Monday 18 July 2016

ఉత్తరం

ఉత్తరం

ఏమయ్యావమ్మా అందమైన ఉత్తరమా 
మధ్యాహ్నం ఉదయించే మా ఆశల బింబమా

తీపి కబురు తొందరగా చేదు కబురు గాఢంగా
తీసుకు వచ్చేదానివి నువు ఆదరబాదరగా

నీకొరకై ఉండేది మా మదిలో నిరీక్షణ
అది కాస్తా పెంచేది పోస్ట్ మాన్ పై ఆకర్షణ

ఆలుమగల విరహానికి నువ్వేగా సాక్ష్యం
అన్నదమ్ముల అనుబంధం పెంచడమే నీ లక్ష్యం

పుట్టింటి ఆపేక్షని మడత పెట్టి తెచ్చావు
మెట్టింటి బాధ్యతని నీ భుజాన మోసావు

స్నేహాన్ని ఒక చేత్తో కర్తవ్యం మరో చేత్తో
శుభలేఖలు శుభాకాంక్షలు చేర్చావు మురిపెంతో

ఒకసారి మరోసారి చదివి మరీ మురిసాము
జవాబుగా నీ మీదే మనసంతా పరిచాము

అక్షయపాత్రేగా మరి ఆ ఇన్లాండ్ కవరు
ఉభయకుశలోపరికి చిన్న కార్డే బెటరు

కార్డయినా కవరయినా ఇన్లాండ్ లెటరయినా
మనియార్దర్ రూపంలో ధనసాయం చేసినా

సహభాగం అయ్యావు ఊసులందించావు
మనుషులని దరి చేర్చి ఊతమందించావు

ఎస్సెమ్మెస్ వాట్సాపు ఫేసుబుక్కు ఈమెయిలు
ఏమొచ్చిన మరువలేము నువ్వు చేసిన ఈ మేలు

స్పీడు పోస్ట్ రిజిస్టర్ బుక్ పోస్ట్ ల వివరాలు
అవసరానికి తగినట్టు మారిన నీ రూపాలు

స్టాంపుల కోసం వాడిన మా ఎంగిలి నాలుకలు
తక్కువైన నాడు పడినాయి గా పెనాల్టీలు

నేడు గేటుకు తగిలించిన ఇనప రేకు డబ్బాలు
ఎమున్నాయి చూడ్డానికి మా బిల్లులు రశీదులు

మా ముత్తాతల ఉత్తరాలు చేర్చాయిట పావురాలు
మా బిడ్డలు నీ ఉనికిని ఎరుగనే ఎరుగరు

3 comments:

  1. బాగుందండి...అప్పటిరోజులను గుర్తు చేస్తూ ...పోస్టుమాన్ కోసం ఎదురుచూడడం ....లెటర్ చదివి మనం ఫీల్ అవ్వడం నిజంగా ఎంతో మరువలేని రోజులు..ఇప్పుడు వాట్సాప్ ..ఫేసుబుక్ ఎన్ని ఉన్నా..అప్పటి .తృప్తి ..సంతృప్తి లేవు..
    నిరీక్షణ...అక్షయపాత్ర.. పదాలు వాడి..మీరు ఎవరికోసం నిరీక్షించారో..ఎవరి ఇన్లాండ్ లెటర్ అక్షయపాత్ర గ...చూసారో చెబితే ఇంకా బాగుండేదేమో?

    ReplyDelete
  2. ఇన్లాండ్ కవర్ లో ఎన్ని రాసినా ఎదో మూల,మడత పెట్టె చోట నింపుతూనే ఉండేవాళ్ళు. కనుక ఇన్లాండ్ కవర్ ని అక్షయపాత్ర అన్నాను

    ReplyDelete
  3. Prasanthi garu, Chala bagundi Mee kavitKa

    ReplyDelete