Tuesday 27 January 2015

పిల్లలు - గణతంత్రదినం




   అమ్మా, నాకు 300 రూ. ఇస్తావా? రేపు ఫ్రెండ్స్ ఒక పది మంది కలసి పార్టీ చేసుకుని అటునుంచి ఒక దేశభక్తి సినిమా వచ్చింది అది చూద్దాం అనుకుంటున్నాం అని గారంగా అడిగాడు మా అబ్బాయి. విశేషం ఏమిటో అని అడిగాను తెలీక. నీకు తెలియదా రేపు రిపబ్లిక్ డే. ఓహో రిపబ్లిక్ డే కి కూడా పార్టీలు చేసుకుంటున్నారా ఈ మధ్య అనే సందేహం వెలిబుచ్చాను. ఇది మామూలు రిపుబ్లిక్ డే కాదమ్మా. ఒబామా వస్తున్నాడు నీకు తెలియదా? ఇది చాలా స్పెషల్ రిపబ్లిక్ డే. ఎంతో ఉత్సాహంగా, ఒబామా వస్తున్నందుకు ఎన్ని వందల సి‌సి కెమెరాలు పెట్టారు, ఒబామా కార్ ఎలాంటిది, దాని విశేషాలు, దాని ప్రత్యేకతలు, జరుగుతున్న ఏర్పాట్లు అన్నీ గుక్క తిప్పుకోకుండా ఎంత విశేషమైన రిపబ్లిక్ డే అనే విషయం చెప్పాడు మా వాడు. నాకు కూడా ఎందుకో అంత స్పెషల్ రేపబ్లిక్ డే వాళ్ళతో గదుపుకుందామని బుద్ధి పుట్టింది. రేపు కాలేజీ లో జండావందనం అయ్యాకా మీ ఫ్రెండ్స్ ని బ్రేక్ ఫాస్ట్ కి  ఇంటికి పిలు. ఇడ్లీ వడ చేస్తా. సరదాగా గడిపి అప్పుడు సినిమా చూసి వద్దురుగాని అన్నాను. సౌత్ ఇండియన్ అంటే ఈ మహారాష్ట్ర వాళ్ళు పది కాదు పాతిక మంది వస్తారు మన ఇంటికి. పాతిక వద్దులే బాగా దగ్గర స్నేహితులని ఒక 8 – 10 మందిని పిలు. జండా వందనం ఎన్ని గంటలకి కాలేజీలో అడిగాను ఏర్పాట్లు చేసుకుందామని. ఏంటమ్మా ఇంకా జండావందనాలకి ఏమి వెళ్తామ్ చెప్పు. స్కూల్ లో అంటే తప్పేది కాదు. ఇప్పుడు కాలేజీ కి వచ్చేసాం అమ్మా. ఏదో ఎన్‌సి‌సి వాళ్ళు ఎన్‌ఎస్‌ఎస్ వాళ్ళు వెళ్తారు తప్ప మేము వెళ్లము. ఈరోజంతా నాకు అశ్చర్యాలే కాబోలు అనుకుని అయితే అందరినీ ఎనిమిది గంటలకి రమ్మని చెప్పు అని పప్పులు నానబెట్టే పనిలోకి వెళ్ళాను.
       త్వరగా అన్నీ వండి, సర్ది ఉంచేలోపే ఒక్కొక్కరూ రావడం మొదలు పెట్టారు ఎనిమిది కాకుండానే. వస్తూనే అందరూ విష్ చేసుకుంటూ నాకు కూడా హాపీ రిపబ్లిక్ డే ఆంటీ అని విష్ చేశారు. అందరూ తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే నాకు కూడా ఆనందం వేసింది. వాళ్ళ సంభాషణలు కొంత నవ్వు కూడా తెప్పించేవిగా ఉన్నాయి. ఏరా నేను రిపబ్లిక్ డే విష్ పెడితే లైక్ చేయలేదేంట్రా ఫేస్ బుక్ లో అని ఒకడు అన్నాడు. వాడు దానికి ఎందుకు చేస్తాడురా సన్నీ లియోన్ అయితే చేసేవాడు. బొత్తిగా దేశభక్తి లేకుండా పోతోందిరా అన్నాడు ఇంకొకడు. నా విష్ కి ఒక గంటలో వంద పైన లైకులు వచ్చాయి తెలుసా అంది ఒక అమ్మాయి. నీ ఫ్రెండ్స్ అందరూ దేశభక్తులు మరీ అన్నాడు ఇంకో కుర్రాడు. ఇలా వాట్సెప్ ఫేస్ బుక్ కబుర్లే ఎక్కువ ఉన్నాయి.
      సామాన్లు సర్దడానికి నాకు సహాయం చేస్తూ చాలా బాగా చేశారు ఆంటీ, అయినా ఇంత మందికి ఎలా చేశారు మీరు నేను తమ్ముడికి మాగీ చేసి పెట్టడానికే అలసిపోతాను అంది ఒక అమ్మాయి. నాకు ఇలా తినిపించడం సరదా అమ్మా అన్నాను నవ్వుతూ. నువ్వు లక్కీ రా అని పొగిడారు అందరూ, దానికి కొంత గర్వంగా ఫీల్ అయ్యాడు మా అబ్బాయి. సరే కానీ రిపబ్లిక్ డే అంటే ఏంటో ఎవరైనా చెప్తారా అని అడిగా ఏదో వాళ్ళతో మాటలాడాలి కదా అని. వాళ్ళు చెప్పిన సమాధానాల్లో కొన్ని షాక్ తెప్పించినవి ఇస్తున్నా మీకోసం. బంగ్లాదేశ్ ఇండియా నుంచి విడిపోయిన రోజు, స్వతంత్రం ఆగష్టులో వచ్చింది రిపబ్లిక్ ఈ రోజు వచ్చింది, గాంధీగారు పోయిన రోజు అనుకుంటా..... ఇలాంటి సమాధానాలు విని ముందురోజు ఆశ్చార్యానికి మించినది ఏదో కలిగింది నాకు. ఈలోపు ఒకడు ఒన్ సెక్ ఆంటీ ఇప్పుడే చెప్తా అని మొబైల్ తీస్తున్నాడు. వద్దులే బాబు గూగుల్ చేయొద్దులే ఇప్పుడు అని మా అబ్బాయి ని అడిగా పోనీ నువ్వు చెప్పారా నీకు తెలుసు కదా అని. ఇండిపెండెన్స్ డే గుర్తుంది కానీ ఇది గుర్తు లేదు అన్నాడు కొద్దిగా సిగ్గు పడుతూ. అందేంటి మీ అందరికీ ఏడవ తరగతిలో సోషల్ స్టడీస్ లో ఒక పాఠం ఉంది కదా అని అడిగాను. ఎప్పుడో చిన్నప్పటివి ఏమి గుర్తు పెట్టుకుంటాం ఆంటీ అని నేను చూసిన చూపుకి నాలుక కరుచుకున్నాడు ఒక కుర్రాడు. అదేంటిరా నువ్వు స్పీచ్ కూడా ఇచ్చావ్ కదా గుర్తులేదా అన్నాను కొంచం గొంతు పెంచి. మీ వాడికి కొంచం ఎదగమని చెప్పండి ఆంటీ, అన్నిటికీ అమ్మ చెప్పింది అంటూ ఉంటాడు. మొన్న సిగ్నల్ బ్రేక్ చేస్తే ఒక ఏభై పోలీసు కి కొడితే సరిపోయే దానికి పావు గంట టైమ్ వేస్ట్ చేసి దానికీ, ఇంకా లైసెన్స్ మర్చిపోయాడని దానికి 250 రూ. ఇచ్చాడు. పైగా అమ్మ చెప్పింది అన్నాడు కూడా. సిగ్నల్ ఎందుకు బ్రేక్ చేయాలి అని అడిగా కొంత అసహనంతో. టైమ్ ఈజ్ మనీ ఆంటీ అన్నాడు ఆ అబ్బాయి. ఎదురుగా వస్తున్న బండి గుద్దెస్తే అనగానే చాన్సే లేదు ఆంటీ ఐదు సంవత్సరాలనుంచీ బండి నడుపుతున్నాను. అతనితో ఇంకా మాట్లాడడం అనవసరం అనుకున్నా నేను.
       పోనీ లెండి. ఇప్పుడు టి‌వి లో ఒబామా పాల్గొనే ఉత్సవాలు వస్తాయి అది చూడండి అందరూ, నేను హోటల్ కి లంచ్ ఆర్డర్ ఇస్తా, తినేసి అప్పుడు సినిమా చూసి వద్దురుగాని అన్నాను. పోనీలే ఏదో క్లాస్ పీకినా మంచి ఆఫర్ ఇచ్చింది అనే ఒక తృప్తి కనబడింది వాళ్ళలో. టి‌వి పెట్టగానే ఒకడు అన్నాడు ఏముందిరా జండా ఎగరేస్తారు, మోదీ స్పీచ్ ఇస్తాడు అంతే కదా అని. అయినా మోదీ స్పీచ్ బావుంటుందిరలే, మొన్న అమెరికా, ఆస్ట్రేలియా దీ ఇంకా ఇండిపెండెన్స్ డే ది విన్నాను బావున్నాయి. ఇంకోడు అంటాడు లేదు ఒబామా వచ్చాడుగా ఏవో స్పెషల్ గా ఉంటాయి అన్నాడు చూద్దాం అన్నట్టుగా. దూర్ దర్శన్ లో కార్యక్రమం మొదలు అయింది. చక్కటి వ్యాఖ్యానం తో చూడ ముచ్చటగా ఉంది కార్యక్రమం. మెల్లగా ఈ పిల్లలందరిలోనూ కూడా ఆసక్తి కనబడింది నాకు. ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న అమరవీరుల సతీమణులు, మన భిన్న సంస్కృతులను తెలుపుతూ వచ్చిన శకటాలు, రకరకాల విన్యాసాలు అన్నీ చూసిన పిల్లల్లో ఒక రకమైన సంతోషం చూసాను. జాతీయ గీతం రాగానే అప్రయత్నం గా నుంచున్నారు అందరూ. చానల్ మార్చకుండా మూడు గంటల పాటు ఒక కార్యక్రమం చూడడం ఇదే మొదటి సారి కదా అనగానే అవును కదా అని ఆశ్చార్యానికి లోనవడం వాళ్ళ వంతయింది ఇప్పుడు. జండా వందనానికి వెళ్ళడం అంటే సమయం ఎక్కువ అయి కాదు. మనకోసం తమ ప్రాణాలు అర్పించిన వీరులకి మన దేశానికి వందనం తెల్పడం. అది ఒక గౌరవం తెలిపే పద్ధతి. మీకు ఏదైనా సందేహం వస్తే ఏమి చేస్తారు ఇంటర్నెట్ లో చూసుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఒక పది నిమిషాలు ఇస్తాను మీ గూగుల్ ఆంటీ ని అడిగి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసుకోండి. ఇంకో పావు గంటలో భోజనం వచ్చేస్తుంది.
          అందరూ రకరకాల సైట్స్ వెతికి మరీ చదువుకున్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ సంబాషణ కొంచం తృప్తినీ కొంచం ఆనందాన్నీ ఇచ్చింది. ఒక అబ్బాయి వాళ్ళ తాతగారికి ఫోన్ చేసి తాతా నేను ఇప్పటివరకూ రిపబ్లిక్ డే ప్రోగ్రాం చూసాను. సారీ తాతా, నువ్వు ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. చాలా బాగున్నాయి. ఇంకో గంటలో ఇంటికి వస్తాను అప్పుడు చాలా కబుర్లు చెప్పుకుందాం అన్నపుడు నాకు కలిగిన తృప్తి మాటల్లో వివరించలేను. సినిమా కి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం రా మా చెల్లికి రేపబ్లిక్ డే గురించి చెప్పి యూ ట్యూబ్ లో కార్యక్రమం చూపిస్తా. అందరూ ఇలాగే సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు.
       ప్రతి వాళ్ళు ఈ యువతరం పాడు అయిపోయింది అని ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పేముంది పాపం. వాళ్ళకి అందుబాటులో ఉన్నవి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళతో గడపడానికి వాళ్ళకి విలువలు నేర్పడానికి పెద్దవాళ్లకే తీరిక లేని బిజీ ప్రపంచం లో ఉన్నాం. ఆఫీసు నుంచి వచ్చాక కొంచం సమయం టి‌వి చూసుకోవాలని ఉండే వాళ్ళు కొందరైతే, పిల్లలు మన మాట ఎలాగూ వినరు అనే నిర్ణయానికి వచ్చేసినవాళ్లు కొందరు. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఇల్లు ఆఫీసు తప్ప వేరే దేనికీ సమయమే ఉండదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంటి పని, టి‌వి సీరియల్ తోనే సరిపోతుంది. యువతరం ఏది నేర్పినా నేర్చుకోవడానికి సిద్ధం గా ఉంటారు. వాళ్ళ కోసం మనమే కొంచం సమయం కేటాయించాలి. చెప్పే రీతిలో చెప్తే అందరూ నేర్చుకుంటారు. మొదటిసారి సిగ్నల్ బ్రేక్ చేసినపుడు ఎవరికో ఒక పెద్ద వాళ్ళకి చెప్పే ఉంటాడుగా ఆ కుర్రాడు. అప్పుడు అలా చేయకు అని, చేసినా ఫైను కట్టు అని అతనికి అర్థం అయ్యేలా చెప్పి ఉంటే అతని పద్దతి ఇలా ఉండేది కాదేమో కదా? యువతరానికి దగ్గర అవుతున్న, వాళ్ళను ఆకర్షిస్తున్న ప్రస్తుత ప్రధాన మంత్రి చేసే ప్రయత్నం సఫలం అవ్వాలంటే మనం అందరం ఒక చేయి వేయవలసినదే. వాళ్ళలో మంచి విలువలు పెంపొందించవలసినదే. ఏమంటారు మీరు కూడా మీ పిల్లలతో స్నేహం పెంచుకుందాం అనుకుంటున్నారా? లేదా గూగుల్ పిన్నిని రిపబ్లిక్ డే ఎందుకు ఎలా వచ్చింది అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నారా?  చెప్పండి.
ఒబామా రావడం వల్ల చాలా మంది యువకులకి రిపబ్లిక్ డే మీద ఆసక్తి కలిగింది. భారత ప్రధానికి, అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు.

