Friday 16 January 2015

బాపు గారికి నివాళి

స్నేహానికి  నిర్వచనం బాపురమణీయం. 

మొన్నెప్పుడో భరణి గారు రాసారు "బాపూ ..నేనోయ్  వెంకట్రావుని, దిక్కుమాలిన స్వర్గం నించి  రాస్తున్నా..." అని.
ఆ దిక్కుమాలిన స్వర్గానికి వెళ్లాలని అంత తొందరెందుకు?

పెళ్ళికూతురి  ఫోటో చూసి  "బాపు బొమ్మలా ఉంది అమ్మాయి" అని అంటే నూటికి నూరు  పడినట్లే. "బాపు బొమ్మ" అనే పదం, అందానికి కొలమానం.  తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ఎవ్వరికైనా.. బాపు కార్టూన్ల గురించి చెప్పనక్కర్లేదు.  ఆ బొండాం లాంటి భార్యా, ఆ బక్క చిక్కిన భర్త...... చూస్తూనే కడుపుబ్బా  నవ్వే మరి.... ఇక అడ్డెడ్డే, భడవా, చవట, దద్దమ్మా ... ఇలా ఎన్ని కొత్త పదాలు  నిఘంటువును చేరాయో? అమ్మ పిల్లలతో మాట్లాడుతూ నాన్నారొస్తారు,  'నాన్నారు  నీకు తాయిలం తెస్తారు' ఇలాంటి మాటలు వింటే  నాన్న మీదున్న ప్రేమంతా అమ్మ కళ్ళల్లో  కనబడదూ?

సినిమాల్లో తెలుగుదనం అంటే  బాపు చూపించినదే కదా? రామాయణాన్ని పౌరాణికం గాను, అదే రామాయణాన్ని మన జీవితాలకి ఆపాదిస్తూ  సాంఘీకంగాను  చిత్రీకరించడం ఆయనకే చెల్లింది కదూ! సీతారాముల  బొమ్మ అయినా, రాధాకృష్ణుల బొమ్మ అయినా ........అవే గీతలు అయినా  ఎంత జీవం  ఉట్టి పడుతుందీ!! చిన్ననాటి స్నేహం  చివరి వరకూ సాగిన బాపూ రమణీయం. మరణం కూడా ఎక్కువ కాలం వేరు చేయలేకపోయిందే!!  ఆవకాయ అన్నం ముద్దలు కలిపి ప్రేమను తినిపించడం ఆయనకు తెలిసినంత ఎవరికి తెలుసు? భార్యా భర్తల అనురాగం త్రాసుకి ఇరువైపులా బేరీజు వెయ్యడం  ఆయనకే సాధ్యం. 

ఒక కలం అన్నివేల బొమ్మలని ఎలా గీసింది?........రమణ గారితో కలిసి ఆణిముత్యాలని మన లోగిల్లల్లో ముత్యాల ముగ్గులు పెట్టించిన ఘనత వారిదే కదా!  "డిక్కీలో తొంగోబెట్టేయ గలను" ఈ డైలాగుని, రావుగోపాలరావు ని మరచిపోగల తెలుగు వాడు ఉండగలడా?

తెలుగులో  ఎంత  అద్భుతమైన చిత్రాలు ఇచ్చారో? హిందీలో కూడా అలాంటి అద్భుతాలే చేసిన బాపు రమణ ద్వయం స్వర్గం లో హాయిగా కబుర్లు  చెప్పుకుంటూ ఆశేష ప్రజానీకాన్ని  భూమ్మీద శోక సముద్రం లో ముంచేస్తారా, ఇది మీకు న్యాయమా?

"బుడుగు" పిల్లల్నే కాదు పెద్దలనీ అలరించే చిచ్చర పిడుగు.  కళా చిత్రాలూ, కమర్షియల్ చిత్రాలు వేరుగా ఉండవని నిరూపించిన  అతి కొద్దిమంది దర్శకులలో బాపూది అగ్ర స్థానం. ప్రతి పెళ్లి వీడియోలోనూ పెళ్ళిపుస్తకం పాట ఉండవలసినదే!ఆ జెడ, కళ్ళు, కవళికలు ...........మాటలు  అవసరమా భావాన్ని పలికించడానికి? ......జెడతో కూడా  మాట్లాడించగల నేర్పరి మన బాపు.

