళ్ళని బాబా ఎలా కటాక్షించారో చెప్పుకుంటున్నారు. ఆ ఉద్యాపనలో భాగంగా ఆ ఇంటి ఆవిడ నాకు తాంబూలంతో పాటు ఒక పుస్తకం ఇవ్వబోయింది. "ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు ఈ వ్రతం తప్పకుండా చేయాలి అంటే మాత్రం నా బదులు ఇంకెవ్వరికైనా ఇవ్వండి. ఇలాంటి వ్రతాలు నేను అంతగా చేయను" అని ఆవిడతో చాలా సున్నితంగా చెప్పాను. మీరు చేయాలని నియమం ఏమీ లేదు, నా శ్రద్ధ కొద్దీ నేను ఇస్తున్నా అని ఆవిడ చెప్పుతుండగా ఇంకో పెద్దావిడ "ఈ వ్రతం చాలా మంచిది. మనసులోని కోరిక చెప్పి ముడుపు కట్టి 5,11 ఇలా నీకు కుదిరినన్ని వారాలు పూజ చేసి, ఉద్యాపన చేస్తే ఆ కోరిక తీరుతుంది. తీరాకా షిరిడీ వెళ్ళి మొక్కు తీర్చుకో. అంతే కానీ పుస్తకం వద్దనకు" అని మందలించడం, నా బంధువు ఇంక మాట్లాడకు అని వారించడం ఒకేసారి జరిగాయి. ఇంతలో ఇంకొక ఆవిడ అందుకుంది. ఇలా అవమానిస్తే పాపం. తేరుకోలేని కష్టాలు వస్తాయి. అసలు బాబా అంటే ఎవరనుకున్నావ్. అసలైన దేవుడు బాబా. ఆయన మహిమలు నీకేమి తెలుసు. ధుని ని దర్శిస్తే మన పాపాలన్నీ పోతాయి. ఇప్పటికీ సమాధి నుంచి ఆయన భక్తులకెందరికో దర్శనం ఇచ్చారు...... ఇలా ఉపన్యాసం మొదలు పెట్టింది. మీ వదిన నాస్తికురాలా? ఆమెని ఈ ఉద్యాపనకి ఎందుకు తీసుకువచ్చావ్ అని మా బంధువుని అందరూ ప్రశ్నలతో సంధిస్తుంటే నాకు ఇక్కడకి రాకుండా ఉంటే బాగుణ్ణు అనిపించింది. వ్రతమహిమ చెప్పిన పెద్దావిడ ఒకసారి సాయిబాబా చరిత్ర పారాయణం చేయించు మీ వదినతో అన్నీ అవే సర్దుకుంటాయి అని సలహా కూడా ఇచ్చింది.
నాస్తికురాలు కాదండీ. దైవ భక్తి, ఆరాధన అన్నీ ఉన్నాయి. అయితే ఇలా నోములు వ్రతాలు అవీ చేయదు అంతే అంటూ పాపం సమర్ధించుకుంటోంది ఈమె. ఆమెని కాపాడాలని నేను నోరు విప్పాను.

" సాయిబాబా చరిత్ర నేను చదివాను. అయితే మిగిలిన పురాణాలు, గీత చదివినట్టు చదివాను. బాబా చరిత్ర నుంచి నాకు అర్థం అయినది ఏమిటంటే - బాబా ఒక యోగి. ఈ ప్రపంచంలో వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పిన యోగిక జీవనం పాటించడం కష్టం కాదు అని ఆచరించి చెప్పిన వ్యక్తి బాబా. ఆ సమయంలో మన దేశాన్ని హిందూ ముస్లిం పేరుతో ముక్కలు చేయాలనుకునే శత్రువుల బారి నుండి కాపాడి, హిందూ, ముస్లిం లు సోదరులు అని తెలపడానికి ఆహార్యం ముస్లిం ది, ఆచరణ హిందువుది చేసి ఇద్దరినీ ఒకేవైపు దృష్టి ని కేంద్రీకరించేలా చేసిన సంఘ సంస్కర్త ఆయన. ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దాం అనే ఆలోచన రావడం తోనే మనం వారికి ఋణ పడతాం. కానీ మనిషికి సహజంగా ఉండే లోభత్వం, స్వార్థం కారణంగా ఆ సహాయం చేయడం దాటవేస్తూ ఉంటాం. అలాంటి వారినుండి డబ్బులు అడిగి తీసుకుని వారిని రుణవిముక్తులని చేశారు. నాట్యం చేస్తూ భజన చేయడాన్ని మించిన ధ్యానం లేదని భక్తులతో ఆటలాడించేవారు బాబా. ఆ సమయంలో ప్రజలని పట్టి పీడిస్తున్న కలరా, మశూచి వంటి వ్యాధులు పాకకుండా, అడవి నుండి ఔషధ గుణాలున్న కట్టెలని తెచ్చి ఎండబెట్టి ధుని వెలిగించి వాతావరణం లోని ఆ బ్యాక్టీరియాని నిర్మూలించిన సైంటిస్ట్ బాబా. మనిషికి కోరికలు లేకపోవడమే అసలైన సంతోషం అని చెప్పడానికి పాడుబడిన మసీదులో ఎటువంటి ఆడంబరాలు లేకుండా జీవనం సాగించారు. మనిషి పరోపకారం కోసం తలుచుకుంటే ఏవైనా చేయగలడు అని లోకానికి చెప్పడానికి నీటితో దీపాలు వెలిగించాడు. వేదాల్లో చెప్పబడినట్లు యోగ సాధన వల్ల శరీరం నుంచి ప్రాణాన్ని వేరుచేయడం సాధ్యమే అని తన శరీరాన్ని కొన్ని గంటల సమయం విడిచి నిరూపించిన మాహా యోగి బాబా. ఇప్పటికీ షిరిడీ లో ఆయన సమాధి నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించే సాధన మనకి ఉండాలే కానీ.
      నేను మొదటి సారి షిరిడీ వెళ్ళినపుడు ఇలాంటి అనుభవమే నాకు కలిగింది. మేము మా స్నేహితులు కలిసి  షిరిడీ వెళ్ళాం. అంతకు కొన్ని రోజుల ముందే నేను ఒక ధ్యాన శిబిరం అటెండ్ చేసి వచ్చాను. ఆ శిబిరంలో మూడు రోజుల మౌనం కూడా ఉంది. ఆ మౌనం నాకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడం వల్ల నేను రోజూ లేచిన దగ్గర నుంచి ఉదయం 9 గంటల వరకు మౌనం పాటించేదాన్ని. తెల్లవారుఝామున వెళ్ళి క్యూ లో నిల్చున్నాం. ఇంచుమించు నాలుగు గంటలు గడిచింది. ప్రధాన మందిరంలోకి ప్రవేశించాం. సాయినాథ్ మహరాజ్ కీ జై అంటూ భక్తులు కదులుతున్నారు. నాతో వచ్చినవాళ్లు ముగ్గురు ముందుకి వెళ్లారు. సరిగా నా దగ్గర క్యూ ఆపారు. బాబా విగ్రహం దగ్గర భక్తులు విసిరిన పువ్వులు, మాలలు శుభ్రం చేస్తున్నారు. అయిదు నిమిషాల పాటు నాకు బాబావారి విగ్రహం ముందు నుంచునే అవకాశం దొరికింది. ఆ ప్రసన్నమైన ముఖం చూస్తూ అలా అప్రయత్నంగా నా కళ్ళు మూసుకున్నాయి. ఇంతలో వెనక ఉన్న ఆవిడ నన్ను తట్టింది. ఇంతదూరం వచ్చి ఇప్పుడు కళ్ళు మూసుకుంటావెంటీ? పువ్వులు, మాలలు ఏవీ తేకుండా వచ్చావా? ఎదిగో ఇది తీసుకో అని తన చేతిలో ఉన్న ఒక గులాబీ గుచ్ఛం నాకు ఇచ్చింది. ఇంతలో నా ముందు పెట్టిన తాడు తీయడం నన్ను జబ్బ పట్టి లాగి బయటకి తోసేయడం జరిగిపోయాయి. బయట మా వాళ్ళు అబ్బా దానికి భలే ఛాన్స్ దొరికింది అనుకుంటూ నాకోసం ఎదురుచూస్తున్నారు. తొమ్మిది అయింది ఇంక ఆ నవ్వు ఆపి మాట్లాడు అని నా భర్త హెచ్చరించారు. (ఆయనకి నా మౌనం ఇబ్బందిగా ఉండేది పాపం). అక్కడే ఉన్న సెక్యూరిటీ అతన్ని ఇక్కడ బాబా సమాధి ఉంటుందిట ఎక్కడ అని అడిగా నాకు తెలియక. అదేంటమ్మా ఇప్పుడు నువ్వు దర్శనం చేసినది అదే కదా? సమాధి మీద విగ్రహం పెట్టారు. ఆ పక్కన ద్వారకామాయి ఉంటుంది అది చూసి వెళ్ళండి అన్నాడు అతను. అప్పుడు కానీ తెలియలేదు భక్తులు బోర్లా పడుకుని మరీ ఎందుకు దణ్ణం