ఇది నా అనుభవం ఇంకా నా  అభిప్రాయం మాత్రమే. ఎవరినీ నొప్పించడానికి ఇది రాయలేదు అని మనవి.


Monday 26 January 2015

నా పరవాన్నం పాట్లు



     రథసప్తమి కదా అని ఉదయాన్నే పాలు పొంగించాను. సూర్యభగవానునికి చూపించి తిందామని ఆశ. మాది తూర్పు ముఖ ద్వారం ఉన్న అపార్టుమెంటు కానీ సూర్యుని దర్శనం 12 గంటలు అయితే కానీ కాదు. సరే మనమే సూర్యుని కనిపించే వైపు వెళ్తే సరి అని వేడి వేడి గిన్నెతీసుకుని పదకొండు అంతస్థులు ఎక్కి పైకి వెళ్తే అక్కడ తలుపులు మూసి ఉన్నాయి. సొసైటి ఆఫీసులో అనుమతి తీసుకుందామని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఏమి పనో వివరిస్తూ ఒక అర్జీ పెట్టుకుంటే తలుపు తీస్తాం అన్నారు. పోనీలే ఈ తంటాలు ఎందుకు అని కిందనుండి నుండి ఎక్కడైనా సూర్యభగవానుని దర్శనం కాకపోతుందా అని ఆ గిన్నె పట్టుకుని వెతికాను. చూడొస్తే చాలా దూరం నడిస్తే లేదా బండి తీస్తే కానీ సూర్యుని దర్శనం కనిపించే అవకాశం లేదు. ఈలోపు ఇంకో ఉపాయం తట్టింది. మా ఎదురి ఫ్లాట్ బాల్కనీ లోంచి సూర్యుడు కనిపించచ్చు అని వారి తలుపు తట్టాను. ఎదురెదురు గుమ్మమే కానీ ఈ సంవత్సరం కాలం లో నన్ను ఆవిడ, ఆవిడని నేను ఏదో ఒకటో రెండో సార్లు లిఫ్ట్ లో ఒకళ్లని ఒకరు చూసుకున్నామేమో. తలుపు తీసిన ఆమెకి నేను మీ ఎదురుగా ఆ నాలగు అడుగుల దూరం లో ఉన్న ఆ ఇంట్లో ఉంటాను అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నవ్వనా వద్దా అన్నట్టు ఒక చిన్న నవ్వు నవ్వింది ఆవిడ.
        ఆవిడకి అర్థం అయ్యేలా నా పాట్లు చెప్పి మీ బాల్కనీ లోంచి ఒక్కసారి సూర్యుడిని చూసుకోనా అని బ్రతిమాలి వెళ్తే అక్కడ కూడా సూర్యుని దర్శనం కాలేదు ఎందుకంటే ఈలోపు పదకొండు గంటలు దాటిపోయింది. అప్పటికే ఇంట్లో వాళ్ళు సూర్యుడు అక్కడ ఉన్నాడు నీకు కనిపించినా లేకపోయినా తూర్పు వైపు తిరిగి నైవేద్యం పెట్టేసుకో అని సలహాలు పడేసారు. ఈలోపు నా వంటగది కిటికీ లోంచి నెత్తిమీదకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. హమ్మయ్య అనుకుని నైవేద్యం పెట్టి గాజు కప్పుల్లో పరవాన్నం వడ్డించా అందరికీ.
        మా చిన్నప్పుడు అమ్మ తులసి కోట దగ్గర ఆవుపేడతో చేసిన  పిడకలతో పొయ్యి పెట్టి దానిలో ఇత్తడి గిన్నెతో పాలు పెట్టేది. అవి పొంగి పొయ్యిలో పడేవి. అయ్యో అమ్మా పొంగిపోతున్నాయి అంటే అగ్నిహోత్రుడికి అనేది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ పొయ్యి లో పడితే షాక్ కొడుతుందేమో లేదా అది పాడు అవుతుందేమో ఓనరు ఏమంటాడో అని భయం. పాలు అగ్నిహోత్రుడు కొన్ని తాగాకా అమ్మ బియ్యం వేసేది. అది బాగా ఉడికే వరకూ మాకు ఆత్రం పెరుగుతూ ఉండేది. ఈ లోపు అమ్మ చిక్కుడుకాయలు పుల్లలు పెట్టి రథాలు చేసేది. ఈ రోజునుండి సూర్యుడు రథం మీద ప్రయాణం మొదలు పెడతాడు అంటే మనకి ఎండలు పెరుగుతాయి ఇక్కడ నుంచి అని. అందరినీ నెత్తి మీద జిల్లేడి ఆకు రేగుపండు పెట్టుకుని స్నానం చేయమనేది అలాగే చేసేవాళ్లం. ఇప్పుడు పిల్లలకి చెప్తే let me google it mom అన్నారు. అది ఎందుకో తెలిస్తే కానీ చేయరుట. మేము ఎప్పుడూ ఇలా అన్నట్లు గుర్తు లేదు. పెద్దవాళ్ళు చెప్పారు చేయాలి అనుకునేవాళ్లం. పిల్లలు విజ్ఞాన వంతులు అవుతున్నారు అని సంతోషించడమే. బాగా ఉడికాక అందులో బెల్లం వేసి ఇంకా ఉడికించేది అమ్మ బాగా పాకం వస్తుందని. ఇప్పుడు బెల్లం వేస్తే పరవాన్నం విరిగి చక్కా పోతుంది. పొయ్యి మీదనుంచి దింపి ఒక్క పది నిమిషాల తరువాత పొడి చేసిన బెల్లం వేస్తే విరగదు అని టి‌వి వంటల్లో సలహా ఇచ్చారు లెండి ఒక సారి. వేడి వేడి పరవాన్నం చిక్కుడాకుల్లో పెట్టి తినడానికి ఇచ్చేది అమ్మ. ఎంత రుచిగా ఉండేదో ఆ పరవాన్నం. రోజంతా తరిగిన కూర తినకూడదని తరగకుండా వన్డే కూరలని వండి భోజనం చేసేవాళ్లం. ఏది ఏమైనా పూర్వం రోజులలో పండగల సందడే వేరు. ఈ మహా నగరాల్లో ఏదో మనసు పీకడం వల్ల విధానాలని పరిస్థితులకు తగినట్టు కుదించేసుకుని వాడేసుకుంటున్నాం. పండగ మేము కూడా చేసుకున్నాం అనేసుకుంటున్నాం.
        


Sunday 25 January 2015

మా'నవ'త్వం

శర్మ గారు ఆయన స్నేహితులు ప్రక్క ఊరిలో పని ముగించుని వస్తున్నారు. సమయం దాదాపు రాత్రి పదకొండు కావస్తోంది. ఏదో అడ్డు వచ్చినట్లు అనిపించి శర్మ గారు కారు ప్రక్కకి ఆపారు. కారు లైట్ల కాంతిలో ఒక మోటారు సైకిలు, దాని ప్రక్కనే స్పృహ తప్పిన ఒక వ్యక్తిని గమనించారు. శర్మగారి స్నేహితుడు "మనకెందుకండీ, పోలీసులతో లేనిపోని గొడవలు. పదండి అసలే అర్థరాత్రి కావస్తోంది. పోలీసులకి కానీ, అంబులెన్స్ కి కానీ ఫోన్ చేస్తే పోలా.!. దారిన పోయేదేదో తలకి చుట్టుకున్నట్టు రేపటి నుంచి మనకి పోలీసు స్టేషన్ లు కోర్టులు"...

"అది కాదండీ చాలా రక్తం పోయింది ఇంకా ఊపిరి ఆడుతోంది. త్వరగా ఆసుపత్రి కి తీసుకువెళ్తే బ్రతకచ్చు. సాయం పట్టండి కారులో కూర్చోపెడదాం. ఊళ్ళోకే వెళ్తున్నాం కనుక ఆసుపత్రిలో చేర్చి వెళ్దాం. కారు నాదే కనుక బాధ్యత నేను తీసుకుంటాను" ..అనగానే ఇద్దరూ సాయం పట్టి కారులో పడుకోపెట్టారు.

"అన్నట్లూ, ఒక కొత్త చట్టం (లా) వచ్చింది రాజుగారు ఇప్పుడు ఏక్సిడెంట్ అయిన వాళ్ళని నిర్భయంగా ఆసుపత్రికి చేర్చవచ్చు. అతని జేబులో మొబైల్ తీయండి వాళ్ళ ఇంటికి సమాచారం అందించవచ్చు" అన్నారు శర్మగారు కారు నడుపుతూ. జేబులు వెతకగా మొబైల్ ఫోను కానీ, పర్స్, డబ్బులు కానీ ఏవీ లేవు. ఆశ్చర్యం తో "చూసారా రాజు  గారూ ఎవరో ఇతని స్పృహ కోల్పోవడాన్ని అవకాశంగా తీసుకుని డబ్బులు, ఫోన్ కాజేసివుంటారు. మంచితనానికి రోజులు లేవు. సహాయం చేయక పోగా అవకాశాన్ని వాడుకున్నారు. ఈ ప్రపంచం ఎటు పోతుందో అంతుపట్టకుండా ఉంది".


అతనిని ఆసుపత్రి లో చేర్చి సోనీ చానెల్ లో సి..డి. లాగా జేబులో దొరికిన దర్జీ రశీదు, అతని బండి నంబరు ఆధారంగా అతని కుటుంబ సభ్యులకి సమాచారం అందించి, ప్రభుత్వ ఆసుపత్రి లో శర్మగారి అడ్రసు ఫోన్ నెంబర్ ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి తెల్లారింది. రెండు రోజుల తరువాత శర్మగారికి ఫోన్ వచ్చింది. మీరు ఆసుపత్రి లో చేర్పించిన ఆయన బావమరిదిని సర్. మా బావగారిని కాపాడినందుకు కృతజ్ఞతలు. మా బావ మీతో మాట్లాడుతా అంటున్నాడండి. ఇప్పటికైనా తాగుడు మానమని కొంచెం చెప్పండి అని పేషెంట్ కి ఫోన్ ఇచ్చాడు. అయ్యా నన్ను బ్రతికించారయ్య. మీ రుణం తీర్చుకోలేనయ్యా. చాలా థాంక్స్ అయ్యా. ఇంతకీ నేను ఎలా పడ్డానండి. ఎక్కడ పడ్డానో కూడా గుర్తు రావట్లేదండి. శర్మగారు అతను ఎక్కడ పడి ఉన్నాడో, ఎలాంటి స్థితిలో ఉన్నాడో వివరించారు. అసలు ఆ వైపు నేను ఎందుకు వెళ్లానండీ?


ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అతను తాగిన మైకం లో ఇల్లు మర్చిపోయి ఇంకో ఇరవై కిలోమీటర్లు వెళ్ళి అక్కడ దేనినో గుద్దుకుని పడ్డాడు. ఇది విన్న శర్మగారు నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు.



తాగుడు వల్ల వచ్చేనష్టాలని ప్రక్కన పెడితే, గాయాలతో పడి ఉన్న వ్యక్తిని కనీస బాధ్యతగా ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం ఆశ్చర్యం. ఎదుటి వారికి సహాయం చేయాలని ఉన్నా మనిషిలో భయం. పోలీసులు అంటే మన రక్షక భటులు; మనల్ని కాపాడే వాళ్ళు. కానీ మనకి వాళ్ళంటేనే భయం. దొంగకి భయపడం కానీ పోలీసు కనిపిస్తే భయం. రోడ్డు పై ట్రాఫిక్ పోలీసుని చూసినా భయమే. మన దగ్గర అన్నీ కాగితాలూ సరిగ్గా ఉన్నా ఆపి ఏదో వంకన డబ్బులు అడుగుతాడని భయం. ఎవరో కొంత మంది అవినీతి పోలీసులు ఉన్న మాట వాస్తవం. అలా అంటే అన్ని రంగాలలోనూ అవినీతి పరులు ఉన్నారు. కానీ ఒక మంచి పని చేయడానికి, ఒక ఆపదలో ప్రాణం పోయే స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి కూడా మన మనసులో మొదట కలిగేది పోలీసు భయం. వాళ్ళతో మనకి ఎందుకు ఇబ్బంది కలుగుతోంది? రక్షించ వలసిన వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడుతున్నాం? ఎప్పటికి మారుతుంది ఈ సమాజం?

Friday 23 January 2015

అదే ప్రేమంటే.......

ఏమి చెప్పాలో తెలియనిదీ, తెలిసినా చెప్పడానికి రానిది
అదే ప్రేమంటే......         
కళ్ళలో స్పష్టం గా కనిపించేది, కనిపించినా చదవడానికి రానిది
అదే ప్రేమంటే.......
ఎంత వెతికినా దొరకనిదీ, దొరికినా గ్రహించ లేనిది
అదే ప్రేమంటే.........
ఆప్యాయత లో కనిపించేది, కనిపించినా గమనించనిది
అదే ప్రేమంటే............
మనిషికి ప్రాణం లాంటిది, ప్రాణానికే ప్రాణమైనది
అదే ప్రేమంటే, అదే ప్రేమంటే.........

నాకిష్టం........

