Sunday 6 September 2015

భగవద్గీత

దాదాపు రెండు దశాబ్దాలు గా మహారాష్ట్ర లో నివసిస్తున్నాం. ఈ మధ్య నాగపూర్ కి మారాక మాకు తెలుగు వారి పొరుగు  దొరికింది. ఏదో పండగలకి పుట్టింటికి, అత్తవారింటికి వెళ్లడం, ఆ సమయం లో విడుదల అయిన తెలుగు సినిమాలను చూసి ఆనందించడం తప్ప తెలుగు TV తో కూడా పెద్దగా పరిచయం లేదు. ఉదయం పని చేసుకుంటూ భక్తి పాటలు, భజనలు పెట్టుకుని వాటితో గొంతు కలుపడం నాకు ఒక అలవాటు. ఆదివారం అవడం వల్ల కొద్దిగా హడావుడి లేకుండా ఘంటసాల గారి భగవద్గీత వింటూ నా గాడిద స్వరం(నా పాటలు విని తరించి మా వారు, మా అబ్బాయి ఇచ్చిన బిరుదు లెండి) మధ్య మధ్యలో కలుపుతూ పని చేసుకుంటున్నా.

ఒక మిత్రుడు వాట్సాప్ శుభోదయ సందేశం తో పాటుగా ఏమి చేస్తున్నావ్ ఆదివారం విశ్రాంతా? అని అడగడం తో నా గోడు వినిపిద్దామని "గృహిణి కి ఆదివారం విశ్రాంతి ఎక్కడది నాయనా, రోజు కంటే కాస్త ఎక్కువ పనే ఉంటుంది" అన్నాను. ఏమి చేస్తున్నావ్ అని అడగగానే ఎంతో ఉత్సాహంగా "ఘంటసాల వారి భగవద్గీత వింటూ ఉప్మా పెసరట్టు కి ఏర్పాట్లు చేస్తున్నా. రోజూ డబ్బాల్లో ఎండిపోయిన రొట్టెలు తినే మా వాళ్ళకి రుచిగా చేసిపెడదామని". ఆహా విను విను, వింటూ తిను. ఘంటసాల గారు మంచి రాగాలతో చాలా బాగా పాడారు, మనవాళ్లే దానిని ఆ టైమ్ లో పెట్టి అందం పోగొట్టారు. నాకు ఆదివారం ఇప్పుడే తెల్లారింది. మళ్ళీ కలుస్తా, వస్తా'

ఏ టైమ్? ఏమోలే ఈ గాయకులు (నా స్నేహితుడు సంగీత పరిజ్ఞానం ఉన్న గాయకుడు లెండి), కవులు ఏమి మాట్లాడతారో అంత త్వరగా అర్థం కాదు అనుకుని నా పనిలో నేను పడ్డాను.

ఇంతలో పక్కింటి గాయత్రి గారు పరుగు పరుగున మా ఇంటికి వచ్చి ఏమిటి మీరు చేస్తున్న పని అని ఎంతో కంగారుగా అడిగింది. నాకు అర్థం కాలేదు.
ముందు ఆ టేప్ రికార్డర్ ఆపండి అంది. మీరు బావుంటున్నాయి అన్నారని ఈరోజు సౌండ్ కొంచం 
ఎక్కువ పెట్టాను అన్నాను ఏదో ఘనకార్యం చేసినట్టు. ఒక్క పరుగున వెళ్ళి ఆవిడే ఆపేసింది. 

ఏమైందండీ అన్నా నేను ఏమీ అర్థం కాక. అది పెట్టారెంటండీ అని ఆవిడ సాగదీస్తుంటే నేను వారానికి ఒకటి రెండు సార్లు వింటాను. ఇంచుమించు కంఠస్థం కూడా నాకు అంటున్నా గర్వంగా.
"ఏమిటండీ పొద్దున్నే ఇది? మా బామ్మ గారు, మా వారి బంధువుల మరణాలన్నీ వరసగా గుర్తొస్తున్నాయి. ఎవరు పోయారా అని నేను మా వారు ఇందాకటి నుంచి ఒకటే గాబరా పడుతున్నాం. ఇంకేమీ దొరకనట్టు ఇది పెట్టారు ఏంటి? ఇంక ఉండబట్టలేక నేను వచ్చేసాను"

