Monday 26 January 2015

నా పరవాన్నం పాట్లు



     రథసప్తమి కదా అని ఉదయాన్నే పాలు పొంగించాను. సూర్యభగవానునికి చూపించి తిందామని ఆశ. మాది తూర్పు ముఖ ద్వారం ఉన్న అపార్టుమెంటు కానీ సూర్యుని దర్శనం 12 గంటలు అయితే కానీ కాదు. సరే మనమే సూర్యుని కనిపించే వైపు వెళ్తే సరి అని వేడి వేడి గిన్నెతీసుకుని పదకొండు అంతస్థులు ఎక్కి పైకి వెళ్తే అక్కడ తలుపులు మూసి ఉన్నాయి. సొసైటి ఆఫీసులో అనుమతి తీసుకుందామని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఏమి పనో వివరిస్తూ ఒక అర్జీ పెట్టుకుంటే తలుపు తీస్తాం అన్నారు. పోనీలే ఈ తంటాలు ఎందుకు అని కిందనుండి నుండి ఎక్కడైనా సూర్యభగవానుని దర్శనం కాకపోతుందా అని ఆ గిన్నె పట్టుకుని వెతికాను. చూడొస్తే చాలా దూరం నడిస్తే లేదా బండి తీస్తే కానీ సూర్యుని దర్శనం కనిపించే అవకాశం లేదు. ఈలోపు ఇంకో ఉపాయం తట్టింది. మా ఎదురి ఫ్లాట్ బాల్కనీ లోంచి సూర్యుడు కనిపించచ్చు అని వారి తలుపు తట్టాను. ఎదురెదురు గుమ్మమే కానీ ఈ సంవత్సరం కాలం లో నన్ను ఆవిడ, ఆవిడని నేను ఏదో ఒకటో రెండో సార్లు లిఫ్ట్ లో ఒకళ్లని ఒకరు చూసుకున్నామేమో. తలుపు తీసిన ఆమెకి నేను మీ ఎదురుగా ఆ నాలగు అడుగుల దూరం లో ఉన్న ఆ ఇంట్లో ఉంటాను అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నవ్వనా వద్దా అన్నట్టు ఒక చిన్న నవ్వు నవ్వింది ఆవిడ.
        ఆవిడకి అర్థం అయ్యేలా నా పాట్లు చెప్పి మీ బాల్కనీ లోంచి ఒక్కసారి సూర్యుడిని చూసుకోనా అని బ్రతిమాలి వెళ్తే అక్కడ కూడా సూర్యుని దర్శనం కాలేదు ఎందుకంటే ఈలోపు పదకొండు గంటలు దాటిపోయింది. అప్పటికే ఇంట్లో వాళ్ళు సూర్యుడు అక్కడ ఉన్నాడు నీకు కనిపించినా లేకపోయినా తూర్పు వైపు తిరిగి నైవేద్యం పెట్టేసుకో అని సలహాలు పడేసారు. ఈలోపు నా వంటగది కిటికీ లోంచి నెత్తిమీదకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. హమ్మయ్య అనుకుని నైవేద్యం పెట్టి గాజు కప్పుల్లో పరవాన్నం వడ్డించా అందరికీ.
        మా చిన్నప్పుడు అమ్మ తులసి కోట దగ్గర ఆవుపేడతో చేసిన  పిడకలతో పొయ్యి పెట్టి దానిలో ఇత్తడి గిన్నెతో పాలు పెట్టేది. అవి పొంగి పొయ్యిలో పడేవి. అయ్యో అమ్మా పొంగిపోతున్నాయి అంటే అగ్నిహోత్రుడికి అనేది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ పొయ్యి లో పడితే షాక్ కొడుతుందేమో లేదా అది పాడు అవుతుందేమో ఓనరు ఏమంటాడో అని భయం. పాలు అగ్నిహోత్రుడు కొన్ని తాగాకా అమ్మ బియ్యం వేసేది. అది బాగా ఉడికే వరకూ మాకు ఆత్రం పెరుగుతూ ఉండేది. ఈ లోపు అమ్మ చిక్కుడుకాయలు పుల్లలు పెట్టి రథాలు చేసేది. ఈ రోజునుండి సూర్యుడు రథం మీద ప్రయాణం మొదలు పెడతాడు అంటే మనకి ఎండలు పెరుగుతాయి ఇక్కడ నుంచి అని. అందరినీ నెత్తి మీద జిల్లేడి ఆకు రేగుపండు పెట్టుకుని స్నానం చేయమనేది అలాగే చేసేవాళ్లం. ఇప్పుడు పిల్లలకి చెప్తే let me google it mom అన్నారు. అది ఎందుకో తెలిస్తే కానీ చేయరుట. మేము ఎప్పుడూ ఇలా అన్నట్లు గుర్తు లేదు. పెద్దవాళ్ళు చెప్పారు చేయాలి అనుకునేవాళ్లం. పిల్లలు విజ్ఞాన వంతులు అవుతున్నారు అని సంతోషించడమే. బాగా ఉడికాక అందులో బెల్లం వేసి ఇంకా ఉడికించేది అమ్మ బాగా పాకం వస్తుందని. ఇప్పుడు బెల్లం వేస్తే పరవాన్నం విరిగి చక్కా పోతుంది. పొయ్యి మీదనుంచి దింపి ఒక్క పది నిమిషాల తరువాత పొడి చేసిన బెల్లం వేస్తే విరగదు అని టి‌వి వంటల్లో సలహా ఇచ్చారు లెండి ఒక సారి. వేడి వేడి పరవాన్నం చిక్కుడాకుల్లో పెట్టి తినడానికి ఇచ్చేది అమ్మ. ఎంత రుచిగా ఉండేదో ఆ పరవాన్నం. రోజంతా తరిగిన కూర తినకూడదని తరగకుండా వన్డే కూరలని వండి భోజనం చేసేవాళ్లం. ఏది ఏమైనా పూర్వం రోజులలో పండగల సందడే వేరు. ఈ మహా నగరాల్లో ఏదో మనసు పీకడం వల్ల విధానాలని పరిస్థితులకు తగినట్టు కుదించేసుకుని వాడేసుకుంటున్నాం. పండగ మేము కూడా చేసుకున్నాం అనేసుకుంటున్నాం.
        


1 comment: