Wednesday 4 May 2016

అమ్మ రుణం తీరేదా?

అమ్మని కోల్పోయి ఈరోజుకి నాలుగు సంవత్సరాలు అయ్యాయి. ఇన్ని ఏళ్ళు అమ్మ లేకుండా ఎలా గడిచిందా అని ఆలోచిస్తే ఆశ్చర్యం తప్ప సమాధానం దొరకలేదు.

నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు నాకు అనుక్షణం గుర్తు వస్తూ ఉంటాయి. అమ్మ అనారోగ్యం నన్ను చాలా బాధించేది. అమ్మని త్వరగా తీసుకుపొమ్మని దేవుణ్ణి  ప్రార్థించిన రోజులు కూడా ఉన్నాయి. కొడుకుని అని ఏమో అక్క, చెల్లాయి కంటే అమ్మ నన్ను కొంచం ఎక్కువ ప్రేమించేది అనిపిస్తుంది నాకు.  ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉంటూ సెలవలకి అమ్మ దగ్గరకి వెళ్లినప్పుడు ఎంతో శ్రమకోర్చి నాకు ఇష్టమైనవి అన్నీ చేసిపెట్టేది. అలాంటి అమ్మ  ఇంత అవస్థ పడడం నాకు చాలా కష్టం తోచేది. పని మనుషులు ఉన్నా దగ్గర ఉండి అమ్మ అవసరాలని చూసుకోవడంలో ఆనందం ఉండేది.  అమ్మ నా పసితనంలో నాకు చేతకాని నా అవసరాలు ఎలా తీర్చిందో అలాగే నాకు వచ్చినట్లుగా ఆవిడ అవసరాలు తీర్చేవాడిని. మగవాడివి ఇవన్నీ నువ్వెందుకు చేయడం పెండ్లి చేసుకోమని బంధువులు సలహాలిచ్చినా ఏనాడూ పట్టించుకోలేదు.



అలాంటి నేను ఒక దుర్దినాన పరిస్థితులకు లొంగిపోవడం వల్లో, నా లోని ఓపిక తగ్గిపోవడం వల్లో లేదా నా దురదృష్టం వల్లో కొంతమంది స్నేహితుల సలహాతో అమ్మని కాకినాడలోని వృద్ధాశ్రమానికి తీసుకుని వచ్చాను. అక్కడి ఫార్మాలిటీలు అన్నీ పూర్తి అయ్యాకా అక్కడ పనిచేసేవారు 'మేము చూసుకుంటాం మీరు వెళ్లిరండి' అని అనగానే నాకు ఉన్నట్టుండి నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది.  " అదేంటి! అమ్మదగ్గర ఎవ్వరం ఉండకుండా వెళ్లిపోతున్నాం. నేను కానీ, అక్క లేదా చెల్లి కానీ ఉండాలి కదా! నేను వెళ్లిపోవడం ఏమిటి, ఇక్కడ ఉండాలి. అమ్మకి ఏదైనా అవసరం వస్తే? 'బాబూ' అని పిలిస్తే? ఇదేంటి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నాను. సెలవు లేకపోతే, ఉద్యోగం పోయేలా ఉంటే మాత్రం ఇలా వదిలేసి వెళ్లిపోదామని ఎందుకు అనుకున్నాను?" రకరకాల ప్రశ్నలు, బుర్రలో ఏవేవో ఆలోచనలు, ఏమిచేయాలో తెలియని పరిస్థితి. తీసుకున్న ఈ నిర్ణయం సరి అయినదేనా అని అనుమానం.
స్నేహితుని ఇంట్లో ఆ రాత్రి పడుకున్నా కానీ ఒక్క క్షణం కునుకు పడితే ఒట్టు. అమ్మకి నిద్ర పట్టిందో లేదో, మందులు వేశారో లేదో, ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడని ఆక్రోశంతో ఉందో, పోనీలే ఎన్నాళ్లని కష్టపడతాడు అని జాలి పడుతోందో, ఆవిడ మనోభావాలు ఎలాఉన్నాయో అనే కలవరం తోనే తెల్లారింది.