పెట్టుకుంటున్నారో. మళ్ళీ ఒక్కసారి వెళ్దాం అన్నా మా వారితో. చాల్లే నాలుగు గంటలు పట్టింది ఇప్పటికే. పోనీ ద్వారకామాయి చూద్దాం అన్నా. అటువైపు వెళ్తే అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. అమ్మో ఇంక ఓపిక లేదు. మధ్యాహ్నం నుంచి లోకల్ గా చూడడానికి బండి మాట్లాడాం. రేపు నాసిక్ అటునుండి మన ట్రైన్. రేపు ఉదయం బయలుదేరేముందు వద్దామ్ లే అని సర్ది చెప్పగా అటునుంచి అలా షాపింగ్ చూసుకుంటూ, ప్రసాదాలు, స్నేహితులకి పంచడానికి బాబా ఫోటోలు అవీ అన్నీ కొనుక్కుని భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుందాం అని రూమ్ కి వెళ్ళాం. తెల్లవారి లేవడం వల్ల, ఎండలో తిరగడం వల్లనేమో నాకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో కల. ఒక వేప చెట్టు ఉంది దాని దగ్గర ఒక గట్టు ఉంటుంది షిరిడీలో. అక్కడ నేను కూర్చున్నా ఒంటరిగా. అక్కడ ఇంకెవ్వరూ లేరు. ఇంతలో నన్ను ఎవరో తట్టినట్టు అనిపిస్తే అటు చూశాను. విగ్రహంలోని ముఖానికి పోలికలు ఉన్న అదే ఆహార్యంలో ఉన్న ఒక వ్యక్తి,  "నా సమాధి చూడలేదు అని బాధ పడుతున్నావ్ గా రా చూపిస్తా" అని నన్ను చేయి పట్టుకుని మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక్క సమాధి ఉంది ఆ విగ్రహం లేదు. ఒక మూల నన్ను తీసుకువెళ్లిన వ్యక్తి(బాబా) నుంచుని, తనివి తీరా తాకు నా సమాధిని, కావాలంటే బోర్లా కూడా పడుకో. నేను అలాగే చేశా. ఏదో ఆనందం. ఆ తరవాత బాబా ద్వారకామాయి కి  కూడా తీసుకువెళ్లాడు. ఆయనే స్వయంగా ధుని, తిరగలి అన్నీ చూపించాడు. ఇంతలో నన్ను తెములు అంటూ నా స్నేహితురాలు నిద్ర లేపింది. కల అయినా ఆ సన్నివేశం నాలో కళ్ళకి కట్టినట్టు కనిపించింది. చాలా కాలం అవన్నీ ఏవో వీడియోలు చూసినట్టు గుర్తువున్నాయి. మర్నాడు ఉదయం లేచి తెమలడం ఆలస్యం అవ్వడం వల్ల మళ్ళీ మందిరానికి వెళ్లకుండానే నాసిక్ వెళ్ళడం, అక్కడ శివాలయంలో నాలుగు గంటలు లైన్ లో నిల్చున్నా దర్శనం అవ్వక ట్రైన్ టైమ్ అవుతోంది అని వెనక్కి వెళ్ళడం జరిగాయి.  రెండు సంవత్సరాల తరవాత మరలా షిరిడీ వెళ్ళిన నాకు సమాధిని, ద్వారకామాయి ని చూసి ఆశ్చర్యం, ఆనందం. కలలో చూసినట్టే ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన డ్రీమ్ అనాలిసిస్ ఇక్కడ తప్పు అయింది. (ఇంతకు ముందు మనం చూసిన లేదా విజువలైజ్ చేసుకున్నవి మాత్రమే కలల్లా కనిపిస్తాయి అంటూ చాలా రకాల సిద్ధాంతాలు రాశాడు. చాలా మంచి పుస్తకం. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవచ్చు.)
భక్తి అనేది బయటకి ప్రదర్శించేది కాదు, ఆ అనుభూతి మన మనసుతో అనుభవించాలి, దేవుని మీద ఉండవలసినది భయం కాదు, నమ్మకం అని నా అభిప్రాయం.
ఇది నా అనుభవం, ఇంకా అభిప్రాయం. ఎవరి మనోభావాలని గాయపరచడానికి రాయలేదని మనవి.