ఆవిడ వివరించిన తరవాత నాకు అర్థమైంది ఏమిటంటే ఎవరైనా మరణించినపుడు మన రాష్ట్రం లో ఘంటసాల గారి భగవద్గీత లౌడ్ స్పీకర్ లో పెడుతున్నారని. మొన్నెప్పుడో ఊరెళ్ళినపుడు మా అబ్బాయి ఒక చోట షామియానా వేసి ఉంటే అక్కడ ఏమిజరుగుతోంది అని అడిగాడు. ఏదో ఫంక్షనో లేదా ఎవరో పోయారో అన్నారు మా అత్తగారు. భగవద్గీత వినిపిస్తే పోయినట్టా అన్నాను నేను యథాలాపంగా గాయత్రి తో. మీకు అన్నీ వేళాకోళమే, నాకు చాలా పని ఉంది అంటూ వెళ్లింది గాయత్రి.

పని చేస్తున్నానే కానీ ఆలోచన ఆగట్లేదు. 'ఆ టైమ్ లో పెట్టి' అన్న స్నేహితుని మాట కూడా ఇప్పుడు అర్థం అయింది నా మట్టి బుర్రకి. భగవద్గీత లోని సారం అందరికీ తెలియాలని, పామరులు కూడా సులభంగా అర్థం చేసుకోవాలని కొందరు మహానుభావులు చేసిన ఈ మహత్కార్యం ఇలాంటి స్థితికి వచ్చిందని నాలో నేను బాధ పడ్డాను.
ఒక శ్లోకం " పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జనియించకా తప్పదు. అనివార్యం అయిన మరణం గురించి చింతించటం వలదు" అని ఉన్నంత మాత్రాన భగవద్గీతని ఇలా వాడుకోవడం ఎంతో బాధ కలిగించింది. అనారోగ్యం తో బాధ పడుతూ కూడా అది ఎలాగైనా పూర్తి చేయాలని ఎంతో శ్రమించారు ఘంటసాల గారు అని ఎక్కడో చదివాను. ఇది ఇలాగే సాగితే తెలుగు వారు అందరూ విని తీరవలసిన ఘంటసాల భగవద్గీత అస్థిత్వం కోల్పోతుందేమో అనే భయం వేస్తోంది.

* * * * * * * * * * * * * * * * * *

ఇది రాసి పక్కకి పెట్టి కొద్దిగా దృష్టి మరల్చాలని ఈమధ్యనే పెట్టించిన డిష్ టి‌వి ఆన్ చేసాను. ఏదో సినిమా చివరి ఘట్టం. కథానాయిక మరణించింది. "అశతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతమ్గమయ" అని చూసి ఆశ్చర్యం కలిగింది. 'మృత్యోర్మా' అని వుందని ఉపనిషద్ లోని ఈ శ్లోకాన్ని కూడా చావుతో ముడి పెట్టారా అని. అప్పుడు నాకు అనిపించిన విషయం ఏమిటంటే ఘంటసాల భగవద్గీతని చావు కి ఆపాదించిన పుణ్యం కూడా మన టాలీవుడ్ దే అయి ఉండొచ్చు అని. ఎందుకంటే కొన్ని సినిమాల్లో విన్న, చూసిన గుర్తు వస్తోంది. కారణం ఏదైనా ఈ విషయం మాత్రం ఆలోచించవలసినదే.

ఇది ఎవరినీ బాధ పెట్టాలని రాసినది కాదు. భగవద్గీతని లక్ష్య గ్రంథం, రామాయణ మహాభారతాలను లక్షణ గ్రంథాలు అంటారు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే భగవద్గీతని చదవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి లక్షణాలు మనకి ఉండాలో ఎలాంటివి ఉండకూడదో తెలుసుకోవడానికి రామాయణ, మహాభారతాలు చదవాలి. ఈ బిజీ ప్రపంచం లో చదవడానికి సమయం లేకపోయినా  సులభమైన భాష లో అర్థం అయ్యేలా వివరించే ఘంటసాల వారి భగవద్గీత ని వినండి, పిల్లలకి వినిపించండి.