నా ఆలోచనలనుంచి తప్పించాలని అనుకున్నాడో, నా బాధ చూడలేకపోయాడో తాను వెళ్తున్న పనికి నన్ను తోడు తీసుకెళ్ళాడు నా మిత్రుడు. అమ్మని చూసి వెళ్దాం అనుకున్నా కానీ, పని అయ్యి రాగానే వెళ్దాంలే అని స్నేహితునితో వెళ్ళాను. దారిలో ఉండగానే ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఇక నాకు లేదనే వార్త నేను జీర్ణిచుకోవడం తప్ప నాదగ్గర వేరే దారి లేదు.
ఎవరో చెప్తున్నారు నేను చేస్తున్నా. మంత్రాలు చెవిని చేరుతున్నాయి కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతోంది. " అమ్మ లేకుండా నేను ఉండాలి అనే దుఃఖం, అమ్మ అనే ధైర్యం కోల్పోయాను అనే భయం, చివరి సమయంలో దగ్గర ఉండలేకపోయానే అనే బాధ, ఇదే మరణం అమ్మకి రెండురోజుల ముందు ఇవ్వొచ్చు కదా అని దేవుని మీద కోపం"

రోజులు, నెలలు సంవత్సరాలు గడిచినా ఈ సంఘటనలు మరుపుకి రావు. పిన్ని లోనూ, మేనత్త లోనూ అమ్మని చూసినా అమ్మ అమ్మే కదా!

చివరి రోజుల్లో అమ్మని చూసుకున్న ఆ వృద్ధాశ్రమానికి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఇప్పటికీ నాకు చేతనైన సాయం పెద్దవారికి చేస్తూనే ఉంటాను కానీ నాలోని ఆ లోటు నాతో జీవితాంతం ఉండవలసినదే.


ప్రస్తుత సమాజం ఆలోచన ఎలా ఉంది అంటే వృద్ధాశ్రమంలో ఉన్నవారి అందరి  కొడుకులు- కోడళ్ళు దుర్మార్గులు. ఫేస్ బుక్ లలో వాటిల్లో కూడా ప్రతీ కొడుకు తల్లి తండ్రులని మర్చిపోయి బ్రతుకుతున్నట్టే ఎన్నో పోస్ట్ లు ప్రచారంలో ఉన్నాయి. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు కొందరు పెద్దవారు కూడా పిల్లలతో అడ్జస్ట్ అవ్వలేక ఆశ్రమాలని ఆశ్రయిస్తున్నారు. ప్రతీవారికి వారి స్వతంత్రం ముఖ్యం కానీ అది వేరే వారి స్వతంత్రాన్ని చంపి లాక్కోవలసిన అవసరం లేదు కదా. ఎంతో మంది వేరే దారి లేక ఆశ్రమానికి పంపించి ఉండవచ్చు.  పరిస్థితులను అధికమించలేని సమయంలో మాత్రమే పిల్లలు తల్లి తండ్రులని వృద్ధాశ్రమానికి పంపుతారు. వృద్ధాశ్రమం లోని వారి కొడుకులు అందరూ దుర్మార్గులు, మనసు లేనివారు అనుకోవడం తప్పు. చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కోట్లు సంపాదించాలని, వేరే దేశంలో ఉంటేనే వాళ్ళకి గౌరవం అని భావించే వారు చాలామంది తమని తామే వృద్దాశ్రమాలకి చేరుకునే బాట వేసుకుంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకీ పెరిగే వృద్ధాశ్రమాల సంఖ్య, వాటిలో చేరే, చేర్చబడే వారి సంఖ్య పెరగడం శోచనీయం. 

ఒక స్నేహితుని అనుభవం, నా అభిప్రాయం తప్ప ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదని మనవి.