Tuesday 20 January 2015

                             అమ్మ పుట్టడం                  
ఇప్పుడే ఒక ఫ్రెండ్ ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ చూశాను. అది ఏమిటంటే “A mother is born with every (first) baby”.
నిజంగా ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. మనసుని ఎక్కడో సన్నగా మీటినట్టు అయింది.

బిడ్డతోపాటు అమ్మ పుట్టడం

ఇది చూడగానే నా మనసు ఒక పదహారు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది.
మధ్యాహ్నం రెండు గంటల సమయం.
ఎవరో చెంప మీద కొడుతుంటే మెలకువ వచ్చింది. ఎదురుగా ఒక పెద్ద ఆకారం(నాకు పురుడు పోసిన డాక్టరమ్మ కొంచం భారీ శరీరం లెండి) నన్ను చెంప మీద టపా టపా కొడుతూండడం చూశాను. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న ఒక మూట లాంటి దాన్ని నా గుండెలమీద పడేసి చూసుకో నీ కొడుకు అని ఆవిడ వెళ్ళిపోయారు. చుట్టూ మా అమ్మ, మా వారి అమ్మమ్మ ఇంకా కొంతమంది బంధువులు ఉన్నారు. ఆపరేషన్ కి ఇచ్చిన మత్తు ఇంకా పూర్తిగా వదలలేదు. ఆ మత్తులో కూడా నా బిడ్డను మొదటి సారి తాకడం ఇంకా నాకు గుర్తు ఉంది.

నిజంగా ఆరోజే నేను పుట్టానేమో అని అనిపిస్తోంది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే. వాడితో పాటు నేను కూడా ఎదిగాను. దినచర్య లో వాడి పనులు తప్ప వేరేవి ఉండేవే కావు. వాడికి తినిపిస్తూ సిరెలాక్ తిన్నాను. మెత్తగా అన్నం కలిపి ముందు నేను రుచి చూసి వాడికి పెట్టేదాన్ని. పళ్ళు గుజ్జులా చేసి తింటుంటే పక్కింటి ఆవిడ అడిగేవారు కూడా మీరు కూడా మీ అబ్బాయి తో పాటూ గుజ్జు తింటున్నారే అని.
ఇక వాడితో ఆడిన ఆటలు లెక్క లేదు. రెండు అంగుళాల కారు బొమ్మతో ఇద్దరం రెండు గంటలు ఆడుకునేవాళ్లం. బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఇంకా సరే సరి. వాడు పాకడం మొదలు పెట్టకా నేను కూడా రోజంతా పాకుతూనే ఉండేదాన్ని వాడి వెనక. ఇక వాడితో పరుగు పెడుతూ పట్టుకో పట్టుకో అంటూ ఆడుతుంటే మేడ మీద బామ్మగారు “బాయి లహాన్ ఝాలి(మరాఠి లో ఈవిడ చిన్నపిల్ల అయింది అని)” అంటుంటే భలే బావుండేది. వాడికి కొంచం మాటలు వచ్చాక ఇద్దరం అక్క, తమ్ముడు లేదా అన్న చెల్లి ఆటలే రోజంతా. ఒక రోజు నేను అక్క వాడు తమ్ముడు, రోజంతా అక్కా అనేవాడు. ఇంకొకరోజు వాడు అన్న నేను చెల్లెలు. నేను అక్క అయిన రోజు పొరపాటున అమ్మా అని పిలిచేవాడు కానీ వాడు అన్న ఉన్నప్పుడు మాత్రం పేరు పెట్టే పిలిచేవాడు అస్సలు మర్చిపోకుండా. అవి తే ఇవి తే నేను నీకంటే పెద్ద, నా మాట వినాలి అని గదమాయించేవాడు కూడా.
నిజంగా వాడితో ఎదిగాను. వాడిని చదివిస్తూ నేను ఎన్ని విషయాలు నేర్చుకున్నానో. వాడికి నేర్పించడానికి ఇంగ్లిష్ నేర్చుకున్నాను. వాడితో సమానం గా చిన్న పిల్లని అయి అల్లరి చేశాను. ఇప్పటికీ ఒక టీనేజర్ లాగా వాడితో సమానం గా సినిమాలు, రోడ్డు పక్కన పాని పూరీ తినడం లాంటి పనులు, ఏడిపించడం లాంటివి చేస్తూనే ఉన్నాను.
నిజంగా మొదటి బిడ్డతో అమ్మ పుడుతుంది. అంతవరకూ ఎలా గడిపిందో గుర్తు ఉండకపోవచ్చు కానీ బిడ్డతో పాటూ ఎదిగిన ఒక్క క్షణం కూడా ఆమె మరచిపోలేదు.
ఇంత మంచి వాక్యం పోస్ట్ చేసిన ఫ్రెండ్ కి కృతజ్ఞతలతో............



4 comments:

  1. చాలా బాగుంది అక్క చాలా చక్కగా వివరించావు.!!!

    ReplyDelete
  2. హృదయానికి హత్తుకుపోయే సన్నివేశాలు. ఇంత మంచి ఆలోచన వచ్చి అక్షర రూపంలో పెట్టినందుకు ధన్యవాదాలు. మొదటి సంతానం తో ప్రతి స్త్రీ పొందే అనుభూతి అనిర్వచనీయం. నీలో ఇంత మంచి కవిని చూడడం ఇదే మొదటిసారి నాకు. హాట్స్ ఆఫ్.

    ReplyDelete
  3. దారిన పోతూ పోతూ ఒక హోర్డింగ్ మీద కనబడిన ఒక్క వాక్యం ఇంత చక్కగా ప్రేరేపిస్తుందని అనుకోలేదు. చాలా చక్కగా...........అతి మెత్తని సున్నితంగా........మహా అద్భుతం గా రాసారు. ఇలా రాస్తూనే ఉండండి మాకోసం.

    ReplyDelete