నాకిష్టం నీ బందీగా ఉండడం, నీ ప్రేమ పాశం లో చిక్కుకుని ఉండడం
నాకిష్టం నీలో నేను ఐక్యం అవడం, నీ కష్టసుఖాల్లో నీ నీడనవడం
నాకిష్టం నిను అనుక్షణం స్మరిస్తూ ఉండడం, ఒంటరిగా ఉన్నా దినమంతా నీతో గడపడం
నాకిష్టం నీ వెచ్చని ఊపిరి తాకుతూ ఉండడం, నీ చేతిలో చేయివేసి నడుస్తూ ఉండడం
నాకిష్టం నీ చక్కని పిలుపుకి ఊ కొడుతూ ఉండడం, నీ కలలని నా కళ్ళతో చూడడం
నాకిష్టం నీతో నా జీవితాన్ని పంచడం, నిన్నే చూస్తూ నా ఆఖరి శ్వాస వదలడం   


సాంత్వన

గుండెలోని బాధ కన్నీరుగా మారి నా చెక్కిలిపై జారితే
మూసిన కంటి నుండి జారిన చుక్కని నీ నాలుక స్పృశిస్తే
తెరిచిన నా కళ్ళు స్వచ్చమైన నీ మందహాసాన్ని ఆస్వాదిస్తే
గుండెలో రేగిన గాయానికి నీ మనసు ప్రేమ లేపనం పూస్తే
మనసుకి మనసు తోడై నాలో సాంత్వన కలిగిస్తే
ప్రేమబంధానికి నిర్వచనం నువ్వు నేనుల మనం అయితే
భూమి మీద స్వర్గం, చేతిలో వైకుంఠం మనం సృస్టిస్తే...........


ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి




 ఇక్కడ అబ్బాయి:

                                                  
మనసు లోని భావాన్ని నీకు తెలపాలంటే ఎలా
పెదాలపై వచ్చే నీ పేరుని ఆపాలంటే ఎలా
విశ్రాంతి లేని నీ జ్ఞాపకాలని ప్రక్కన పెట్టాలంటే ఎలా
నా మనసుని నా వశం చేయాలంటే ఎలా

ప్రతీక్షణం కలిగే అలజడి అణచాలంటే ఎలా
నీకోసం కొట్టుకునే ఈ గుండెని ఓదార్చాలంటే ఎలా
నువ్వులేని క్షణాన్ని గడపాలంటే ఎలా
నేను నీవాడినయ్యాను నిన్ను నా దాన్ని చేయాలంటే ఎలా


అక్కడ అమ్మాయి:


నేను నీ చెవిలో నిన్ను ప్రేమిస్తున్నా (I love you) అని అన్నప్పుడు
నీ మనసులోని ఆలోచనలు ఒక్క క్షణం ఆగుతాయి
నీ గుండె చప్పుడు నేను కూడా(me too) అన్నట్టు నాకు వినబడుతుంది
ఆ క్షణం నాలో కలిగే ఉద్వేగం నా కళ్లలోని మెరుపై నిన్ను తాకుతుంది
నీ పెదాలపై వచ్చిన చిరునవ్వు స్వర్గం ఇక్కడే ఉంది కదా అంటుంది
ఆ క్షణం నేను నిన్ను హత్తుకుని నీ చెవిలో 'నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటాను.

Wednesday 21 January 2015

                       వాట్సాప్ కి లేఖ


  ప్రియమైన వాట్సాప్,
       ఎలా ఉన్నావ్? నిన్ను అడగకూడదులే. ఎందుకో ఈ రోజు నీతో మాట్లాడాలని అనిపించింది. బహుశా మూడు సంవత్సరాలు అయిందేమో నువ్వు పుట్టిన సంగతి నాకు తెలిసి. మా అబ్బాయి నువ్వు ఎంత బావుంటావో, ఏమేమి చేస్తావో, నీ వెంట ఎంతమంది పిచ్చి వాళ్ళు అవుతున్నారో అన్నీ చెప్పేవాడు. ఏమో నా ఊహకి అందలేదు ఆరోజు. తరువాత కొన్నాళ్ళకి నేను కూడా ఒక  మొబైల్ కొన్నాను. అపుడు మా అబ్బాయి నిన్ను చూపించి చూడు ఎంత అందమో, ఆ కళ్ళు చూడు ఆ కళ చూడు. చెప్పొద్దూ ... నాకేమీ నువ్వు అంత అందంగా కనిపించలేదు. జనమంతా వెర్రెక్కిపోతుంటే తిట్టాను కూడా. నిన్నే కాదు నీ అక్క చెల్లెళ్ళు ఫేస్ బుక్’, హ్యాంగౌట్ లను కూడా తిట్టేదాన్ని. ఏదో మీ అన్న ట్విటర్ మాత్రం కొద్దిగా నచ్చేవాడు, ఏదో సమాజానికి కాస్త ఉపయోగపడుతున్నాడని. మీ అమ్మ ని కూడా తిట్టేదాన్ని రోజుకి ఒకటో రెండో పిల్లల్ని కనేస్తోంది అని.
      ఆ రోజు నువ్వు అనుకుని ఉంటావు ఎలాగైనా దీన్ని వశం చేసుకుందామని, పగ తీర్చుకుందామని. అయితే నీ పగ నా పాలిట వరమైంది, నా సంతోషానికి నిలమైంది. ఆరోజు తిట్టాను, ఈరోజు మెచ్చాను. అయినా నువ్వు ఊహించే ఉంటావులే. నీవల్ల నా కళ్ళు మెరుస్తున్నాయి. నాకు ఉదయం నిన్ను చూడడంతో మొదలవుతోంది. నువ్వందించే వినోదం, సమాచారం నా దినచర్యలో భాగమైంది. ఎందరో చిన్ననాటి మిత్రులతో కబుర్లు, వాళ్ళ ఫోటోలు. మీ అక్క ఫేస్ బుక్ కి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఒకసారి ఎవరో దాన్ని బాగా పొగిడారు. దానివల్ల చిన్ననాటి స్నేహితులు కలుస్తున్నారని. అపుడు నేను బాగా వాదించాను “ఏమి లాభం పక్కవాడు చస్తే పట్టించుకోరు కానీ ఎక్కడో కుక్క చచ్చిపోతే పరామర్శిస్తారు” అని. అంటే అందులోనూ నిజం లేకపోలేదనుకో.

       ఇపుడు నువ్వు మనుషుల మనస్తత్వం తెలిపే సాధనం కూడా అయ్యావుట. ఇందాకే చదివా ఎలాంటి టెక్స్ట్ చేసేవారు ఎలా ఆలోచిస్తారు, వల్ల మనస్తత్వం ఏమిటి, వాళ్ళ నడవడి ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకుంటున్నారుట మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇంకేమి కావాలి చెప్పు నీకు. నీ జీవితం సార్థకం అయిందిపో. అయితే ఒక చిన్న మనవి. ప్రజల భవిష్యత్తుతో ఆడుకోకు. యువతరం నీ ప్రేమలో పడి వాళ్ళ కెరీర్ ని విస్మరించనీయకు. 
    ప్రపంచం  చిన్నదా, పెద్దదా??

వేల మైళ్ళ దూరంలో ఉన్న వారికి సందేశం సెకన్ల లో పంపినపుడు చిన్నదే,
 వెనుక వీధిలో ఉన్న బంధువులని కలవడానికి వెళ్లాలంటే పెద్దది.

