Wednesday 21 January 2015

                       వాట్సాప్ కి లేఖ


  ప్రియమైన వాట్సాప్,
       ఎలా ఉన్నావ్? నిన్ను అడగకూడదులే. ఎందుకో ఈ రోజు నీతో మాట్లాడాలని అనిపించింది. బహుశా మూడు సంవత్సరాలు అయిందేమో నువ్వు పుట్టిన సంగతి నాకు తెలిసి. మా అబ్బాయి నువ్వు ఎంత బావుంటావో, ఏమేమి చేస్తావో, నీ వెంట ఎంతమంది పిచ్చి వాళ్ళు అవుతున్నారో అన్నీ చెప్పేవాడు. ఏమో నా ఊహకి అందలేదు ఆరోజు. తరువాత కొన్నాళ్ళకి నేను కూడా ఒక  మొబైల్ కొన్నాను. అపుడు మా అబ్బాయి నిన్ను చూపించి చూడు ఎంత అందమో, ఆ కళ్ళు చూడు ఆ కళ చూడు. చెప్పొద్దూ ... నాకేమీ నువ్వు అంత అందంగా కనిపించలేదు. జనమంతా వెర్రెక్కిపోతుంటే తిట్టాను కూడా. నిన్నే కాదు నీ అక్క చెల్లెళ్ళు ఫేస్ బుక్’, హ్యాంగౌట్ లను కూడా తిట్టేదాన్ని. ఏదో మీ అన్న ట్విటర్ మాత్రం కొద్దిగా నచ్చేవాడు, ఏదో సమాజానికి కాస్త ఉపయోగపడుతున్నాడని. మీ అమ్మ ని కూడా తిట్టేదాన్ని రోజుకి ఒకటో రెండో పిల్లల్ని కనేస్తోంది అని.
      ఆ రోజు నువ్వు అనుకుని ఉంటావు ఎలాగైనా దీన్ని వశం చేసుకుందామని, పగ తీర్చుకుందామని. అయితే నీ పగ నా పాలిట వరమైంది, నా సంతోషానికి నిలమైంది. ఆరోజు తిట్టాను, ఈరోజు మెచ్చాను. అయినా నువ్వు ఊహించే ఉంటావులే. నీవల్ల నా కళ్ళు మెరుస్తున్నాయి. నాకు ఉదయం నిన్ను చూడడంతో మొదలవుతోంది. నువ్వందించే వినోదం, సమాచారం నా దినచర్యలో భాగమైంది. ఎందరో చిన్ననాటి మిత్రులతో కబుర్లు, వాళ్ళ ఫోటోలు. మీ అక్క ఫేస్ బుక్ కి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఒకసారి ఎవరో దాన్ని బాగా పొగిడారు. దానివల్ల చిన్ననాటి స్నేహితులు కలుస్తున్నారని. అపుడు నేను బాగా వాదించాను “ఏమి లాభం పక్కవాడు చస్తే పట్టించుకోరు కానీ ఎక్కడో కుక్క చచ్చిపోతే పరామర్శిస్తారు” అని. అంటే అందులోనూ నిజం లేకపోలేదనుకో.

       ఇపుడు నువ్వు మనుషుల మనస్తత్వం తెలిపే సాధనం కూడా అయ్యావుట. ఇందాకే చదివా ఎలాంటి టెక్స్ట్ చేసేవారు ఎలా ఆలోచిస్తారు, వల్ల మనస్తత్వం ఏమిటి, వాళ్ళ నడవడి ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకుంటున్నారుట మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇంకేమి కావాలి చెప్పు నీకు. నీ జీవితం సార్థకం అయిందిపో. అయితే ఒక చిన్న మనవి. ప్రజల భవిష్యత్తుతో ఆడుకోకు. యువతరం నీ ప్రేమలో పడి వాళ్ళ కెరీర్ ని విస్మరించనీయకు. 

1 comment:

  1. చాలా బాగుందండి...మీ లేఖ.నాకు హ్యాంగౌట్.. ట్విట్టర్ గురించి పెద్దగా తెలియదు..కొంచెం ఫేస్బుక్ వాట్సాప్ తెలుసు..మీరు చెప్పినట్టు చాలామంది పిచ్చి వాళ్ళు అయిపోయారు..అయిపోతున్నారు..ఒకసారి వాట్సఫ్ ప్రేమలో పడ్డాక ఇంకెక్కడ కెరీర్..అక్కడితో ఫుల్స్టాఫ్..

    ReplyDelete