ఆడవారి ప్రతిభనీ, పురుషాధిక్యతని  ఎంత రమణీయంగా చిత్రీకరించారు! శేషతల్పం పై ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి  స్థానాలు తారుమారు కావాలని కోరితే అటు ఉన్న శిరస్సును ఇటు మార్చి........ఆహా హృదయానికి హత్తుకు పోలేదూ ఆ సన్నివేశం! ఆలుమగల అనురాగం ఎంత రమణీయంగా చిత్రించారో  అత్తగారి ఆరళ్ళూ అంతే  అందంగా... ఎవరు చేయగలరు ఆ సాహసం?

అత్తవారింటికి వెళ్తున్న కూతురికి తండ్రి నేర్పిన బాధ్యత, తండ్రి ఇచ్చిన ఆస్తీ అతి కొద్ది సంభాషణలతో తెరపై పలికించిన కాంతారావు వాణిశ్రీ  ల సన్నివేశం ప్రతీ స్త్రీకీ ఒక పాఠం కాదూ! బాల్యం నుంచీ మద్రాసులో గడిపినా కూడా తెలుగుదనాన్ని, తెలుగు భాషనీ నర నరాల్లో జీర్ణించుకున్నఆ మహానుభావుల ద్వయం మన తెలుగు చిత్ర సీమకీ, తెలుగు జాతికీ ఒక వరం. ఇటువంటి మహానుభావుల రాక ఇకపై అసంభవం.

ఎన్ని అవార్డులూ, బిరుదులూ అందుకున్నా...కించిత్ గర్వం కూడా తలకు తగలని, ప్రతీ అమ్మాయికీ నాన్నారులా, ప్రతీ తెలుగువాడికీ తండ్రి లాంటి ఓ బాపూ నీ నిష్క్రమణ భౌతికము. తెలుగు వారి గుండెల్లో కలకాలం కొలువుండే నీకు మా ఆశ్రు నివాళి. 

-       శోక సముద్రం లోని ఓ కన్నీటి బిందువు.

4 comments:

  1. చాలా బాగా రాసారు ప్రశాంతి మీరు. ఇంకా మీ దగ్గర రాసినవి వుంటే వెంటనే ఇక్కడ పొందుపరచండి మీ కలం శక్తి సామర్ధ్యం మీ ఊహా శక్తి ప్రపంచానికి కూడా తెలియనివ్వండి. ఇంకా ఇలాంటివి ఇంకా రాస్తారని కోరుకుంటూ - ఓ అభిమాని.

    ReplyDelete
  2. నివాళులు అందరు అర్పిస్తారు, కాని అవి హృదయానికి దగ్గరయ్యేలా ఉండటం అరుదు. ఈ నివాళి ఆ అరుదైన వాటిల్లో ఒకటి. మీ శైలి బావుంది, పైన వ్యాఖ్యాత వ్రాసినవిధంగా మరిన్ని చక్కటి విషయాలు మీపద్దతిలో వ్రాయండి.

    ReplyDelete
  3. చదివినంతసేపూ బాపు గీసిన చిత్రాలు, తీసిన చిత్రాలు కళ్ళముందు సాక్షాత్కారమయ్యాయి. మీ భావవ్యక్తీకరణ అద్భుతం. ఈరోజుల్లో ముఖ్యంగా యువకుల్లో కొరవడిన భాషాభిమానం మీ రచనలో కనబడింది.

    ReplyDelete
  4. చదివినంతసేపూ బాపు గీసిన చిత్రాలు, తీసిన చిత్రాలు కళ్ళముందు సాక్షాత్కారమయ్యాయి. మీ భావవ్యక్తీకరణ అద్భుతం. ఈరోజుల్లో ముఖ్యంగా యువకుల్లో కొరవడిన భాషాభిమానం మీ రచనలో కనబడింది.

    ReplyDelete