మనవల్ల అయిన తప్పుకి వంద  విమర్శలు దొరికినపుడు చిన్నదే,
 అవసరమైనపుడు చిన్న సహాయం కోసం చూసే వేళ పెద్దది.

మనకి నచ్చని వాళ్ళ గురించి వెతికే వేళ చిన్నదే,
మనకు నచ్చిన వాళ్ళని వెతికే వేళ చాలా పెద్దది.

పిల్ల పెళ్ళికి సంబంధం వెతికే వేళ చిన్నదే,
ఇంటి నుండి పిల్లలు తప్పిపోయిన వేళ పెద్దది.


సమస్య వచ్చినపుడు పరామర్శ దొరికే వేళ చిన్నదే,
ఒక సీసాడు రక్తం కావలసి వచ్చినపుడు పెద్దది.

విహారయాత్రకి ప్రణాళిక వేసే వేళ చిన్నదే,
తల్లితండ్రులని కలవడానికి వెళ్ళే వేళ పెద్దది.

కొన్ని గంటల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించే వేళ చిన్నదే,

ఒక విమానం కనపడకుండా పోయిన వేళ నిజంగా చాలా పెద్దది.

Tuesday 20 January 2015

                             అమ్మ పుట్టడం                  
ఇప్పుడే ఒక ఫ్రెండ్ ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ చూశాను. అది ఏమిటంటే “A mother is born with every (first) baby”.
నిజంగా ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. మనసుని ఎక్కడో సన్నగా మీటినట్టు అయింది.

బిడ్డతోపాటు అమ్మ పుట్టడం

ఇది చూడగానే నా మనసు ఒక పదహారు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది.
మధ్యాహ్నం రెండు గంటల సమయం.
ఎవరో చెంప మీద కొడుతుంటే మెలకువ వచ్చింది. ఎదురుగా ఒక పెద్ద ఆకారం(నాకు పురుడు పోసిన డాక్టరమ్మ కొంచం భారీ శరీరం లెండి) నన్ను చెంప మీద టపా టపా కొడుతూండడం చూశాను. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న ఒక మూట లాంటి దాన్ని నా గుండెలమీద పడేసి చూసుకో నీ కొడుకు అని ఆవిడ వెళ్ళిపోయారు. చుట్టూ మా అమ్మ, మా వారి అమ్మమ్మ ఇంకా కొంతమంది బంధువులు ఉన్నారు. ఆపరేషన్ కి ఇచ్చిన మత్తు ఇంకా పూర్తిగా వదలలేదు. ఆ మత్తులో కూడా నా బిడ్డను మొదటి సారి తాకడం ఇంకా నాకు గుర్తు ఉంది.

నిజంగా ఆరోజే నేను పుట్టానేమో అని అనిపిస్తోంది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే. వాడితో పాటు నేను కూడా ఎదిగాను. దినచర్య లో వాడి పనులు తప్ప వేరేవి ఉండేవే కావు. వాడికి తినిపిస్తూ సిరెలాక్ తిన్నాను. మెత్తగా అన్నం కలిపి ముందు నేను రుచి చూసి వాడికి పెట్టేదాన్ని. పళ్ళు గుజ్జులా చేసి తింటుంటే పక్కింటి ఆవిడ అడిగేవారు కూడా మీరు కూడా మీ అబ్బాయి తో పాటూ గుజ్జు తింటున్నారే అని.
ఇక వాడితో ఆడిన ఆటలు లెక్క లేదు. రెండు అంగుళాల కారు బొమ్మతో ఇద్దరం రెండు గంటలు ఆడుకునేవాళ్లం. బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఇంకా సరే సరి. వాడు పాకడం మొదలు పెట్టకా నేను కూడా రోజంతా పాకుతూనే ఉండేదాన్ని వాడి వెనక. ఇక వాడితో పరుగు పెడుతూ పట్టుకో పట్టుకో అంటూ ఆడుతుంటే మేడ మీద బామ్మగారు “బాయి లహాన్ ఝాలి(మరాఠి లో ఈవిడ చిన్నపిల్ల అయింది అని)” అంటుంటే భలే బావుండేది. వాడికి కొంచం మాటలు వచ్చాక ఇద్దరం అక్క, తమ్ముడు లేదా అన్న చెల్లి ఆటలే రోజంతా. ఒక రోజు నేను అక్క వాడు తమ్ముడు, రోజంతా అక్కా అనేవాడు. ఇంకొకరోజు వాడు అన్న నేను చెల్లెలు. నేను అక్క అయిన రోజు పొరపాటున అమ్మా అని పిలిచేవాడు కానీ వాడు అన్న ఉన్నప్పుడు మాత్రం పేరు పెట్టే పిలిచేవాడు అస్సలు మర్చిపోకుండా. అవి తే ఇవి తే నేను నీకంటే పెద్ద, నా మాట వినాలి అని గదమాయించేవాడు కూడా.
నిజంగా వాడితో ఎదిగాను. వాడిని చదివిస్తూ నేను ఎన్ని విషయాలు నేర్చుకున్నానో. వాడికి నేర్పించడానికి ఇంగ్లిష్ నేర్చుకున్నాను. వాడితో సమానం గా చిన్న పిల్లని అయి అల్లరి చేశాను. ఇప్పటికీ ఒక టీనేజర్ లాగా వాడితో సమానం గా సినిమాలు, రోడ్డు పక్కన పాని పూరీ తినడం లాంటి పనులు, ఏడిపించడం లాంటివి చేస్తూనే ఉన్నాను.
నిజంగా మొదటి బిడ్డతో అమ్మ పుడుతుంది. అంతవరకూ ఎలా గడిపిందో గుర్తు ఉండకపోవచ్చు కానీ బిడ్డతో పాటూ ఎదిగిన ఒక్క క్షణం కూడా ఆమె మరచిపోలేదు.
ఇంత మంచి వాక్యం పోస్ట్ చేసిన ఫ్రెండ్ కి కృతజ్ఞతలతో............



Monday 19 January 2015

సరోగసి....... సరోగసి........ ఆరోగ్య సమస్యలు వుండి బిడ్డలను కనలేని వారికి ఒక వరంగా భావిస్తున్నారు చాలా మంది. విజ్ఞానం రెండువైపులా పదును వున్న కత్తి లాంటిది.

సినిమా తారలూ, ధనవంతులు ఈ విజ్ఞానాన్ని వాడుకుంటున్నపుడు కలిగిన ఒక భావన:

              సరోగసి – ఒక వికృత పరిణామం
       కడుపులో పిండం అమ్మా అని పిలిచినట్లు అనిపించి ఉలిక్కిపడింది సీత. ఆరు సంవత్సరాల కుసుమ అమ్మా అన్నం పెట్టవా అని అడిగాకా ఈ లోకంలోకి వచ్చింది. అన్నం తింటున్న కుసుమ ముద్దు ముద్దు మాటలతో “అమ్మా, తమ్ముడు పుడతాడా, చెల్లి పుడుతుందా?” సమాధానం చెప్పలేని అయోమయ పరిస్థితి సీతది. అన్నం తిను బంగారూ అని ముద్దలు తినిపిస్తోంది. “ మరే.. నా ఫ్రెండ్ సుమ ఉంది కదా, వాళ్ళ అమ్మకి కూడా ఇలాగే పెద్ద పొట్ట వచ్చింది. నిన్న డాక్టర్ గారు తమ్ముణ్ణి తీసారుట. అది ఇప్పుడు చూడడానికి వెళ్లింది. చెప్పమ్మా తమ్ముడా? చెల్లా?” నువ్వు వెళ్ళి ఆడుకో నాకు కొంచెం పని ఉంది అని సర్ది చెప్పింది.
         ఆ చిట్టితల్లికి ఎలా చెప్పగలదు, తన కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని, తను కేవలం డబ్బు తీసుకుని గర్భం అద్దెకి ఇచ్చిందని. ఒకరికి బిడ్డని మోసే తీరిక, ఓపిక లేవు. ఇంకొకరికి కన్న బిడ్డను పోషించే స్థోమత లేదు. ఒకప్పుడు గదులని అద్దెకి ఇచ్చేవారు, ఇప్పుడు గర్భాలు అద్దెకి ఇస్తున్నారు. ఆలోచనతో గతంలోకి వెళ్లింది సీత. తనకి కుసుమ పుట్టడం, తన భర్త మరణం, కుసుమ పెంపకానికి తను పడుతున్న కష్టం అన్నీ కళ్ల ముందు గిర్రున తిరిగాయి. పెద్ద మొత్తం అందడంతో కుసుమ భవిష్యత్తు బాగు చేయవచ్చు అన్న ఆశతో గర్భాన్ని అద్దెకి ఇవ్వడానికి సరోగసి కి సిద్ధపడింది.
                              ********************
        తను ఒకప్పుడు పెరిగిన అనాథ ఆశ్రమం ఎదురుగా నిలబడింది. ఎందరో తల్లి ప్రేమని కాని తండ్రి ఆప్యాయతని కానీ రుచి చూడని పసి కందులు. నెలలు నిండని పసి పిల్లల నుండి పది సంవత్సరాల పిల్లల వరకూ ఉన్నారు ఆ ఆశ్రమంలో.
            ఇంత ముద్దులొలుకుతున్న ఈ పసి పిల్లలు ఏమి పాపం చేసారు? ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది? పిల్లల్ని కనలేని దురదృష్టవంతులు కొందరు. కనడం బరువు, కష్టం అనుకునే నిర్భాగ్యులు  కొందరు........ ఒక్కొక్క నెల నిండుతూ, కడుపులో బిడ్డ తన్నుతూ, రోజులు, నెలలు నిండుతూ, ఆ పెరుగుతున్న తన శరీర భాగాన్ని చూసుకుంటూ, నిమురుకుంటూ కలిగే అనంతమైన ఆనందాన్ని అనుభవించలేని వారికి బిడ్డ ఎందుకు? తన బీజం ఉంది కనుక తన బిడ్డ అవుతుందా? బిడ్డని సాకాలని ఉంటే ఇలాంటి అనాథలు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారే! నచ్చిన బిడ్డని దత్తత తీసుకుని ప్రేమించలేరా? ఒక నిర్భాగ్యునికి జీవితం ఇవ్వగలిగి కూడా ఎందుకు మనసు రాదు? భగవంతుడు అన్నీ సక్రమంగా ఇచ్చినా కూడా అందం కోసం, కెరీర్ కోసం, సంపాదన కోసం ఇలా అద్దె గర్భాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి బిడ్డను కని (కొని)పించుకోవడం అవసరమా? ఆ ఖర్చుపెట్టే సొమ్ములో కొంత శాతం వీరికి దొరికితే కడుపునిండా కొన్ని రోజులు తిండి తినగలరు కదా........

         ఓ శాస్త్రవేత్తా!!! సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నావని మురిసిపోతున్నావేమో! ఒకప్పుడు విశ్వామిత్రుడు చేసి భంగ పడ్డాడు. పోయే ప్రాణాన్ని ఒక్క క్షణం ఆపు చూస్తాను. వచ్చే వరదని, ముంపుని ఒక్క గంట ఆపు చూస్తాను. వర్షపు చినుకు కురిపించు చూస్తాను. ప్రపంచానికి పట్టిన భూతాల్లో ఈ సరోగసి ఒకటి. ఇన్నాళ్ళు నా గర్భంలో ఊపిరి పోసుకుంటున్న ఈ పసికందు ఒక రాజభోగం అనుభవించడానికి వెళ్తుంది. కానీ ఈ అనాథలు అదే పలుచటి పప్పు, అన్నం తింటూ...... మంచి రోజులకోసం ఎదురు చూస్తూ...... దయా హృదయం గల దాతలకై ఎదురుచూపులు చూస్తూ...... చూస్తూ.....


ఆరు సంవత్సరాల పసిపాప న్యూస్ చదివి కదిలిన సమయం లో రాసినది.

                        బంగారు తల్లి
బంగారుతల్లీ....... ఇంకా పది రోజులు రా.... ఈ సుందర ప్రపంచం లోకి ఆహ్వానం రా చిట్టితల్లీ.... ఉదయం నుండి బాగా తన్నుతున్నావ్. ఇంకా పదిరోజులు రా నా గుండెల మీద ఆడుకోవడానికి...... నా కలల రాకుమారీ........

అమ్మా భయం వేస్తోంది....... నేను నీ గర్భంలోనే ఉండిపోతానమ్మా..... బయటకి రాను....

అదేమి చిన్నితల్లీ.... ఈ ప్రపంచం ఒక సుందర వనం, ప్రేమ మయం, ఆనంద భరితంరా నా చిట్టి హనీ..........

లేదమ్మా.... ఒక అరణ్యం.... కామ మయం.... దుఃఖ భరితం..... మృగాలు తిరిగే కీకారణ్యం... నాకు చూడాలని లేదమ్మా.... భయంగా ఉంది.

అవునురా కన్నా... నువ్వు చెప్పినది నిజం.... మృగాలు... మృగాలకి కూడా కోపం ఈ రాక్షసులని వాళ్ళతో పోలిస్తే..... నీతి నియమాలు లేవురా వీళ్ళల్లో......
            నిజమే కదా, ఆరు సంవత్సరాల పసి ప్రాణం. కొందరు దుర్మార్గుల  ఆకలికి బలి అయ్యింది. చిట్టితల్లి పాపం స్కూల్ కేగా వెళ్లింది? ఇంత రాక్షసత్వం ఏ యుగం లోనూ లేదే... అసలు ఎలా??? ఎలా ఇలాంటి ఆలోచన వచ్చింది??? ఎటు పోతోంది ఈ ప్రపంచం??? ఏమిటి ఈ జబ్బుకి వైద్యం?? ఒకప్పుడు ఎదిగిన ఆడపిల్లని బయటకి పంపించాలంటే భయపడేవారు తల్లిదండ్రులు.... ఇపుడు ఈ పసి కందులని ఎలా కాపాడుకోవడం??

ఏమి నేరం చేసింది ఆ బంగారు తల్లి.... అర్థ నగ్న దుస్తులు వేసిందా?? బరితెగించి అర్థరాత్రి రోడ్డున తిరిగిందా?? మాదకద్రవ్యాల బారిన పడిందా???? ఏమి పాపం చేసింది??


అలాంటి దుర్మారుగులను కన్న తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో కదా... ఈ మృగాన్ని పురిటిలో ఎందుకు చంపేయలేదు అని కుమిలిపోతోందేమో....... నా చేత్తో నరికెద్దామ్ అన్నంత కోపాగ్నిలో రగిలిపోతోందేమో...........

Friday 16 January 2015

బాపు గారికి నివాళి

స్నేహానికి  నిర్వచనం బాపురమణీయం. 

మొన్నెప్పుడో భరణి గారు రాసారు "బాపూ ..నేనోయ్  వెంకట్రావుని, దిక్కుమాలిన స్వర్గం నించి  రాస్తున్నా..." అని.
ఆ దిక్కుమాలిన స్వర్గానికి వెళ్లాలని అంత తొందరెందుకు?

పెళ్ళికూతురి  ఫోటో చూసి  "బాపు బొమ్మలా ఉంది అమ్మాయి" అని అంటే నూటికి నూరు  పడినట్లే. "బాపు బొమ్మ" అనే పదం, అందానికి కొలమానం.  తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ఎవ్వరికైనా.. బాపు కార్టూన్ల గురించి చెప్పనక్కర్లేదు.  ఆ బొండాం లాంటి భార్యా, ఆ బక్క చిక్కిన భర్త...... చూస్తూనే కడుపుబ్బా  నవ్వే మరి.... ఇక అడ్డెడ్డే, భడవా, చవట, దద్దమ్మా ... ఇలా ఎన్ని కొత్త పదాలు  నిఘంటువును చేరాయో? అమ్మ పిల్లలతో మాట్లాడుతూ నాన్నారొస్తారు,  'నాన్నారు  నీకు తాయిలం తెస్తారు' ఇలాంటి మాటలు వింటే  నాన్న మీదున్న ప్రేమంతా అమ్మ కళ్ళల్లో  కనబడదూ?

సినిమాల్లో తెలుగుదనం అంటే  బాపు చూపించినదే కదా? రామాయణాన్ని పౌరాణికం గాను, అదే రామాయణాన్ని మన జీవితాలకి ఆపాదిస్తూ  సాంఘీకంగాను  చిత్రీకరించడం ఆయనకే చెల్లింది కదూ! సీతారాముల  బొమ్మ అయినా, రాధాకృష్ణుల బొమ్మ అయినా ........అవే గీతలు అయినా  ఎంత జీవం  ఉట్టి పడుతుందీ!! చిన్ననాటి స్నేహం  చివరి వరకూ సాగిన బాపూ రమణీయం. మరణం కూడా ఎక్కువ కాలం వేరు చేయలేకపోయిందే!!  ఆవకాయ అన్నం ముద్దలు కలిపి ప్రేమను తినిపించడం ఆయనకు తెలిసినంత ఎవరికి తెలుసు? భార్యా భర్తల అనురాగం త్రాసుకి ఇరువైపులా బేరీజు వెయ్యడం  ఆయనకే సాధ్యం. 

ఒక కలం అన్నివేల బొమ్మలని ఎలా గీసింది?........రమణ గారితో కలిసి ఆణిముత్యాలని మన లోగిల్లల్లో ముత్యాల ముగ్గులు పెట్టించిన ఘనత వారిదే కదా!  "డిక్కీలో తొంగోబెట్టేయ గలను" ఈ డైలాగుని, రావుగోపాలరావు ని మరచిపోగల తెలుగు వాడు ఉండగలడా?

తెలుగులో  ఎంత  అద్భుతమైన చిత్రాలు ఇచ్చారో? హిందీలో కూడా అలాంటి అద్భుతాలే చేసిన బాపు రమణ ద్వయం స్వర్గం లో హాయిగా కబుర్లు  చెప్పుకుంటూ ఆశేష ప్రజానీకాన్ని  భూమ్మీద శోక సముద్రం లో ముంచేస్తారా, ఇది మీకు న్యాయమా?

"బుడుగు" పిల్లల్నే కాదు పెద్దలనీ అలరించే చిచ్చర పిడుగు.  కళా చిత్రాలూ, కమర్షియల్ చిత్రాలు వేరుగా ఉండవని నిరూపించిన  అతి కొద్దిమంది దర్శకులలో బాపూది అగ్ర స్థానం. ప్రతి పెళ్లి వీడియోలోనూ పెళ్ళిపుస్తకం పాట ఉండవలసినదే!ఆ జెడ, కళ్ళు, కవళికలు ...........మాటలు  అవసరమా భావాన్ని పలికించడానికి? ......జెడతో కూడా  మాట్లాడించగల నేర్పరి మన బాపు.

ఆడవారి ప్రతిభనీ, పురుషాధిక్యతని  ఎంత రమణీయంగా చిత్రీకరించారు! శేషతల్పం పై ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి  స్థానాలు తారుమారు కావాలని కోరితే అటు ఉన్న శిరస్సును ఇటు మార్చి........ఆహా హృదయానికి హత్తుకు పోలేదూ ఆ సన్నివేశం! ఆలుమగల అనురాగం ఎంత రమణీయంగా చిత్రించారో  అత్తగారి ఆరళ్ళూ అంతే  అందంగా... ఎవరు చేయగలరు ఆ సాహసం?

అత్తవారింటికి వెళ్తున్న కూతురికి తండ్రి నేర్పిన బాధ్యత, తండ్రి ఇచ్చిన ఆస్తీ అతి కొద్ది సంభాషణలతో తెరపై పలికించిన కాంతారావు వాణిశ్రీ  ల సన్నివేశం ప్రతీ స్త్రీకీ ఒక పాఠం కాదూ! బాల్యం నుంచీ మద్రాసులో గడిపినా కూడా తెలుగుదనాన్ని, తెలుగు భాషనీ నర నరాల్లో జీర్ణించుకున్నఆ మహానుభావుల ద్వయం మన తెలుగు చిత్ర సీమకీ, తెలుగు జాతికీ ఒక వరం. ఇటువంటి మహానుభావుల రాక ఇకపై అసంభవం.

ఎన్ని అవార్డులూ, బిరుదులూ అందుకున్నా...కించిత్ గర్వం కూడా తలకు తగలని, ప్రతీ అమ్మాయికీ నాన్నారులా, ప్రతీ తెలుగువాడికీ తండ్రి లాంటి ఓ బాపూ నీ నిష్క్రమణ భౌతికము. తెలుగు వారి గుండెల్లో కలకాలం కొలువుండే నీకు మా ఆశ్రు నివాళి. 

-       శోక సముద్రం లోని ఓ కన్నీటి బిందువు.